అదేదో తోక పట్టుకుని స్థానిక ఎన్నికల సమరానికి సిద్దమైన కమలం...

పాతికేళ్ళు రాజకీయం చెయ్యడానికి వచ్చాను, నన్ను తక్కువ అంచనా వెయ్యకండి..ప్రశ్నించడానికి అధికారం అవసరం లేదు..నేను ఓడినంత మాత్రాన ప్రశ్నించడం మానను..సమస్య ఎక్కడున్నా అక్కడికొచ్చి నిలదీస్తా.. ఇలాంటి డైలాగులు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..ఇంకెక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ నోటినుంచే..రాజకీయాలు, అధికారం మీద పిచ్చ క్లారిటీ ఉన్న జనసేన నాయకుడు..ఏపీలో మేము సొంతంగానే ఎదుగుతున్నాం..రాబోయే కాలానికి కాబోయే పాలకులం అని చెప్పే కమలం పార్టీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమరావతిలో ఆదివారం జనసేన, బీజేపీ పార్టీల మధ్య స్థానిక ఎన్నికల పొత్తుపై చర్చించారు.

కూటమి గెలిచేందుకు గాను జనసేన జిల్లాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. తిరుపతికి చెందిన డాక్టర్‌ పి.హరిప్రసాద్‌ను కడప జిల్లా సమన్వయకర్తగా నియమించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియమించారు. నామినేషన్‌ దశ నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 13 జిల్లాల సమన్వయకర్తల వివరాలు..

శ్రీకాకుళం జిల్లా : డాక్టర్‌ బి.రఘు
విజయనగరం జిల్లా : గడసాల అప్పారావు
విశాఖపట్నం (రూరల్‌) : సుందరపు విజయ్‌ కుమార్‌
తూర్పుగోదావరి జిల్లా : బొమ్మదేవర శ్రీధర్‌ (బన్ను)
పశ్చిమ గోదావరి జిల్లా : ముత్తా శశిధర్‌
కృష్ణా జిల్లా : పోతిన మహేశ్‌
గుంటూరు : వత్త కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కె.కె.)
ప్రకాశం : షేక్‌ రియాజ్‌
నెల్లూరు : సి.మనుక్రాంత్‌ రెడ్డి
చిత్తూరు : బొలిశెట్టి సత్య
కడప : డా.పి.హరిప్రసాద్‌
కర్నూలు : టి.సి.వరుణ్‌
అనంతపురం : చిలకం మధుసూదన్‌ రెడ్డి
ఇందులో వార్తేమి ఉంది అంటారా అక్కడికే వస్తున్నాం..
మరి కమల దళాధిపతులు కూడా సమన్వయ కర్తలను నియమిస్తారా లేక..తమ్ముడు నియామకాల మీదే అధారపడటారా చూడాలి. 

2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 136 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట విజయాన్ని సాధించింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఫలితంగా ఆ పార్టీ ఏకంగా 120 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.13 కోట్ల ఓట్లు పోలయ్యాయి. వీటిలో జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. నోటా గుర్తుకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం.

గత 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు దక్కించుకోగా, ఎమ్మెల్యేగా చిరంజీవి సైతం గెలుపొందారు. ఆ పార్టీకి ఏకంగా 18 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కానీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం కేవలం ఏడు శాతం ఓటు బ్యాంకును మాత్రమే సొంతం చేసుకుంది. ఇక్కడే ఉంది అసలు కిటుకు 18 శాతం ఓట్లు సాధించిన అన్నయ్య చిరు పరోక్షంగా వైసీపీ మద్దతుగా ఉంటె ఏడు శాతం ఓట్లు సాధించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని బీజీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈదుతోంది అని పరిశీలకులు గుసగుసలాడుకుంటున్నారు.