పుట్టిన నెలని బట్టి అనారోగ్యాలు

 

ఒకో సమయంలో పుట్టిన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి అని ఊహించేదుకు, ప్రపంచమంతా రకరకాల జాతకాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వైద్యులు కూడా పిల్లలు పుట్టే నెలని బట్టి, వాళ్ల ఆరోగ్యం ఉంటుందని చెప్పడమే కాస్త విచిత్రంగా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి నాటు వైద్యులు కాదు... కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు తేల్చిన మాట ఇది.

 

55 రోగాలు!

పుట్టిన నెలకీ, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానంతో ‘కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌’లో నమోదైన 17 లక్షల మంది రోగుల వివరాలను పరిశీలించారు. తాము ఎన్నుకొన్న 1,688 రోగాల జాబితాలో 55 రోగాలకీ, పుట్టిన నెలలకీ మధ్య సంబంధం ఉండటాన్ని గమనించారు. ఇలా సంబంధం ఉన్న రోగాలలో ఆస్త్మా, ADHD, సంతానలేమి, గుండెజబ్బులు... వంటి తీవ్రమైన జబ్బులు ఉండటం గమనార్హం.

 

ఏఏ నెలలలో!

మార్చి, ఏప్రిల్ నెలల్లో పుట్టినవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జన్మించినవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం బయటపడింది. నవంబరులో పుట్టినవారిలో మానసిక సమస్యలు బయటపడే ప్రమాదం కనిపించింది. మొత్తంగా చూస్తే మే, జులై నెలల్లో పుట్టినవారికంటే అక్టోబరు, నవంబరు మాసాల్లో పుట్టినవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ గణాంకాలు సూచించాయి.

 

కారణం!

పుట్టిన నెలని బట్టి ఆరోగ్యం అన్న మాట విచిత్రంగా ఉన్నా... దానికి హేతుబద్ధమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి తల్లి తీసుకునే ఆహారంలోని మార్పులు, పిల్లలు పుట్టిన వెంటనే వాతావరణంలో ఉండే వివిధ క్రిముల ప్రభావం వంటి కారణాలు చూపిస్తున్నారు పరిశోధకులు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ‘డి- విటమిన్‌’ వల్లే ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. డి విటమిన్‌ మనలోని ఎముకలు, పళ్లు గట్టి పడేందుకు తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే! కానీ మెదడు ఎదుగుదల దగ్గర్నుంచీ, రోగనిరోధక శక్తి వరకూ శరీరంలోని ఎన్నో అంశాలు డి విటమిన్ మీదే ఆధారపడి ఉంటాయని ఇప్పుడిప్పుడే పరిశోధనలు తేలుస్తున్నాయి.

 

శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇటు తల్లికీ, పుట్టిన తరువాత అటు బిడ్డకూ తగినంత డి విటమిన్‌ అందకపోతే... అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తత్ఫలితంగానే వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పేర్కొంటున్నారు. డి విటమిన్ సూర్యరశ్మి నుంచే లభిస్తుంది కాబట్టి, ఆ సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా లేని నెలలలో పుట్టిన పిల్లలని డి విటమిన్‌ లోపం ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు.

 

ఏతావాతా డి విటమిన్‌ లోపమే అసలు దోషమని తేల్చారు పరిశోధకులు. అయితే ఒక నెలలో పుట్టినంత మాత్రాన తప్పకుండా ఆయా రోగాల బారినపడి తీరతారన్న భయమేమీ వద్దనీ.... పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి వంటి ఎన్నో విషయాలను కనుక మన నియంత్రణలో ఉంచుకుంటే  ఏ రోగమూ మన దరి చేరదని అభయమిస్తున్నారు. పైగా సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణదేశాలలో, నెలని బట్టి ఆరోగ్యం అనే తమ పరిశోధన చెల్లకపోవచ్చునని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త నీరెండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేమో!

 

 

- నిర్జర.