ఈ బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది: చంద్రబాబు నాయుడు

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “ఈ బడ్జెట్ మాకు తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల న్యాయం చేయాలని నేను పదేపదే కేంద్రాన్ని కోరాను. ప్రజలకు మనమిచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని ప్రధాని మోడీకి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడల్లా చెపుతూనే ఉన్నాను. కానీ బడ్జెట్ లో రాష్ట్రానికి తగినన్ని నిధుల కేటాయింపు జరగలేదు. నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు. పొరుగునున్న హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు నగరాలతో పోటీపడగలిగే స్థాయికి చేరుకొనే వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరాను. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని నిర్మించే బాధ్యత కేంద్రమే స్వీకరించింది. కానీ దాని కోసం ఈ బడ్జెట్ లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. దానితో ఈ ప్రాజెక్టులో ఏమి చేయదలచిందో అర్ధం కావడం లేదు. ఈ విధంగా కేటాయింపులు చేస్తుంటే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో అర్ధం కావడం లేదు.

 

రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాని ఊసు కూడా రైల్వే బడ్జెట్ లో లేదు. రాజధాని నిర్మాణానికి సుమారు లక్ష కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశాము. దానికి ఈ బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపు జరగలేదు. బడ్జెట్ లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, జలవనరుల అభివృద్ధికి కూడా తగినన్ని కేటాయింపు జరగలేదు. మేమందరం కూర్చొని బడ్జెట్ లో అంశాలపై మళ్ళీ ఓసారి లోతుగా అధ్యయనం చేసి, చర్చించుకొన్న తరువాత నేను మళ్ళీ డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని, ఈ రాష్ట్ర విభజనకు నేతృత్వం వహించిన హోం శాఖ అధికారులను, మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలిసి రాష్ట్ర పరిస్థితులను, బడ్జెట్ కేటాయింపుల పట్ల ప్రజల ప్రతిస్పందన, మా ప్రతిస్పందన, తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరుతాను. అవసరమయితే ప్రతిపక్షాలను కూడా మాతో తీసుకువెళ్ళి కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాము,” అని అన్నారు.