అవనిగడ్డ తెదేపా అభ్యర్ధి శ్రీహరిబాబు

 

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ నియోజకవర్గానికి, ఆయన కుమారుడయిన అంబటి హరిబాబుని తెదేపా అభ్యర్ధిగా నిలిపి, ఆయన ఏకగ్రీవ ఎన్నిక కోసం తెదేపా నేతలు కృషిచేస్తున్నట్లు సమాచారం.

 

అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంత అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం ప్రకటించడం పట్ల రాష్ట్రంలో అన్నిరాజకీయ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. ఎందుకంటే, జూన్ 8న కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 15మంది శాసనసభ్యులపై అనర్హత వేటుపడినప్పుడు, ఆయా నియోజక వర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించవలసి ఉన్నపటికీ, సాధారణ ఎన్నికలకి ఏడాదికంటే తక్కువ సమయం మిగిలి ఉన్నందున, ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ స్థానాలను కూడా వచ్చేసాధారణ ఎన్నికలతో బాటు కలిపి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.

 

కానీ, ఏప్రిల్ 21న బ్రాహ్మణయ్య మరణంతో ఖాళీ అయిన అవనిగడ్డకి మాత్రం ఏడాదికంటే ఎక్కువే సమయం మిగిలి ఉన్నందున ఉపఎన్నికలు నిర్వహించుతున్నామని ఎన్నికల సంఘం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

బ్రాహ్మణయ్య ఏప్రిల్21న మరణించగా,15మంది శాసనసభ్యులపై జూన్ 8న అనర్హత వేటు పడింది. అంటే కేవలం 17రోజుల తేడా మాత్రమే ఉంది. అయినప్పటికీ, సాంకేతిక అంశాల, నియమ నిబంధనల పేరిట కేవలం అవనిగడ్డకి మాత్రమే ఉపఎన్నికలు నిర్వహిస్తూ, మిగిలిన 15 నియోజక వర్గాలకు నిర్వహించకపోవడాన్నిరాజకీయపార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా 15 స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే, తన సత్తా చాటుకొందామని ఆశపడిన వైకాపా ఎన్నికల సంఘం నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయింది.

 

కానీ తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో 15 స్థానాలకు ఉపఎన్నికలు కోరుకోవడం లేదు గనుక ఎన్నికల సంఘం నిర్నయంపట్ల ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవచ్చును. ఈనెల 27 న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 21 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.