కాంగ్రెస్ ఎత్తుకి తెదేపా, వైకాపాలు చిత్తు

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైకాపా నేత షర్మిల ఇద్దరూ తమ పాదయాత్రలు కొనసాగిస్తు కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని అస్త్రాలు సంధిస్తున్నపుడు, కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. చంద్రబాబు పాదయాత్ర తరువాత తెదేపా మళ్ళీ రెండు ప్రాంతాలలో బాగా పుంజుకొంది కూడా. అయితే, కాంగ్రెస్ పార్టీ వేసిన ఒకే ఒక ఎత్తుతో రెండు పార్టీలు చిత్తయినట్లు కనిపిస్తున్నాయి.

 

కాంగ్రెస్ పార్టీ ‘రాష్ట్రవిభజన ప్రకటన చేయడంతో వారిద్దరూ ఎంతో శ్రమపడి చేసిన పాదయాత్రలు నిష్ప్రయోజనమయ్యాయి. వైకాపా సమైక్యాంధ్ర టర్న్ తీసుకోవడం వలన షర్మిల తెలంగాణాలో చేసిన పాదయాత్రలు, విజయమ్మ శ్రమ వృధా కాగా, చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య పరిస్థితులను సైతం లెక్క చేయకుండా చేసిన పాదయాత్ర రాష్ట్ర విభజన ప్రకటనతో నిష్ప్రయోజనమయిపోయింది. కాంగ్రెస్ వేసిన ఎత్తుతో వైకాపా తెలంగాణాను వదులుకోవలసి వస్తే, తెదేపా రెండు ప్రాంతాలలో తన ఉనికిని నిలుపుకోవడానికి ప్రయాస పడవలసి వస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా సీమాంధ్ర ప్రాంతంపై పట్టుకోసం తీవ్రంగా శ్రమించడం గమనిస్తే వాటి పరిస్థితి అర్ధం అవుతుంది.