పోయిన పరువు బయ్యారంతో తిరిగొస్తుందా

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలో గల బయ్యారం ఇనుపగనులను విశాఖలో గల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం తెరాసకు ఆయాచితం వరంలా దక్కింది. ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలు పక్కన బెట్టి, ఎన్నికలు, టికెట్లు అంటూ పక్క దారిపట్టడంతో ప్రజలలో విశ్వసనీయత కోల్పోయింది. తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి లేదనే అపకీర్తి మూట కట్టుకొన్నతెరాసకి, ముఖ్యమంత్రి నిర్ణయం, మళ్ళీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోనేందుకు ఒక చక్కటి అవకాశం అందించిoది.

 

“తెలంగాణ ప్రాంతంలో ఉన్న బయ్యారం గనులను కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి దోచిపెడుతున్నాడు. ఇక్కడి నుండి ఒక్క గ్రాము ఖనిజాన్ని కూడా బయటకి వెళ్ళకుండా అడ్డుకొంటాము, అవసరమయితే దీనికోసం మా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధం,” అంటూ భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తెరాస నేతలకి తల నరుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రాణాలు అర్పించడం వంటివి కూడా ఇప్పుడు ఊతపదాలుగా మారిపోయాయి. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి మాటలు ఉపయోగించడం అత్యవసరం అని వారు భావిస్తున్నట్లున్నారు.

 

వారికి తమ తెలంగాణ ప్రజల మీద, వారి హక్కుల మీద, వారి కష్టాల పట్ల నిజంగా సానుభూతి ఉండి ఉంటే, ఉద్యమం పేరిట వారి బ్రతులతో చెలగాటం ఆడుకొనేవారే కాదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ర్ రెడ్డి కాలంలో ప్రైవేట్ వ్యక్తులకు బయ్యారం గనుల కేటాయింపులు జరుగుతున్నపుడు వారెవరికీ ఆయనని గట్టిగా అడిగే దైర్యం లేకపోయింది. ఏళ్ల తరబడి బయ్యారంలో ప్రైవేట్ వ్యక్తులు తవ్వుకుపోతున్నా గుర్తుకు రాని స్టీల్ ప్లాంటు ఆలోచన ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థకు గనులు అప్పగించగానే గుర్తుకు రావడం విశేషం.

 

ఎంతసేపు తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురవుతొందనే వితండ వాదన చేయడం తప్ప, తెలంగాణ ప్రాంత, ప్రజల అభివృద్ధికోసం ఎన్నడూ పోరాడింది లేదు. పదేళ్ళుగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న తెరాస తమ ప్రాంతాలలో స్టీల్ ప్లాంటులు, విద్యుత్ కర్మాగారాలు వంటి పరిశ్రమలు పెట్టాలని గట్టిగా అడిగిన సందర్బం లేదు. తమ ఉద్యమాలతో ప్రభుత్వం మెడలువంచుతామని గొప్పలు పోయే సదరు నేతలు, ఆ పనేదో తెలంగాణ అభివృద్దికోసం నిజంగా చేసి చూపించి ఉంటే వారి మాటలకు ప్రజలలో విలువ ఉండేది. కానీ, వారు తమ ఉద్యమాన్ని కూడా స్వార్ధ రాజకీయప్రయోజనాలకే వాడుకొన్నారు తప్ప , ప్రజల గోడు, ప్రజల సమస్యలు ఎన్నడూ వారికి పట్టలేదు.

 

ప్రజలను కలుపుకుపోలేని ఉద్యామాలు ఎన్నడూ విజయవంతం కాలేవు. అయినప్పటికీ, తెరస తనకు లాభం తెచ్చిపెట్టే మార్గం ఎంచుకొని ముందుకు సాగిపోతోంది. సోనియాగాంధీ దేవతని పొగిడిన నోటితోనే ఆమె తెలంగాణ ప్రజలను పొట్టనపెట్టుకొనే రాక్షసి అని అంటాడు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాదిస్తామన్న కేసీఆర్, ఆతరువాత డిల్లీలో లాబీయింగ్ చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. ఈ రోజు ఉద్యమాల వల్ల తెలంగాణ రాదూ, ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిస్తేనే తెలంగాణ వస్తుందని నమ్మబలుకుతున్నారు.

 

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదనే భ్రమలో ఉన్నట్లే, ప్రస్తుతం కేసీఆర్ కూడా తన ఆలోచనలను ప్రజలు అర్ధం చేసుకోలేరనే భ్రమలో ఎన్నికలు, పార్టీ టికెట్లు అంటున్నారిప్పుడు. అందువల్లే, ఆయన పట్ల, తెరాస పట్ల ఇప్పుడు తెలంగాణ ప్రజలలో క్రమంగా వ్యతిరేఖత పెరుగుతోంది. అయితే, వారికి తెరాస తప్ప వేరే గత్యంతరం లేకపోవడమే కేసీఆర్ కు కలిసివచ్చిన అదృష్టమని చెప్పవచ్చును.

 

ఇటువంటి తరుణంలో అందివచ్చిన బయ్యారం గనుల అంశంతో పోయిన పరువును మళ్ళీ దక్కించుకోవాలని తెరాస నేతలు ఆరాటపడుతున్నారు. వారు చెపుతున్న బయ్యారం సూత్రం తెలంగాణలో మరియు రాష్ట్రంలో ఉన్న యన్టీపీసి విద్యుత్ ఉత్ప్పత్తి కర్మాగారాలకు కూడా వర్తింపజేయగాలరా? కేంద్రప్రభుత్వ అధీనంలో నడిచే (వైజగ్) స్టీల్ ప్లాంట్లు, యన్టీపీసి వంటి సంస్థలను, వాటి కార్యక్రమాలను తెలంగాణ రంగుటద్దాలు పెట్టి ప్రజలకి చూపబోవడం తెరాస నేతల దిగజారుడు రాజకీయాలకి పరాకాష్టగా చెప్పవచ్చును. వారికి నిజంగా తమ ప్రాంతం మరియు ప్రజల మీద అభిమానం గనుక ఉంటే, బయ్యారం గనుల గురించి అభ్యంతరాలు తెలిపే బదులు అక్కడ తమకు స్టీల్ ప్లాంట్ కావాలని పోరాటం చేయడం మంచిది.