హత విధీ తెలుగు ఖ్యాతి అల్లూరి విగ్రహావిష్కరణ ఇలాగేనా?

ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలకు అతీతంగా నిర్వహాస్తున్నామంటూ ఘనంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం ఈ కార్యక్రమాన్ని తన సొంత ఆధిపత్యం చాటుకోవడానికీ, తన రాజకీయ ప్రత్యర్థులను అవమానించడానికే జగన్ ఉపయోగించు కున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి. చివరికి వైసీపీ శ్రేణులు కూడా తెలుగు జాతి గర్వించేలా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ అతి జోక్యం వల్ల   ఒక గల్లీ కార్యక్రమంగా మిగిలిపోయిందని బాహాటంగానే అంటున్నారు.

స్వాతంత్ర సమరయోధులలో అల్లూరిది ఒక ప్రత్యేక అధ్యాయం. తెలుగుజాతి పౌరుషాగ్ని రగిలించిన గొప్ప వ్యక్తిత్వం. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలకు అతీతంగా తెలుగువారంతా అల్లూరిని తమ గుండెల్లో కొలువుంచుకున్నారు. అటువంటి మహనీయుని 125వ జయంతి కార్యక్రమాన్ని జగన్ సర్కార్ రాజకీయం చేసి సాదాసీదాగా నిర్వహించేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరికీ ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమం కనిపించలేదు. మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి స్ఫూర్తి గోచరించలేదు.

ప్రొటోకాల్ ను, కోర్టు తీర్పులనూ కూడా లెక్క చేయకుండా జగన్ ను విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజును హాజరు కాకుండా నియంత్రించడానికి జగన్ ప్రభుత్వం పడిన తాపత్రయం మాత్రమే కనిపించింది. అదే హైలైట్ అయ్యింది. మిగిలిన అన్నీ సోదిలోకి కూడా లేకుండా పోయాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై అల్లూరి విగ్రహాన్ని ఆవిష్క రించిన ప్రధాన అంశం కూడా డమ్మీగా మారిపోయింది.  ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకే జగన్ సర్కార్ ఉపయోగించుకుంది. ఇది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ మాత్రమే కాదు. ప్రతి తెలుగువాడి భావన కూడా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ నేతల వినా మరెవరూ కనిపించలేదు. ఆహ్వానం పంపామని వైసీపీ చెబుతున్న తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరు ఆహ్వానితుల జాబితాలో లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో పిలిచి అవమానించారని అచ్చెన్నాయుడు అన్నారు.

జనసేన పరిస్థితి అదే. రాష్ట్రంలో మిత్రపక్షం అయినా సరే జగన్ సర్కార్ పై జనసేనాని విమర్శలు చేయడమే ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ కూడా ఆహ్వానం అందకపోవడానికి కారణమని సామాన్యులు సైతం గుర్తించేశారంటే జగన్ సర్కార్ ఎంత బాహాటంగా తన రాజకీయ వైరాన్ని ప్రదర్శించిందో అవగతమౌతుంది.  

ఇక మరో ప్రధానమైన అంశం ఏమిటంటే మోడీ పర్యటన ముగించుకుని వెళుతుండగా ఎగిరిన నల్ల బెలూన్లు. ఒక వైపు మోడీ హెలికాప్టర్ మరో వైపు నల్ల బెలూన్లు సమాంతరంగా ఎగిరాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ స్థాయి నిరసన వ్యక్తం అవ్వడమంటే అది  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాజకీయ ప్రత్యర్థులను ఈ కార్యక్రమానికి రాకుండా చేయడంపై పెట్టిన దృష్టి మోడీ పర్యటన సందర్భంగా భద్రతపై పెట్టలేదన్నది స్పష్టమౌతోంది. ప్రధాని పర్యటన సందర్భంగా స్ధానికంగా నిరసనల అవకాశంపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి, నిరసనలు వ్యక్తం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదీ, రాష్ట్ర పోలీసు, నిఘా శాఖలదే అనడంలో సందేహం లేదు.

అందుకే మోడీ హెలికాప్టర్ కు సమాంతరంగా నల్ల బెలూన్ల నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఫలమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఏపీలో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలకు పిలుపు నివ్వలేదు. అల్లూరి తెలుగు స్ఫూర్తి కనుక ఆ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలూ రాకూడదనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భావించాయి. తెలుగుదేశం అధినేత సహా రాజకీయ పార్టీలన్నీ అల్లూరి విగ్రహావిష్కరణను స్వాగతించాయి. ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాత్రమే మోడీ పర్యటన సందర్బంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ప్రకటించారు.  నల్ల బెలూన్లు ఎగిరాయి. అయితే పోలీసులు మాత్రం ఇది కాంగ్రెస్ నేత పని అని  చెబుతున్నారు.  అయితే ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఎవరో నల్ల బెలూన్లు ఎగరేస్తే భద్రతా లోపం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.