అమెరికాపై బాంబ్ సైక్లోన్: చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం.!
Published on: Fri Nov 27, 2026 10:12AM

అగ్రరాజ్యం అమెరికా ఆ బాంబుతో చిగురుటాకులా వణికిపోయింది. అయితే అదేమీ శత్రదేశాలో, ఉగ్రవాదులో ప్రయోగించిన బాంబు కాదు.. అగ్రరాజ్యంలోని అట్లాంటిక్ తీర ప్రాంతంపై ప్రకృతి విసిరిన బాంబ్. అవును అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఈ తుపాను పేరే బాంబ్. బాంబ్ సైక్లోన్ అమెరికాఅట్లాంటిక్ తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపింది. బాంబ్ సైక్లోన్ ధాటికి, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీధులన్నీ వరద నీటితో పొటెత్తున్నాయి.
తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో సుమారు 9 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం, జాప్యం ఏర్పడింది.
న్యూజెర్సీలోని హొబుకెన్ ట్రాన్సిట్ రైల్వే ట్రాక్ వరద నీటిలో మునిగిపోగా, స్టోన్ హర్బర్‌లోకి భారీగా నీరు చేరింది. న్యూయార్క్ నగరం, ఆ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా జార్జి వాషింగ్టన్ వంతెనపై ట్రాలీలు, బైకుల రాకపోకలను నిషేధించారు.

ఈ తుపాను ప్రభావం అట్లాంటిక్ తీరంలోని పాతిక రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. పాతిక కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో వందేళ్లుగా జరుగుతున్న మేసిస్ థ్యాంక్స్ గివింగ్ డే పరేడ్ బాంబ్ సైక్లోన్ కారణంగా వాయిదా పడింది. వాతావరణ పీడనం 24 గంటల్లోనే అసాధారణ స్థాయిలో పడిపోయే ప్రక్రియను శాస్త్రవేత్తలు బాంబో జెనిసిస్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియతో అతివేగంగా ఏర్పడే తుపానులను బాంబ్ సైక్లోన్‌లుగా పిలుస్తారు.
ఇది కూడా చదవండి: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!
తుపాను ప్రభావం తగ్గే వరకు వర్షాలు, గాలులు, వరద పరిస్థితులపై వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలంటూ అధికార యంత్రాంగం ప్రజలకు సూచించింది. దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, నిలిచిపోయిన రవాణా సేవలను దశలవారీగా సాధారణ స్థితికి తీసుకురావడానికి యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

బాంబ్ తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకూ ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాలని అధికారులు కోరారు. సాధ్యమైనంత త్వరలోరవాణా, విద్యుత్ పునరుద్ధరిస్తామని భరోసా ఇస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: అత్యంత తీవ్ర తుపానుగా ఆక్వాన్: ఆంధ్రా తీరానికి పెనుముప్పు.!
ఏపీలో ఈ వారమంతా వానలే: తుపాను ముప్పుకూడా ఉంది.!
[Bomb cyclone, Ameria, New York, New Jersey, Floods, Powersupply, Transport, Effected, TeluguOne]


