నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్లో రోజంతా యువకుడు.. ఆరుగురు విద్యార్దినుల సస్పెన్షన్

కృష్ణాజిల్లా ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు మరోసారి బయటప్డాయి. నిన్న సెక్యూరిటీ కళ్లుగప్పి విద్యార్ధినుల హాస్టల్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. హాస్టల్ కిటికీ ఊచలు వంచి అతడు లోపలికి ప్రవేశించాడు. అంతే కాదు రోజంతా అక్కడే ఉన్నాడు. చివరికి విద్యార్ధినులు అతడిని ఓ గదిలో బంధించి సెక్యూరిటీకి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆగంతకుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో స్పందించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది.

గతంలోనూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల వ్యవహారాలు రచ్చకెక్కాయి. పలువురు విద్యార్ధులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. వరుస వివాదాలకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వైఖరే కారణమనే విమర్శలు ఉన్నాయి. విద్యార్ధులకు సంబంధించిన సున్నితమైన అంశాలను సైతం యాజమాన్యం పట్టించుకోవడం లేదని గతంలో ఆందోళనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ఏకంగా ఓ విద్యార్ధి తనకు సంబంధం లేని విద్యార్దినుల హాస్టల్లోకి చొరబడటం, అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, బాధ్యులుగా ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయటంతో ఈ మొత్తం వ్యవహారం సంచనలంగా మారింది. విద్యార్ధినుల సస్పెన్షన్ ను బట్టి చూస్తుంటే వారే సదరు విద్యార్ధిని లోపలికి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు విద్యార్ధికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.