ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు.

అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు.

దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు.