ప్రత్యర్థులను సైతం విస్మయపరిచిన చంద్రబాబు చాణక్యం!

నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలం కంటే విపక్షంగా ఉన్న కాలమే ఎక్కువ. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తెలుగుదేశం 14 ఏళ్లు అధికారంలో ఉంటే పదిహేనేళ్లు విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా నేతగా, పార్టీ అధినేతగా ఆయన స్థానం చిక్కబడి గట్టిపడిందే తప్ప బలహీన పడింది లేదు. ఆయన నాయకత్వంపై నేతల్లో కానీ, క్యాడర్ లో కానీ విశ్వాసం సన్నగిల్లిన సందర్భం లేదు. 2019 ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ ఇక పుంజుకోవడం కష్టమన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే ఫీనిక్స్ లా పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది. సామాన్య జనంలో కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయనపై విశ్వసనీయత పెరిగింది. 2024 ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ విజయంపై దాదాపుగా ఎవరికీ ఎటువంటి సందేహం లేని పరిస్థితి నెలకొంది.

అయితే ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో తెలుగుదేశం పొత్త పెట్టుకుంది. ఒంటరిగానే అధికారంలోకి రావడం ఖాయమైన పరిస్థితుల్లో పొత్త పేరుతో కొన్ని స్థానాలను త్యాగం చేయడం అవసరమా అన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అయితే చంద్రబాబు పార్టీ నేతలనూ క్యాడర్ ను పొత్తుకు ఒప్పించారు. పొత్తుపై చర్చలకు ముందు వరకూ జనసేన తమ వాటా కింది 40 నుంచి 50 స్థానాల వరకూ కోరుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే చంద్రబాబు పొత్తులో భాగంగా 21 స్థానాలలో పోటీకి జనసేనను ఒప్పించి పార్టీ క్యాడర్ సహా అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ వర్గాలను సముదాయించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలలోనే పోటీ చేయాల్సి రావడం, అలాగే పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో తెలుగుదేశంలో గత ఐదేళ్లుగా జగన్ పాలనను ఎదిరించి నిలబడి పోరాడిన కొందరు నేతలకు ఈ సారి పార్టీ టికెట్ దక్కలేదు.

దీంతో పలు నియోజకవర్గాలలో తెలుగేదేశం రెబల్స్ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉంటాయనీ ఆ మేరకు తెలుగుదేశం నష్టపోయే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషించారు. అయితే  చంద్రబాబు రెబల్స్ బెడదలేకుండా హ్యాండిల్ చేసిన తీరు రాజకీయ పండితులను సైతం విస్మయపరిచింది. మైలవరం, ఉండి నియోజకవర్గాలలో అసమ్మతి లేకుండా ఆయన డీల్ చేసిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.   మైలవరం తెలుగుదేశం టికెట్ ను వసంతకృష్ణ ప్రసాద్ కు ఇవ్వడం, అందుకు దేవినేని ఉమను ఒప్పించడంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం బోధపడుతుంది. ఇప్పుడు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తరఫున దేవినేని ఉమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అలాగే ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. అయినే సహజంగా ఉండి తెలుగుదేశం అభ్యర్థి అవుతారు. చంద్రబాబు కూడా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అయితే తీరా నామినేషన్ల కు ముందు అనివార్యంగా ఆయనను మార్చి ఆ సీటును రఘురామకృష్ణం రాజుకు ఇవ్వాల్సి వచ్చింది.  దీనిని వ్యతిరేకిస్తూ రామరాజు తిరుగుబాటు చేస్తారనీ, రెబల్ గా రంగంలోకి దిగుతారనీ అంతా భావించారు. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పారు.  పార్టీ  సమావేశంలో రామరాజు రఘురామకృష్ణం రాజుతో కలివిడిగా మెలగడమే కాదు, ఆర్ఆర్ఆర్ నామినేషన్ ర్యాలీలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.  దెందులూరులో చింతమనేనినే అభ్యర్థిగా నిలపడం, అనపర్తిలో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం లేకపోవడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఒప్పించడం ద్వారా చంద్రబాబు చాణక్యంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. నాయకుడిగా పార్టీపై తన పట్టును మరోసారి సందేహాలకు అతీతంగా నిలుపుకున్నారు.