జనసేనానికి చిరు స్పీడ్ బ్రేకర్.. బీజేపీ రూటు మార్చింది!

ఆంద్రప్రదేశ్ లొ బిజెపి రూట్ మ్యాప్ మారినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేకర్ నిలిచింది.  అసలు బిజెపి ఏపీలో తానే మార్గ సూచి అని ఇంత కాలం చెప్పుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ కు చిరు రూపంలో కమలం పార్టీ చెక్ పెట్టింది.  చడీ చప్పుడూ లేకుండా మెగా స్టార్ ను తీసుకువచ్చి తెరముందు నిలిపింది.

రాజకీయాల నుంచి తెర మరుగై పోయి వెండి తెరపై వెలుగొందితే చాలని అనుకుంటున్న చిరంజీవిని భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన చెట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నాయని అంతా భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన, అందునా ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమానికి జనసేనానికి కనీసం ఆహ్వానం కూడా పంపకుండా అవమానించడమే కాకుండా... ఆయన సోదరుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూస్తుంటే.. ఇక పవన్ కల్యాణ్..కమలం పార్టీల మధ్య సఖ్యత చెడినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

అదే సమయంలో ఇంత కాలం రహస్య మైత్రిగా సాగుతూ వచ్చిన బీజేపీ, వైసీపీ బంధం ఇకపై బహిరంగమేనని కూడా సూత్రీకరిస్తున్నారు. చిరంజీవిని అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి ప్రత్యేక గౌరవం ఇవ్వడానికి స్కెచ్ చాలా కాలం కిందటే మొదలై ఇప్పటికి తెరమీదకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.  సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక వైపు జనసేనాని సినిమా భీమ్లానాయక్ కు నష్టం వాటిల్లే విధంగా చర్యలు తీసుకుంటూనే.. ఆ సినిమాను మినహాయించి మిగిలిన సినిమాల విడుదల సమయానికి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేందుకు జరిపిన చర్చలలో చిరంజీవి పాల్గొన్న సమయంలోనే ఆయనను రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేయడం మొదలైందని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటికి అది ఒక రూపుదాల్చిందనీ, చిరంజీవి కమలం గూటికి చేరడం, ఏపీలో ఆ పార్టీ తరఫున క్రియాశీలంగా పని చేయడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు.  మొత్తం మీద ఇంత కాలం బీజేపీ   పవన్ తొ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిందనీ, మిత్ర పక్షం అంటూ జనసేనతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తూ అధికార వైసీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక వైసీపీతో మైత్రిని బహిర్గతం చేయడం, జనసేనానికి గుడ్ బై చెప్పడం లాంఛనమే అని అంటున్నారు.

అయితే ఏపీ బీజేపీలోనే చిరంజీవి విషయంలో  అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని కమలం శ్రేణులు అంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పదవులు పొంది.. ఆ పదవీ కాలం పూర్తవ్యగానే సినిమాలే నా ప్రపంచం అంటూ వెళ్లిపోయిన చిరంజీవిని దగ్గరకు తీయడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన బీజేపీ మైత్రికి రోజులు దగ్గపడ్డాయన్నది మాత్రం ఖాయమైనట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.