అవినాష్ కు బెయిలు.. జగన్ కు నోటీసులా?

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ బుధవారం ( మే 31) తుది తీర్పు ఇచ్చేసింది. అయితే బెయిలు వచ్చినంత మాత్రాన సంతోషించడానికి అవినాష్ రెడ్డికి పెద్దగా మిగిలిందేమీ లేదు. ప్రతి వారం విచారణకు హాజరు కావాల్సిందే. సీబీఐ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే.

అయితే ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించడానికి ముందు జరిగిన హైడ్రామా కారణంగా బెయిలు లభిస్తే చాలు  అవినాష్ రెడ్డి గెలిచేసినట్లే  అన్న వాతావరణం క్రియేట్ అయ్యింది. అయితే అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ  హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో అవినాష్ నే కాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విచారించాల్సి ఉంటుందని విస్పష్టంగా పేర్కొంది. పకడ్బందీగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లను ప్రస్తావించి.. అవినాష్ కు తప్పించుకునే అవకాశం లేకుండా చక్రబంధంలో ఇరికించింది. ప్రభావ వంతమైన వ్యక్తి అనీ, రాజకీయ కోణంలో జరిగిన వివేకా హత్య లో అవినాష్ ప్రమేయం ఉందని విస్పష్టంగా చెప్పింది. అలాగే వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలుసునని పేర్కొంది. ఆ సమాచారాన్నిఆయనకు అవినాష్ రెడ్డే చేరవేశారని కూడా సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.  

అంతే కాకుండా వివేకా హత్య వెనుక కుట్ర ఉందనీ, తమ దర్యాప్తులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హత్య విషయం ప్రపంచానికి ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించడానికి ముందే తెలుసుననీ సీబీఐ పేర్కొంది.  హత్య విషయాన్ని ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15 ఉదయం 6.15 గంటలకు వెల్లడిస్తే జగన్ మోహన్ రెడ్డికి మాత్రం హత్య విషయం అంతకంటే ముందే తెలిసిందనీ సీబీఐ పేర్కొంది. అలాగే హత్యకు ముందు, తరువాత కూడా అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు తేలిందనీ, ఆయనే జగన్ మోహన్ రెడ్డికి వివేకా హత్య విషయం చెప్పి ఉంటారనీ, ఆవిషయాన్ని ఆయనను విచారించి తేల్చుకోవాలని, ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉంటుందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది.

ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుంటే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు రావడమన్నది చాలా చిన్న విషయమనీ, వివేకా హత్య కేసులో లాజికల్ ఎండ్ కు చేరే దిశగా సీబీఐ దర్యాప్తు చాలా పకడ్బందీగా ఉందనీ నిపుణులు అంటున్నారు. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను బట్టి ఇక నుంచి ప్రతి శనివారం అవినాష్ సీబీఐ విచారణలో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, ఎక్కువ కాలం విచారణకు సహకరించకుండా ఉండే  అవకాశం ఉండదనీ అంటున్నారు. ఒక వేళ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించకుంటే సీబీఐ ఆయన బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు.