జగన్ ప్రచారంలో బాబాయ్ నామస్మరణ

కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు ప్రస్తుతం ఈ సామెత చెప్పినట్టే వుంది. బాబాయి వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు, తన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత  ప్రస్తావించే అవకాశం వుంది కాబట్టి, అలా ప్రస్తావిస్తే అది తనకు నెగటివ్ అయ్య ప్రమాదం వుంది కాబట్టి వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీలతోపాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరూ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడ్డం లేదు. కానీ, ఇప్పుడు వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే బాధ్యతను స్వయంగా జగనే తీసుకున్నారు. ఏ సభలో మాట్లాడినా వివేకా ప్రస్తావన తప్పకుండా తెస్తున్నారు. చిన్నాన్నకి రెండో భార్య వున్నట్టు అందరికీ తెలుసు కదా అని జనంతో అంటున్నారు. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కోర్టు వివేకా హత్య గురించి ప్రతిపక్షాలు, షర్మిల, సునీత మాట్లాడవద్దని అన్నదే తప్ప నన్ను కాదు కదా అని జగన్ భావిస్తున్నారో ఏమో. ఏది ఏమైనా వివేకా హత్య గురించి ప్రస్తావించి రాజకీయంగా లాభం పొందాలని జగన్ అనుకుంటే అది బూమ్‌రాంగ్ అవడం ఖాయం.