రఘునందన్‌కి అమెరికా కోర్టు మరణశిక్ష

 

అమెరికా పెన్సిల్వేనియాలో నెలల చిన్నారి శాన్వి, సత్యవతి హత్య కేసులో నిందితుడు యండమూరి రఘునందన్‌కు పెన్సిల్వేనియా ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రెండేళ్ళ పాటు ఈ కేసు విచారణ జరిపిన అమెరికా కోర్టు ఈ నెల 9న రఘునందన్‌‌ను దోషిగా నిర్ధారించింది. మంగళవారం నాడు అతనికి మరణశిక్ష ఖరారు చేసింది. 2012 అక్టోబర్‌ 22న పెన్సిల్వేనియాలో నెలల వయసున్న పసిపాప శాన్వి, పాప నాయనమ్మ సత్యవతి వాళ్ల ఇంట్లోనే హత్యకు గురయ్యారు. మొదట హత్య చేసింది తానే అని ఒప్పుకున్న యండమూరి  రఘునందన్‌ ఆ తర్వాత మాట మార్చాడు. ఈ రెండు హత్యలతో తనకు ఎంతమాత్రం ప్రమేయం లేదని, దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల ప్రత్యేక కోర్టు బెంచ్‌ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్‌ ఒక కట్టుకథ అల్లాడు. దాంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు ఈ కేసు బదిలీ అయ్యింది. ఈ హత్యల కేసును మళ్ళీ మరోసారి విచారించిన న్యాయమూర్తులు యండమూరి రఘునందన్‌ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునే ఈ హత్యలను చేశాడని నిర్ధారించారు.