ప్రత్యేక హోదా ఏమోగానీ, పుణ్యకాలం పూర్తయ్యేట్టుంది...

 

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ‘ప్రత్యేక హోదా’ కోసం బృందగానం ఆలపిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల గురించి వెంకయ్యనాయుడు ఇదివరకే ప్రజలకి వివరించి, ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యామ్నాయ ప్యాకేజీలను అందజేస్తామని చెప్పారు. కానీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి వల్ల ఆయన తన మాటలని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు, పోరాటాలను పక్కనబెట్టి వెంకయ్య నాయుడు చెప్పిన యదార్ధ పరిస్థితులను, సమస్యలను ప్రజలు అర్ధం చేసుకోవలసి ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒప్పించితే గానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడు చెప్పిన మాట నూటికి నూరు శాతం వాస్తవం.

 

ఒకవేళ ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వదలిస్తే తమ రాష్ట్రాలకీ ఇమ్మని అనేక రాష్ట్రాలు డిమాండ్లు చేస్తున్నాయి. రాజస్థాన్, ఓడిషా, బీహార్, ఛత్తీస్ ఘర్ వంటి కొన్ని రాష్ట్రాలయితే చాలా కాలంగా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాష్ట్రంలో పరిశ్రమలు అక్కడికి తరలిపోతాయి గనుక ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని తమిళనాడు, కర్ణాటక, ఓడిషా వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితులలో వాటినన్నిటినీ ఒప్పించి ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని స్పష్టం అవుతోంది. అదే విషయం వెంకయ్య నాయుడు చెప్పారు.

 

అయితే “సాధ్యం కాదని తెలిసి బీజేపీ ఎందుకు హామీలు ఇచ్చిందని, హామీ ఇచ్చింది గనుక తప్పనిసరిగా ఇవ్వాల్సిందే!” అని పట్టుబట్టి కూర్చొంటే ప్రజల, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి “అన్ని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నాలు సా....గుతున్నాయంటూ” ఎన్డీయే ప్రభుత్వం మరికొన్ని నెలలో సంవత్సరాలో దొర్లించేయవచ్చును. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా వచ్చేలోగానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు. దాని వలన వచ్చే ఎన్నికలలో బీజేపీ నష్టపోవచ్చును. అది వేరే సంగతి. కానీ అంతకంటే ముందుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.

 

రాష్ట్ర విభజన సమయంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏవిధమయిన భావోద్వేగాలకు లోనయ్యారో, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా అటువంటి భావోద్వేగాలకే లోనవుతున్నారు. అప్పుడు ఈ భావోద్వేగాల కారణంగానే రాష్ట్ర విభజన అనివార్యమనే చేదు నిజాన్ని అంగీకరించలేక ప్రజలందరూ ఉద్యమబాట పట్టారు. ఆ కారణంగానే యూపీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆగ్రహం చల్లార్చి వారిని ప్రసన్నం చేసుకొని ఓట్లు దండుకొనేందుకు హడావుడిగా పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటించి చేతులు దులుపుకొంది తప్ప అందులో ఇమిడి ఉన్న ఈ ఇబ్బందుల గురించి అప్పుడు పట్టించుకోలేదు, ప్రస్తావించలేదు కూడా. ఎందుకంటే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మాట కదా...అనే ఆలోచనతో హామీలు గుప్పించి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని వాదిస్తోంది.

 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగి ఉండేదా..లేదా? ఇవ్వగలిగితే అది ఏవిధంగా సాధ్యమో ఎన్డీయే ప్రభుత్వానికి చెప్పి పుణ్యం కట్టుకోవచ్చును. ఒకవేళ అప్పుడు కూడా ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకాడితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజలు కూడా ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతారు. కానీ ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం ఈ విధంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీద్దామనే ఉద్దేశ్యంతోనో లేకపోతే రాష్ట్రంలో ప్రజలను ప్రసన్నం చేసుకొందామనే ఉద్దేశ్యంతోనో ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుకొంటే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే రుచి చూసింది. అయినా దాని తీరు మారలేదని అర్ధం అవుతోం ది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రప్రజల మనోభావాలను, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా పదవుల కోసం ప్రాకులాడిన రాష్ట్ర కాంగ్రెస్ యంపీలు, నేతలు ఇప్పుడు పార్లమెంటు వద్ద గాంధీ విగ్రహం వద్ద నిలబడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ధర్నాలు చేస్తున్నారు. అటువంటి వారి పోరాటాలను నమ్మాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవలసి ఉంటుంది.

 

రాష్ట్ర విభజన సమయంలో ప్రజలలో నెలకొన్న ఇటువంటి భావోద్వేగాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన అనేక ప్రయోజనాలు దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా భావోద్వేగాలకులోనయి రాజకీయ పార్టీలకు ఈ వికృత రాజకీయ క్రీడ ఆడుకొనేందుకు అవకాశం కల్పించి, నష్టపోయిన తరువాత బాధపడటం కంటే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్యాకేజీలు, రాయితీలు కేంద్రం నుండి రాబట్టుకోవడమే మంచిది. ఒకవేళ మరో ఆర్నేల్లో ఏడాదో లేకపోతే మరో రెండేళ్ళ తరువాతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినప్పటికీ అప్పటికే చాలా పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. పైగా అప్పటికి రాజాకీయ పరిస్థితులు, సమీకరణాలు మారినా మారవచ్చును. కనుక అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఆంద్రప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్ర ప్రయోజనాలను బలి చేసుకోవడం కంటే, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదాకి ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రానికి మంచి ఆర్ధిక ప్యాకేజి, పరిశ్రమలకు రాయితీలు వంటివన్నీ వీలయినంత వేగంగా మంజూరు చేయించుకోనేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవడమే అన్ని విధాల మంచిదని చెప్పవచ్చును.