TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఈ వారమంతా వానలే: తుపాను ముప్పుకూడా ఉంది.!

Published on: Thu Nov 26, 2026 2:41PM

ఆంధ్రప్రదేశ్ కు  వాతావరణ శాఖ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు,  వచ్చే నెల రెండో వారంలో వరుసగా రాష్ట్రానికి రెండు భారీ తుఫాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా అంచనాల మేరకు   నవంబర్ 28, 29 నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది, దీని ప్రభావంతో నవంబర్ 30వ తేదీన   అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమంగా పయనిస్తూ డిసెంబర్ 2 లేదా 3వ తేదీకల్లా తుఫానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అనంతరం శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి కోస్తా, రాయలసీమలపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. దీని కారణంగా బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 

బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్కాపురం జిల్లా పామూరులో 74.87 మి.మీ., నెల్లూరు జిల్లా అల్లంపాడులో 55.5 మి.మీ., గూడూరులో 51.25 మి.మీ., తిరుపతి జిల్లా నాయుడుపేటలో 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

అదలా ఉంటే.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1 వరకూ  పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  గురువారం(నవంబర్ 26)  పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో   మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  ఇది కూడా చదవండి:  తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.   రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత గణనీయంగా పెరిగిందని, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పొడి వాతావరణమే కొనసాగుతుందని  వాతావరణ శాఖ పేర్కొంది.

మీకు నచ్చవచ్చు:  ఏపీకి మరో రెండు తుపానులు: ఈ నెలాఖరుకు ఒకటి, డిసెంబర్ లో రెండు.!

ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!

 

[APrains, Wholeweek, Cyclone, Depression, Telangana, coldwave, TeluguOne]