తొలి దశ పోలింగ్ తీరుతో బీజేపీ షాక్.. కొత్త వ్యూహాలపై మల్లగుల్లాలు!

బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్  సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలో మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవాలంటే మిగిలిన దశలకు ప్రచార వ్యూహాన్ని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. 

వాస్తవానికి కొద్ది కాలం ముందు నుంచే  సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేశారు. పరిశీలకులు మాత్రమే కాదు బీజేపీ పొలిటికల్ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని నివేదికలు ఇచ్చింది.  ఏడు దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో తొలి దశ పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ ఖంగారు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగానే బీజేపీ గ్రాప్  గణనీయంగా పడిపోయిందా అన్న అనుమానాలు కలగక మానవు. ఒక పరిశీలన మేరకు తొలి దశ ఓటింగ్ తరువాత బీజేపీలో కంగారు మొదలైంది. మూడో సారి అధికారం అన్న ధీమా ఒకింత తగ్గినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై   పార్టీ అగ్రనాయకత్వానికి ఒక  అవగాహన వచ్చిందంటున్నారు. బీజేపీ విభజన రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నెల 19న దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ నియోజకవర్గాలలో తొలి దశలో పోలింగ్ జరిగింది. అయితే బీజేపీ పట్ల ప్రజలలో ఉన్న ప్రతికూలత తీవ్రత ఎంతన్నది తొలి దశ పోలింగ్ తీరును బట్టి బీజేపీ అగ్రనాయకత్వానికి అర్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి దశ పోలింగ్ తరువాత అంతర్మథనంలో పడిన బీజేపీ అగ్రనాయకత్వం ఆదివారం అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైనట్లు చెబుతున్నారు.

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాలు పాల్గొన్న ఆ సమావేశంలో మిగిలిన విడతలలో పుంజుకునుందుకు అనుసరించాల్సిన  వ్యూహాలపై చర్చించారని అంటున్నారు. మరో వైపు అందుతున్న సమాచారం మేరకు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుందని తెలుస్తోంది.  నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, రైతు సమస్యలు బీజేపీకి ప్రతికూలంగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.