ఆర్మీ ఫ్యామిలీలో పుట్టి.. సీడీఎస్‌గా ఎదిగి.. రావ‌త్ ప్రొఫైల్‌..

బిపిన్ రావ‌త్‌. భార‌త‌దేశ తొలి సీడీఎస్‌. ఆర్మీ కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న‌.. అదే ఆర్మీలో అత్యున్న‌త ప‌ద‌వి చేప‌ట్టారు. త‌మిళ‌నాడులోని కూనురులో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న కెరీర్‌లో అనేక సంచ‌ల‌నాలు. మ‌య‌న్మార్‌, పాకిస్తాన్‌లో ఇండియ‌న్ ఆర్మీ చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు మాస్ట‌ర్ మైండ్ ఆయ‌న‌. ఆరేళ్ల క్రితం ఓ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంతో సుర‌క్షితంగా త‌ప్పించుకున్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న‌కు విధి అనుకూలించ‌లేదు. 

ఉత్తరాఖండ్‌లోని పౌరీలో 1958లో జన్మించారు బిపిన్ రావ‌త్‌. తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా రిటైర్ అయ్యారు. తండ్రిలానే పాఠశాల విద్య తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హైయ్యర్‌ కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌.. మద్రాస్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ డిప్లొమా కంప్లీట్ చేశారు. 2011లో చౌధరీ చరణ్‌ సింగ్‌ యూనివర్శిటీ నుంచి మిలిటరీ మీడియా అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ చేసి డాక్ట‌రేట్ పొందారు బిపిన్ రావ‌త్‌.  

1978లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో ఆర్మీ కెరీర్‌ ప్రారంభించారు. రావత్‌కు ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విశేష‌ అనుభవం ఉంది. మేజర్‌గా ఉరీ, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. కల్నల్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. కశ్మీర్‌లోని సోపూర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ సెక్టార్‌ 5 బాధ్యతలు నిర్వహించారు. ఐక్య‌రాజ్య స‌మితి మెషిన్‌లో భాగంగా కాంగోలో కొన్నాళ్లు పని చేశారు. ఇక్కడ ఆయనకు ఫోర్స్‌ కమాండర్‌ కమెండేషన్‌లు రెండు సార్లు వ‌రించాయి. ఆ త‌ర్వాత‌ ఉరీలో జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో నాగాలాండ్‌లోని టైగర్‌ కోర్‌ బాధ్యతలు చూసుకొన్నారు. అలా అంచ‌లంచ‌లుగా ఎదిగి.. 2017 జనవరి 1న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు బిపిన్‌ రావత్‌.   

రావ‌త్ ఆర్మీ కెరీర్‌లో అనేక సంచ‌ల‌న ఆప‌రేష‌న్లు నిర్వ‌హించారు. 

--ప్రస్తుతం బిపిన్‌ రావత్‌  చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు తొలి సీడీఎస్‌. ఆయన ఫోర్‌స్టార్‌ జనరల్‌. ప్రస్తుతం భారత్‌లో ఆయనే అత్యున్న‌త‌ సైనికాధికారి. 

--రావత్‌ను సైన్యంలో పలు కీలక అవార్డులు వరించాయి. పరమ విశిష్ఠ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ఠ సేవాపతకం, యుద్ధ సేవా మెడల్‌, సేనా మెడల్‌, విశిష్ఠ సేవా పతకం ఆ అవార్డుల్లో కొన్ని.   

--2015లో ధింపూర్‌లో టైగర్‌ కోర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మయన్మార్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించారు. 18 మంది భారత జవాన్లను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు హత్యచేసి మయన్మార్‌ పారిపోయారు. దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడి మరీ మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో 21 పారా కమాండోలు పాల్గొన్నారు.    

--2015లో ఓ సారి హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు రావ‌త్‌. ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి రావత్‌ స్వల్పగాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu