తెలంగాణలో బిజెపి మైండ్ గేమ్.. కేసీఆర్ గెలవరంటూ బండి జోస్యం

తెలంగాణలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయినట్లేనని విస్తృత ప్రచారంతో పాటు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం కేవలం 15 స్థానాలకే పరిమితమౌతుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పదే పదే చెబుతున్నారు. అంతే కాకుండా ఆ గెలిచే 15 మందిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండరని చెబుతూ టీఆర్ఎస్ క్యాడర్ లో ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా  వరుసగా రెండు ఉప ఎన్నకలలో టీఆర్ఎస్ పరాజయాన్ని గుర్తు చేస్తూ అధికార పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందనీ, అవినీతి కారణంగా త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమనీ చెబుతూ మైండ్ గేమ్ రాజకీయాలు నెరపుతోందని పరిశీలకులు అంటున్నారు.

  పార్టీల వ్యవహారాలకన్నా, ప్రభుత్వ పనితీరుకన్నా.. ముఖ్యమంత్రిని, సిఎం కుటుంబాన్ని లక్ష్యాన్ని చేసుకుని  పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా టీఆర్ఎస్ ను ప్రజలలో పలుచన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  బిజెపి చేస్తున్న లేదా ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఏ ఆరోపణపైనా ఇప్పటి వరకూ విచారణ ప్రారంభమైన దాఖలాలు లేవు.  ఆ, ఆరోపణల్లో  నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆ ఆరోపణతో కమలనాథులు సాగిస్తున్న ప్రచారంపై జనాలలో చర్చ అయితే ప్రారంభమైంది. అలాగే తాజాగా చికోటి ప్రవీణ్ క్యాసినోల కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మంత్రులు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో ఒకరికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందన్న చర్చ ఒకటి తెలంగాణలో ప్రారంభమైందని టీఆర్ఎస్ శ్రేణులే అంగీకరిస్తున్నాయి.  

మొత్తంగా బండి సంజయ్ తరచుగా చేస్తున్న ఓ నాలుగు ఆరోపణలపై మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్తృత చర్చ అయితే జరుగుతోంది.   సిఎం కెసిఆర్ జైలుకెళ్ళడం ఖాయం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి మయం. కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. అన్నవే జనంలో విస్తృతంగా చర్చకు తెరతీసిన ఆరోపణలు. ఇప్పుడు బీజేపీ వాటిని మించి అన్నట్లుగా  తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలుస్తుంది. ముఖ్యమంత్రి పరాజయం పాలు కావడం తథ్యం అంటూ మైండ్ గేమ్ కు తెరతీసింది.  ఈ మైండ్ గేమ్ కారణంగానే టీఆర్ఎస్ నుంచి ఇటీవలి వలసలు పెరిగాయంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోని కొందరి చూపు బీజేపీ వైపు మళ్లడానికి కూడా ఈ మైండ్ గేమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గత రెండు ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సహజంగానే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానికి తోడు ఆ పార్టీ ఇటీవల పీకే బృందం ద్వారా చేయించుకున్న సర్వేలను స్వయంగా కేసీఆర్ లీక్ చేసి సిట్టింగ్ లలో చాలా మందికి టికెట్లు అనుమానమే అనడంతో సిట్టింగులలో తమకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ రాదన్న అనుమానం బలపడటం కూడా పార్టీ నుంచి వలసలకు కారణమని పరిశీలకులు అంటున్నారు. పీకే సర్వేలు, బీజేపీ మైండ్ గేమ్ రెండూ కూడా టీఆర్ఎస్ లో ఒక విధమైన జంకుకు కారణమయ్యాయనీ, ప్రజలలో కూడా టీఆర్ఎస్ పని అయిపోయిందా అన్న అనుమాన బీజాలు నాటుకోవడానికి తోడ్పడ్డాయనీ అంటున్నారు. ఇక ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి సీఎంపై పోటీ చేసి గెలుస్తాను అని చేసిన ప్రకటన ఈ మైండ్ గేమ్ కు పరాకాష్ట అని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో సీఎం ను గజ్వేల్ కు ఫిక్స్ చేసే వ్యూహం ఉందనీ, గతంలోలా ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనలను తగ్గించుకుని గజ్వేల్ కే అధిక సమయం కేటాయించాల్సిన అనివార్య పరిస్థితిని ఈటల తన సవాల్ ద్వారా కల్పించారని పరిశీలకులు అంటున్నారు.

 దీనికి తోడు ఈటలను బీజేపీ అగ్రనాయకత్వం చేరికల కమిటీ చైర్మన్ గా నియమించడంతో గతంలో ఆయన టీఆర్ఎస్ లో ఉండగా సన్నిహితులుగా ఉన్న వారంతా బీజేపీలోకి టచ్ లోకి వచ్చారని పరిశీలకులు అంటున్నారు.