టోపీ,శర్వాణీ లపై అసదుద్దీన్ కు జావెద్ కౌంటర్..


భారత్ మాతాకి జై అనను అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. చిలికి చిలికి వాన తుఫాన్ అయినట్టు.. ఈ వ్యాఖ్యల ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తన పాటికి తాను అనేసి సైలెంట్ గా కూర్చున్నా.. మిగిలిన వారి మీది ఈ ప్రభావం బాగానే పడినట్టు ఉంది. దీనికి మహారాష్ట్ర ఎమ్మెల్యే పఠానే నిదర్శనం. అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం ప్రతిపక్షాలు కూడా అతనిపై బాగానే విమర్శలు చేస్తున్నారు. వీరిలో కాస్త ముందుంది అంటే మాత్రం బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ అని చెప్పొచ్చు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు జావేద్ అక్తర్ అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు.. భారత్ మాతాకి జై అనే నినాదం రాజ్యాంగంలో రాసుందా అని అసదుద్దీన్ వేసిన ప్రశ్నకు అతను స్పందిస్తూ..  శర్వాణీ, టోపీ పెట్టుకోవాలి అని రాజ్యాంగం చెప్పిందా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

 

అయితే దీనికి అసదుద్దీన్ అభ్యంతరం చేస్తూ అవి ముస్లింల పద్దతి అని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు దెబ్బతీయవద్దని అన్నారు. మరి జావేద్ అక్తర్ సైలెంట్ గా ఉంటారా..మళ్లీ ఒక కౌంటర్ ఇచ్చారు. టోపీ-శర్వాణీ గురించి మాట్లాడితేనే అసదుద్దీన్‌కు అంత కోపం వస్తే.. వందల కోట్ల భారతీయులు గౌరవించే విషయాల మీద అసదుద్దీన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారు కూడా ఫీల్ కారా అంటూ ప్రశ్నించారు.

 

మరోవైపు జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ ట్విట్టర్లో స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ స్పీచ్ అదిరిందని.. అసదుద్దీన్ వ్యాఖ్యల్ని ఆమె తప్పుబట్టింది. అంతేకాకుండా భారత్ మాతాకీ జై అంటూ తన ట్వీట్ సందేశాన్ని ముగించింది. మరి తమ పద్దతుల గురించి ప్రస్తావించినప్పుడు తమ మనోభావాలు దెబ్బతీయవద్దని చెప్పిన అసదుద్దీన్ కు తను దేశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మాత్రం దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీంటాయని తెలియదా..?