Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్నికలవ్వగానే వీసారెడ్డి మాయం.. విషయమేంటి?
posted on: May 17, 2024 3:02PM
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది. అయితే అధికార వైసీపీకి చెందిన కీలక నేతలు పోలింగ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, రోజా వంటి వారైతే ఒక వైపు పోలింగ్ జరుగుతుండగానే.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ మీడియా ముందుకు రావడం వంటివి చూస్తుంటే ఆ పార్టీ ఫలితాలకు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్, ఆళ్లనాని వంటి కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్యాడర్ కు చేసిన సూచనలను బట్టి వైసీపీ సీన్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ కు వీడ్కోలు పలుకుతూ చేసిన ప్రసంగంలో విజయంపై వ్యక్తం చేసిన ధీమా అతి విశ్వాసాన్ని మించి ఉండి ఓటమినే ధ్వనించింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నేత ఇలా పోలింగ్ అయ్యిందో లేదో అలా అజ్ణానంలోకి వెళ్లిపోయిన విషయంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయిన దానికీ కాని దానికీ మీడియాముందుకు వచ్చో, లేదా సామాజిక మాధ్యమ వేదికల ద్వారానో ఆత్మస్థుతి, పరనిందలలో చెలరేగిపోయే ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి మే 13 తరువాత నుంచీ బయట ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ నాలుగు రోజులలో ఆయన సోషల్ మీడియాలో నెల్లూరులో తనకు ప్రచారంలో సహకరించిన క్యాడర్ కు నేతలకు కృతజ్ణతలు తెలపడం మినహా.. పోలింగ్ సరళి గురించి కానీ, రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై కానీ స్పందించిన దాఖలాలు లేవు.
విజయసాయిరెడ్డి ఈ సారి తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడ్డారు. ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ అధినేత మాత్రం ఆయనను విశాఖ నుంచి కాకుండా నెల్లూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. మూడేళ్ల పాటు విశాఖలో అన్నీ తానై వ్యవహరించిన విజయసాయిని అత్యంత అవమానకరంగా విశాఖ నుంచి పక్కకు తప్పించి అక్కడి బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించిన సంగతి తెలసిందే. నెల్లూరు ఎంపీ టికెట్ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే విజయసాయికి ఇచ్చారు జగన్ నెల్లూరులో వైసీపీ కీలక నేత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరి, ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో జగన్ కు వేరే దారి లేక విజయసాయిని నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. వాస్తవానికి విజయసాయిరెడ్డికి నెల్లూరు నుంచి పోటీ చేయడం సుతరామూ ఇష్టం లేదు. నెల్లూరు ఆయన స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలు, నియోజకవర్గం కోసం ఆయన చేసిన పనీ రెండూ కూడా అంతంత మాత్రమే.
ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఎదురీదిన విజయసాయికి ప్రచారం సమయంలోనే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తన ప్రచారం కోసం సమీకరించిన జనాలు వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కు పోతుండటంతో మైకుల్లోనే వారిని వెళ్లిపోవద్దంటూ బతిమలాడుకుంటున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అది పక్కన పెడితే పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా విజయసాయిరెడ్డి మౌనముద్ర దాల్చడమే కాదు, ఎవరికీ అందుబాటులోకి కూడా రాలేదు. ఓ వైపు వైసీపీ కీలక నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనో, పోలింగ్ తీరు పట్ల అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూనో మీడియా ముందుకు వస్తుంటే.. పార్టీకి మౌత్ పీస్ అన్నట్లుగా ఇంత కాలం వెలిగిపోయిన విజయసాయి రెడ్డి మౌనం, బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక నెల్లూరులో ఆయన ప్రచారం అంతా దాదాపు చేతులెత్తేసినట్లుగానే సాగింది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరిన తరువాత నియోజకవర్గంలో పోరు ఏకపక్షమైపోయింది. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో వైసీపీ బాగా బలహీనపడింది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని విజయసాయి రెడ్డి అజ్ణాతవాసానికి ఫలితం వెలువడడానికి ముందే ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.webp)



