అవినీతి చేస్తే మంత్రి పదవి ఊడుతుంది.. కాస్త నవ్వండన్నా, నవ్వండమ్మా

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి బలంగా చెబుతున్న మాట.. అవినీతి రహిత పాలన అందిస్తాం. సందర్భం వచ్చిన ప్రతిసారీ అవినీతిపై పోరాడాలి, అవినీతి జరగకూడదు, దేశానికే ఆదర్శంగా ఉండాలి అంటూ జగన్ స్పీచ్ ఇస్తున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అవినీతిపై మరింత ఘాటుగా స్పందించారు. అవినీతి మచ్చ పడితే.. మంత్రులైనా సరే బర్తరఫ్ చేస్తాననీ, అవినీతిపై పోరాడేవాళ్లకు బహుమతులు ఇస్తానని ప్రకటించారు. అవినీతి మకిలి అంటిన మంత్రికి రెండున్నర ఏళ్లు దాటకుండానే పదవి పోతుందని తేల్చి చెప్పారు. జగన్ వ్యాఖ్యలు.. కేబినెట్‌లో మంత్రులకు దాదాపు షాక్ ఇచ్చినంత పనైందట. ఒకవేళ తమపై అవినీతి ఆరోపణలు వస్తే నిజానిజాలు తేలకుండానే తమ పదవులు పోతాయేమోనన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమైందనీ.. అందువల్ల మంత్రులంతా ముఖాలపై నవ్వు అన్నదే లేకుండా సీరియస్‌ ఫేసులతో ఉన్నారని తెలిసింది. వారి ఫెసులు చూసిన జగన్.. "కాస్త నవ్వండన్నా, నవ్వండమ్మా" అని అనడంతో.. ఒక్కసారిగా అందరూ సీరియస్ ఫేసుల నుంచి నార్మల్ లుక్ లోకి వచ్చారని తెలిసింది.

అవినీతి విషయంలో రాజీ ప్రసక్తే లేదన్న జగన్.. అధికారులు ఎవరైనా సరే మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోకూడదనీ, రెండువైపులా కలిసి పనిచేసి, చక్కటి ఫలితాలు రాబట్టాలని సూచించారు. అధికారుల సలహాల్ని తీసుకుంటూ, మెరుగైన పాలన అందించేందుకు మంత్రులు ప్రయత్నించాలని కూడా కోరారు జగన్. మంత్రిత్వ శాఖలు చేపట్టిన పనిని, అవి ఎంతవరకూ పూర్తైందీ, ఏ దశలో ఉన్నదీ ఎప్పటికప్పుడు ఆయా శాఖల వెబ్ సైట్లలో ఉంచాలని జగన్ అధికారులను ఆదేశించారు.