పోలవరం పరిశీలనకు జగన్... 2021 లక్ష్యంగా వర్క్ యాక్షన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించి, గంటన్నరపాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. 2021 చివరి నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో... పనుల వేగవంతానికి దిశానిర్దేశం చేయనున్నారు.

స్పిల్‌వే 18వ గేటు దగ్గర ఏర్పాటు చేసిన పోలవరం పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం, హిల్‌ వ్యూ-2పైకి వెళ్లి స్పిల్‌వే కాంక్రీట్ పనులను పరిశీలిస్తారు. అలాగే, గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఎగువ కాఫర్ డ్యామ్‌ను చూస్తారు. అక్కడ్నుంచి పోలవరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంకానున్నారు. పనులు జరుగుతున్న తీరు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్నతస్థాయి సమీక్షిస్తారు. ముఖ్యంగా పరిహారం, పనుల వేగవంతంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ సమావేశంలోనే నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.