ఏపీ, తెలంగాణ బడ్జెట్ కబుర్లు

 

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7 నుంచి మొదలవబోతున్నాయి. గవర్నర్ నరసింహన్ మొదట ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉభయసభలను, ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 12న సభలో ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సమర్పిస్తారు. మార్చి 27 వరకు ఈ సమావేశాలు నిర్వహించవచవచ్చును.

 

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మార్చి11న ప్రవేశపెడతారు. మార్చి 13, 14,16 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. మార్చి 17న ఆర్ధికమంత్రి బడ్జెట్ పై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెపుతారు. మార్చి25 వరకు నిర్వహించవచ్చును. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాలలో నిర్ణయిస్తారు.

 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొట్టమొదటిసారిగా 2015-16సం.లకి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు, తెలంగాణా బడ్జెట్ సుమారు రూ.1.0 లక్ష కోట్లు ఉండవచ్చని సమాచారం. ఉభయ రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, అవసరాలు, ఆర్ధిక వనరులు కలిగి ఉన్నందున వాటి బడ్జెట్ కేటాయింపులు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలికవసతుల, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాజధాని నిర్మాణం కూడా చేపట్టబోతోంది. వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచుకొనే అవకాశం ఉంది. వాటి ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. కనుక వాటి కోసం ముందుగా యువతకు ఆయా రంగాలలో సాంకేతిక శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్) కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ‘నాలెడ్జ్ హబ్’ గా తయారుచేయాలని భావిస్తున్నారు. కనుక మిగిలిన అన్నిటికంటే ఆ రంగానికే చాలా భారీగా నిధులు కేటాయించవచ్చును.

 

దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం నదులు అనుసంధానం చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఎత్తిపోతల పధకాలకు ద్వారా సీమ జిల్లాలకు త్రాగు,సాగు నీరు అందించేందుకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేయవచ్చును.

 

తెలంగాణా రాష్ట్రం ప్రధానంగా చెరువుల పునరుద్దరణ ద్వారా పంటలకు నీళ్ళు అందించి తద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కష్టాలను నివారించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందుకోసం ముమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మంచి నీళ్ళు సరఫరా చేస్తామని లేకుంటే ప్రజలను ఓట్లు అడగబోమని కేసీఆర్ పడే పడే చెపుతున్నారు. కనుక ఈ బడ్జెట్ లో ఈ రెండు పధకాల కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటోంది. కనుక దానిని అధిగామించేందుకు రాష్ట్రంలో పలుచోట్ల థర్మల్, సౌర విద్యుత్ ఉత్పతి కేంద్రాలను స్థాపించేందుకు వీలుగా కేటాయింపులు చేయవచ్చును.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనలో తెలంగాణా రాష్ట్ర సంస్క్రతి, సంప్రదాయాలను, తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ఉనికిని చాటుకొనేందుకు చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణాకే ప్రత్యేకమయిన బ్రతుకమ్మ, బోనాల పండుగల నిర్వహణ, తిరుపతితో సమానంగా యాదగిరిగుట్ట అభివృద్ధి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఎర్రగడ్డ వద్ద కొత్త సచివాలయ నిర్మాణం వంటి భారీ కార్యక్రమాలను భుజాలకెత్తుకొన్నారు. అయితే వీటిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఆకాశ హర్మ్యాల నిర్మాణం సాధ్యాసాధ్యాలను ఇంకా పరిశీలించవలసి ఉంది. కనుక మిగిలిన వాటికి భారీ కేటాయింపులు జరుపవచ్చును.

 

మెట్రో రైల్ మార్గంలో మార్పులు చేర్పులకు అయ్యే అదనపు వ్యయాన్ని తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సుమారు రూ.2200 కోట్లు అవసరం ఉంటాయని నివేదిక అందింది. దానికి ఈ బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయింపు జరుపవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ మెట్రో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.

 

కనుక రెండు రాష్ట్రాలు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అద్దం పట్టేవిగా ఉంటాయని స్పష్టం అవుతోంది. అయితే ఆ బడ్జెట్ కేటాయింపులు వాస్తవ అంచనాలకి, పరిస్థితులకి అనుగుణంగా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారు.