యాపిల్ స్మార్ట్ వాచ్ టైం బాంబ్ లా పేలింది!

దీపావళి దగ్గరకొస్తోంది. టపాసుల కొనుక్కుని తనివి తీరా కాల్చాలని పిల్లలు పెద్దలూ ఉబలాటపడటం మామూలే. అయితే దీపావళికి ముందే పేలుళ్లు వినిపిస్తున్నాయి. అయితే అవి టపాసుల వల్ల వచ్చే పేలుళ్లు కాదు. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ వాచ్ లు పేలడంతో వస్తున్న శబ్దాలు.

చాలా సందర్బాలలో ఈ పేలుళ్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు నడుస్తుండగా పేలి మరణాలు సంభవించిన సంఘటనలు విన్నాం. చూశాం. ఎలక్ట్రిక్ బైకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని ఆయా బైకుల తయారీ కంపెనీలూ కూడా అంగీకరించాయి. అలా పేలిన బైకులకు సంబంధించి బ్యాచ్ బైకులను మార్కెట్ నుంచి ఉపసంహరించాయి కూడా.

ఇక ఇప్పుడు ఈ పేలుళ్లు స్మార్ట్ వాచ్ లకూ పాకాయి. ప్రముఖ కంపెనీ యాపిల్ కు చెందిన స్మార్ట్ వాచ్ భడేల్మని పేలిపోయింది. అదృష్ట వశాత్తూ ఆ స్మార్ట్ వాచ్ యూజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి యాపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నాడు. ఆ స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఉబ్బిపోయి లోపలి నుంచి శబ్దాలు వస్తుండటంతో భయపడిన ఆ స్మార్ట్ వాచ్ యూజర్ దానికి ఇంటి నుంచి బయట దూరంగా పడేశాడు.

ఆ వెంటనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనపై యాపిల్ స్పందించిన తీరే విమర్శలకు తావిస్తోంది. తమ కంపెనీ స్మార్ట్ వాచ్ పేలిందన్న సంగతి ఎవరికీ చెప్పవద్దంటూ ఆ వినియోగదారుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఒక డాక్యు మెంట్ పై సంతకం చేయించుకుని, పేలిపోయిన వాచ్ ను రికవర్ చేసుకుంది. మొత్తం మీద స్మార్ట్ వాచ్ లు ఉపయోగించే వారు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఈ సంఘటన చెబుతోంది.