జీతాలు వేసినా వాతలు తప్పవులే!

మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి. నలుగురైదుగురు ప్రభుత్వోద్యోగులు ఒకేచోట వుంటే అందరి ఫోన్లకూ ఒకేసారి మెసేజ్‌లు వచ్చాయి. ఈ మెసేజ్‌లు ఏమిటా అని చూసిన ఉద్యోగులు ఆశ్చర్యపో్యారు... ఆ మెసేజ్‌ల సారాంశం ఏమిటంటే, వారి నెల జీతం బ్యాంక్‌లో డిపాజిట్ అయింది. దాంతో వాళ్ళందరూ కళ్ళు నులుముకుని, చేతులను గిల్లుకుని ఇది కలయా.. నిజమా వైష్ణవ మాయా అనుకున్నారు.. ఎందుకంటే, గత నాలుగున్నర ఏళ్ళుగా ప్రభుత్వం ఏనాడూ వాళ్ళకి మొదటి తారీఖునే జీతం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క జీతం విషయంలోనే మాత్రమే కాదు. ఉద్యో్గులకు అందాల్సిన అనేక ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం జగన్ ప్రభుత్వానికి భజన చేస్తున్నారు. దీనికి వెనుక వారి స్వప్రయోజనాలు తప్ప మరేమీ లేవు. అలాంటి వారు మినహా  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారు. ఈసారి ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని ఓటుచ్చుకుని కొట్టడానికి సిద్ధంగా వున్నారు. ఇలాంటి సమయంలో వారిని కూల్ చేయడానికి మొదటి తేదీనే జీతాలు పడ్డాయన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఫస్ట్ తేదీనే ప్రభుత్వం జీతాలను పంపడం పట్ల సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగుల వాట్పాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ అయింది. ఎన్నికల పోలింగ్ దగ్గరకి వచ్చింది కాబట్టి, ఈ నాలుగున్నర ఏళ్ళలో ఫస్టు తారీఖునే జీతాలు వేశారని, జీతాలు వేసినా ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి వాతలు తప్పవని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.