అమీర్‌ఖాన్‌కు కరోనా.. బాలీవుడ్‌పై కొవిడ్ పంజా
posted on Mar 24, 2021 2:54PM
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచలన మేరకు ప్రస్తుతం అమీర్‌ఖాన్ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అమీర్‌ఖాన్ ఇల్లు, ఆఫీసు సిబ్బందికి సైతం కొవిడ్ టెస్టులు చేస్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ముంబైలో ఉండే బాలీవుడ్ సెలబ్రిటీలపైనా కరోనా పంజా విసురుతోంది. ఇటీవల నటుడు అషిశ్ విద్యార్థి, రణ్‌బీర్ కపూర్, కార్తిక్ ఆర్యన్, ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలిలకు కరోనా సోకగా.. లేటెస్ట్‌గా స్టార్ హీరో అమీర్‌ఖాన్ కొవిడ్ భారిన పడటం కలకలం రేపుతోంది. ప్రజలంతా మరింత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
కరోనా ముందు అంతా సమానమే. ప్రధాని అయినా.. రోజు వారీ కూలీ అయినా.. ఎవరినైనా కరోనా కమ్మేయవచ్చు. వైరస్ ముందు చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. దేశంలో కొవిడ్ కేసులు ఎక్కువవుతుండగా.. ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. పలువురు ప్రముఖులు కరోనా భారిన పడుతుండటం మరింత కలకలం రేపుతోంది.