ఓ మనిషీ... నీ దారెటువైపు

మానవత్వం అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది. ఇంతకు మునుపు రాజులు రాజ్యాధికార దాహంతో యుద్దాలు చేసేవారు. ఈ ప్రక్రియలో బలి అయింది సామాన్యులే. ఇప్పుడు, మతం, అధికార కాంక్షతో మనుషులు మృగాలుగా మారుతున్నారు. ఈ ప్రక్రియలో అసువులు బాస్తుంది కూడా సామాన్య జనమే. 

 

నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో కొందరు ప్రాణాలు విడువగా, మరి కొందరు క్షతగాత్రులయ్యారు. అమర్నాథ్ యాత్రకి వెళ్తున్న వాహనంపై ఉగ్ర వాదులు మెరుపు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హిందువులు పవిత్ర పుణ్య క్షేత్రం కి వెళ్లి, తిరుగు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ముస్లిం అయిన డ్రైవర్ చాకచక్యంగా ఉగ్రవాదులకు భయపడకుండా బస్సు ని అలాగే ముందుకు పోనివ్వబట్టి చాలా మంది ప్రాణాలతో బయట పడ్డారు, లేదంటే పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఆ డ్రైవర్ మీడియా తో మాట్లాడుతూ, "అసలు ఉగ్రవాదులకు కులం, మతం, హిందూ, ముస్లిం అన్న భావన ఉండదని, ఎవర్ని లక్ష్యం చేసుకుంటున్నామో కూడా ఆలోచించకుండా మారణకాండ సాగించడమే వాళ్ళ ముఖ్యోద్దేశమని," అన్నాడు. ముస్లింలు, ముస్లింలనే చంపుకుంటే అసలు వాళ్ళ గమ్యం ఎటు వెళ్తున్నట్టు? అర్ధం లేని పయనం వ్యర్ధమే కదా! చూస్తుంటే వాళ్ళకి తెలిసింది చంపడం మాత్రమే, ఎవరిని చంపాము అని కూడా అనవసరమే.

 

ఇదిలా ఉంటే, చైనా కవ్వింపు చర్యలు కూడా ఉగ్రవాదం కన్నా తక్కువేం కాదు. ఆ దేశ సైనికుల చర్యలు మన జవానులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాము చావాలి కర్ర విరగకూడదు అన్నట్టుగా ఉంది మన సైనికుల పరిస్థితి. పరిస్థితులు చేయి దాటకుండా చూడాలి, అలాగని తొందరపడి చైనా సైనికుల పై ఎలాంటి దాడి చేయకూడదు. మనకేంటి ఇంట్లో కూర్చొని మంచి, చెడూ అన్ని మాట్లాడుతాం. చావు ముందు పెట్టుకొని బోర్డర్ లో గర్వంగా నిలబడే సైనికుడికే తెలుస్తుంది- తాము ఎలాంటి పరిస్థితులకి ఎదురొడ్డి నిల్చున్నామో అని. ఇంతకీ, మన వాళ్ళు ఇంత శాంతంగా ఉన్నా, చైనా ఎందుకు కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది. తమది కాని ఒక భూభాగం కోసమే కదా! ప్రపంచం మొత్తం చైనా ని వేలు పెట్టి చూపిస్తున్న వేళ, తాము చేసేది ముమ్మాటికీ సరియైనదే అన్న ధోరణిలో ఉన్నారు. అయినా మన సైనికులు మాత్రం పక్క వాళ్ళు తొందర పడే వరకు వేచి చూడాలి, అంటే ఎవరో కనీసం ఒక్కరు ప్రాణాలు కోల్పోయే వరకు!

 

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అగ్ర దేశం అమెరికాకే సవాళ్లు విసురుతున్నాడు. తాము ఏ సమయంలో యుద్ధం వచ్చినా సిద్దమే అని.... వరుస అణు పరీక్షలు చేస్తూ ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాడు. ఉత్తర కొరియా లాంచ్ చేసిన ఒక క్షిపణి వేల మైళ్ళు దాటి అమెరికా లో పేలగలదు అని కిమ్ జాంగ్ ప్రకటించాడు. అసలు, అతడి ఉద్దేశ్యం ఏంటి? మూడవ ప్రపంచ యుద్దానికి భీజం వేసే పనులు కాకపోతే! అసలు నిజంగా మూడవ ప్రపంచ యుద్ధమే గనక జరిగితే, భూమిపై మానవాళి అసలుంటుందా?

 

ఒకరిని అధిగ మించాలనే తపనతో, లేదా మత ఛాందసవాదంతో... మనిషి, సాటి మనిషిని శత్రువుగా చూస్తున్న వేళ... ఒకరిని ఇంకొకరు చంపుకుంటున్న వేళ... మానవత్వపు ఛాయలు మంటగలిసి పోతున్న వేళ... ఓ మనిషి నీ గమ్యం ఎటు వైపు... అందరూ పోయాక నువ్ సాధించేదేమిటి...