కమలం వికశించలేదు.. కార్పొరేషన్ లో కొంత ఊరట తప్ప ఒరిగింది ఏమి లేదు!

పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో జోరు పెంచిన బిజెపి మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి రాష్ట్రంలో పాగా వేయాలనుకుంది. అయితే మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. అధికార పక్షం వేసిన ఎత్తులతో బీజేపీకి నిరాశ తప్పలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇప్పుడు వస్తాయని బిజెపి భావించింది. అదే జోష్ లో చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరారు, అయినా ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ లకు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు మునిసిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధి లోని మక్తల్, ఆమన్ గల్ మునిసిపాలిటీలను గెలుచుకుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కూడా తమదే అనుకున్న బిజేపి ఆశల మీద అధికార టీఆర్ఎస్ పార్టీ నీళ్లు చల్లింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అండతో బీజేపీకి షాక్ ఇచ్చింది. మణికొండలో కాంగ్రెస్ కి ఛైర్ పర్సన్ స్థానాన్ని కట్టబెట్టి వైస్ చైర్మన్ చైర్ ని తీసుకుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 2,727 వార్డులు ఉంటే 2026 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 237 వార్డుల్లో మాత్రమే గెలిచింది. 10 కార్పొరేషన్లలో 385 డివిజన్ లు ఉంటే 344 చోట్ల పోటీ చేసి 78 డివిజన్లలో గెలిచింది. 48 మునిసిపాలిటీలు, రెండు మునిసిపల్ కార్పొరేషన్ లో ఖాతా తెరవలేదు. పార్టీకీ ఎంపీలు ఉన్న చోట కూడా ఫలితాలు అనుకూలంగా రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ ఇచ్చిన పట్టణాల్లో సైతం పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వార్డులు గెల్చుకుంటామని బీజేపీ నేతలు భావించినా ఫలితం తారుమారైంది. 

అయితే ఒక్క నిజామాబాద్ కార్పొరేషన్ లో మాత్రం బిజెపి 60 డివిజన్లలో 28 డివిజన్లు దక్కించుకుంది. జిల్లాలో మిగతా చోట్ల మాత్రం నిరాశే ఎదురయ్యింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో బీజేపీకి పరాజయం తప్పలేదు. కొత్త నేతల చేరిక ఆ పార్టీకి కలిసిరాలేదు. వివేక్ ప్రభావం ఉంటుందని అనుకున్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీజేపీకి నిరాశే ఎదురైంది. డీకే అరుణ గద్వాలకే పరిమితం కాగా మిగతా నేతలు తమ ఇలాకాలో ఒకటి రెండు వార్డులకు పరిమితమయ్యారు. అయితే కొత్త వారి చేరిక వల్ల బీజేపీ గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది. 22 మునిసిపాలిటీల్లో 100 శాతం అభ్యర్థులను నిలపగలిగింది. 

అయితే బీజేపీ నేతలు మాత్రం కమల వికాసం జరగకపోయినా పార్టీ విస్తరణ జరిగిందని సంబరపడుతున్నారు. అధికార పార్టీని తట్టుకుని నిలబడ్డామని ఈ ఫలితాలను తక్కువ చేసి చూడొద్దని అభిప్రాయపడుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ లలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. నిజామాబాద్ లో అత్యధిక డివిజన్లు గెలిచిన పార్టీగా నిలిచింది. మీర్ పేట్, బడంగ్ పేటలో చెప్పుకోదగ్గ డివిజన్ లను గెలిచి టీఆర్ఎస్ కు మెజారిటీ రాకుండా అడ్డుకోగలిగింది. కరీంనగర్ లో గతం కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది. కార్పొరేషన్ లలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లడం బిజెపికే ఊరటనిచ్చే విషయం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చిన కాంగ్రెస్ ఘోరంగా విఫలమవ్వటం కమలదళానికి కలిసొచ్చే అంశంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.