చిరు ఘటన..ఎందుకీ రచ్ఛ

మెగాస్టార్ చిరంజీవి, పాపులర్ ప్రవచన కర్త గరికపాటి మధ్య యాధృచ్ఛికంగా జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమం వేదికగా రచ్చ రచ్చ అవుతోంది.  హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు విషయంలో గరికపాటి తొందరపాటుతోనో, తన ప్రసంగానికి అవాతరం అవుతోందనో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అ

యితే వెంటనే నిర్వాహకులు సముదాయించారు. చిరంజీవి సంయమనం పాటించారు. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోయింది. అయితే చిరంజీవి అభిమానులూ, ఆయన సోదరుడు నాగబాబు సామాజిక మాధ్యమం వేదికగా ఈ అంశాన్ని పెద్దది చేయడానికి చూపుతున్న ఉత్సాహం చిరు గౌరవాన్ని ఇనుమడింప చేసేదిగా లేదు సరికదా.. ఏదో రూపంలో విమర్శలు చేయాలని, బురద జల్లాలనీ ప్రయత్నించే వారికి అవకాశం ఇచ్చేదిలా ఉంది.

ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు బ్రాహ్మణ సంఘాలు స్పందిస్తున్నాయి. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు వ్యవహరించిన తీరు అహంకారానికి నమూనాగా ఉందనీ, అందుకనే ప్రవచన కర్త గరికపాటి అసహనం వ్యక్తం చేశారనీ వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నాయి. అవును నిజమే అలయ్ బలయ్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి – గ‌రిక‌పాటి జరిగిన చిరు ఘటన అవాంఛనీయమే.  చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల సందడి అప్పుడే ప్రసంగించడానికి ఉపక్రమిస్తున్న గరికపాటిని ఒకింత అసహనానికి గురి చేసింది. అందుకే మీరు ఫొటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లి పోతాను అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. విషయం గ్రహించిన చిరంజీవి   వెంటనే అభిమానులను సముదాయించి ఫోటో సెషన్ కు స్వస్తి పలికారు. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. జరిగిన సంఘటన వారిరువురిపైనా ఎలాంటి ప్రభావం చూపలేదనడానికి ఇదే నిదర్శనం.  ఇరువురూ కూడా వారి వారి రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు , నిష్ణాతులు. ఇద్దరిలో ఒకరు పద్మశ్రీ అయితే ఒకరు పద్మభూషణ్. జరిగిన సంఘటన కాకతాళీయమేనని ఇరువురూ గ్రహించారు.

దానిని అక్కడితో ఆపేస్తే బాగుండేది.. కానీ చిరంజీవి సోదరుడు నాగ‌బాబు  అత్యుత్సాహంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌రిక‌పాటిపై కౌంట‌ర్ వేశాడు. చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే ఏపాటి వాడికైనా ఈ పాటి అసూయ క‌ల‌గ‌డం ప‌రిపాటే అంటూ సెటైర్ వేశారు.  అందుకు తందాన పాడుతున్న చందంగా చిరంజీవి  అభిమానులు గ‌రిక‌పాటి క్ష‌మాప‌ణ‌లు డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. దీంతో గరికపాటికి మద్దతుగా ఆయన అభిమానులు బ్రాహ్మణ సంఘాల పేర రంగంలోకి దిగారు.  ఈ తీరు ఇటు చిరంజీవికీ, అటు గరికపాటికీ కూడా గౌరవాన్ని తెచ్చి పెట్టేది కాదు. ఒక ముగిసిన అధ్యాయాన్ని లాగి పీకి రచ్చ చేయడం తగదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిదని విజ్ణులు సూచిస్తున్నారు.