TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా మిడ్ టర్మ్ పోల్: ట్రంప్ కు ప్రజా తిరస్కారం.. రిపబ్లికన్ మద్దతు దారులూ డెమొక్రట్ల వైపే.!

Published on: Sat Nov 14, 2026 1:07PM

అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం నిజంగానే అగ్రరాజ్య రాజకీయ చరిత్రలో ఊహించని పరిణమంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాలు చోటుచేసుకున్నాయి.  కాంగ్రెస్‌లోని రెండు సభల నియంత్రణను డెమొక్రాటిక్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు ఐదు గవర్నర్ పదవులను కూడా గెలుచుకుంది. ఈ పరిణామం నిస్సందేహంగా అగ్రరాజ్యాధినేత   డొనాల్డ్ ట్రంప్ పాలనకు ప్రజా తిరస్కారంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సెనేట్‌లో డెమొక్రాటిక్ కాకస్‌కు 54 స్థానాలు లభించగా, రిపబ్లికన్ పార్టీ 44 స్థానాలకే పరిమితమై ఏడు స్థానాలను కోల్పోయింది. అదేవిధంగా ప్రతినిధుల సభ లో డెమొక్రాట్లకు 242 స్థానాలు, రిపబ్లికన్లకు 151 స్థానాలు దక్కాయి.  మొత్తం మీద డెమొక్రాట్లు గణనీయమైన ఆధిక్యంతో ముందుకుదూసుకెళ్లారు.   ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

గతంలో ట్రంప్ భారీ మెజారిటీతో గెలుచుకున్న రాష్ట్రాల్లోనూ సెనేట్ స్థానాలు చేజారిపోవడం విశేషం. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా కాన్సాస్, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల రోజున ఓటర్లలో ట్రంప్ ఆమోద రేటింగ్   38 శాతానికి పడిపోయింది. 2008 తర్వాత ఏ అధ్యక్షుడికైనా ఈ స్థాయిలో కనిష్ట రేటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దాదాపు 43 శాతం మంది ఓటర్లు అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగానే ఓటు వేసినట్లు స్పష్టం చేశారు.   ఆర్థిక అంశాలే ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఫిబ్రవరిలో గ్యాలన్‌కు 2.93 డాలర్లుగా ఉన్న పెట్రోల్ ధర అక్టోబర్ నాటికి 4.29 డాలర్లకు పెరగడం ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. వినియోగదారుల ద్రవ్యోల్బణం రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాల కంటే అధ్యక్షుడి ఆర్థిక విధానాలే కారణమని సుమారు 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 

దీనికి తోడు ఇరాన్ తో యుద్ధం, టారిఫ్‌ల విధింపు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి. దాదాపు 63 శాతం మంది ఇరాన్ యుద్ధాన్ని తప్పు నిర్ణయంగా భావించగా, 65 శాతం మంది  ఆర్థిక వ్యవస్థను టారిఫ్‌లు దెబ్బతీశాయని పేర్కొన్నారు.   భారతీయ అమెరికన్ల ఓటర్ల ధోరణిలో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక విధానం, దేశీయ మార్కెట్ పరిస్థితులు,  ఇమ్మిగ్రేషన్ అంశాలపై ట్రంప్ అనుసరించిన వైఖరిని మెజారిటీ భారతీయ అమెరికన్లు వ్యతిరేకించారు. వీసా నిబంధనలు, హెచ్ 1బి ఫీజుల పెంపు,  కొన్ని టెక్నాలజీ కంపెనీల స్పాన్సర్‌షిప్ సస్పెన్షన్ వంటి చర్యలు ఈ వర్గంలో తీవ్ర నిరాశను ఆగ్రహాన్ని రగిల్చాయి.  ఫలితంగా ఆసియన్ అమెరికన్ల మద్దతు పెద్దఎత్తున డెమొక్రాట్ల వైపు మళ్లింది.   

అమెరికన్ రాజకీయాల్లో మిడ్‌టర్మ్ ఎన్నికలు అధికార పార్టీని శిక్షించడం రివాజే అయినప్పటికీ..  ఈసారి వ్యక్తమైన ప్రజా వ్యతిరేకత ఊహాతీతంగా ఉంది. కేవలం సంప్రదాయ ఓటర్లే కాకుండా, గతంలో రిపబ్లికన్ వైపు మొగ్గు చూపిన లాటినో, యువ,  శ్వేతజాతీయ ఓటర్లు సైతం ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలిచారు. పెట్రోల్ ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు మరియు కొనుగోలు శక్తి పడిపోవడం వంటి అంశాలను ఓటర్లు ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు.   

ఇది కూడా చదవండి:  చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న ట్రంప్: వలసదారులపై కఠిన వైఖరి తప్పని ఒప్పుకోలు.!

ఎన్నికల ఫలితాల అనంతరం అధ్యక్షుడు ట్రంప్ తన వైఖరిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. డెమొక్రాట్లను అభినందిస్తూనే, మరోవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు మరియు వీటో అధికారాల ద్వారా తన ఇమ్మిగ్రేషన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలను ప్రకటించారు. మరోవైపు డెమొక్రాటిక్ నాయకులు అధ్యక్షుడి విధానాలపై దర్యాప్తులు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో శాసనసభలో ఇరు పక్షాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.   

ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. ప్రజల నిత్య జీవిత సమస్యలను, ఆర్థిక వాస్తవాలను సరిగ్గా అంచనా వేయడంలో పాలకవర్గం విఫలమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. రాబోయే రెండేళ్ల కాలంలో దేశాన్ని ముందుకు నడిపించడంలో మరియు అంతర్జాతీయ సంబంధాలను చక్కదిద్దడంలో ఈ ఎన్నికల తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.  

మీకు నచ్చవచ్చు:  ట్రంప్ అధికారాలకు కళ్లెం: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితం.!

వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   


[America, MidtermElections, DonaldTrump defeat, Inflation, IranWar, TeluguOne]