జగన్మోహన్ రెడ్డితో బీజేపీ నేత సమావేశం



నిన్న అసెంబ్లీ సమావేశం ముగిసిన తరువాత బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో ఆయన ఛాంబర్ లో సమావేశమయ్యారు. దాదాపు అర్ధగంతసేపు వారిరువు మాట్లాడుకొన్నారు. ఆ సమయంలో వైకాపా సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, శ్రీకాంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అంతకు ముందు విష్ణుకుమార్ రాజు సభలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడటంతో, ఇప్పుడు వీరిరువురి సమావేశం ఏ కొత్త రాజకీయ పరిణామాలకి దారి తీయబోతోందనే చర్చ మీడియాలో, రాజకీయ పార్టీలలో కూడా మొదలయింది. కానీ ఆ సమయానికి జగన్ అక్కడే ఉన్నందున తను మర్యాదపూర్వకంగా కలిసాను తప్ప ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని విష్ణుకుమార్ రాజు అన్నారు.

 

అయితే ఆయన ఇదివరకు అసెంబ్లీ సమావేశాలలో జగన్ చాలా ఉద్రేకంగా వ్యవహరించడం చూసి, వైకాపా ఎన్నికలలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక జగన్ చాలా డిప్రెషన్ కు గురయినట్లున్నారని, అందువలన ఆయన తక్షణమే   మానసిక వైద్యులను కలిసి చికిత్స తీసుకొంటే బాగుంటుందని,అవసరమయితే ఒక నెల రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఆరోగ్యం పూర్తిగా కోలుకొన్న తరువాత మళ్ళీ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందని జగన్ కి సలహా ఇచ్చారు. నిన్నశాసనసభలో హూద్ హూద్ తుఫానుపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా జగన్ అదే ఆవేశం ప్రదర్శించారు. ఆయన తీరును ప్రజలందరూ కూడా ఆక్షేపిస్తున్నారు. అటువంటప్పుడు విష్ణుకుమార్ రాజు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం దేనికో ఆయనే వివరించాలి.