రాజధాని రైతుల చేతులకు బేడీలు.. ఇదేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం

గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు, తదితరులు రైతులను పరామర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కాగా, మంగళగిరి మండలం కృష్టాయపాలేనికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులకు అనుకూలంగా కొంతమంది ఆటోలలో రావడంతో రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో రవి అనే వ్యక్తి రాజధాని రైతులపై కేసు పెట్టాడు. తర్వాత అతను తన ఫిర్యాదును వాపసు తీసుకుంటూ లేఖ రాసిచ్చినా.. కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. తన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రస్తావన లేకపోయినా కేసు అలా నమోదు చేశారని రవి తెలిపాడు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఇక తాజాగా రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంతో మరోసారి పోలిసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజధాని రైతులకు బేడీలు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారని, రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు మాత్రం బేడీలు వేశారని మండిపడ్డారు. ఇదేనా సీఎం జగన్ తెస్తానన్న రైతు రాజ్యమని ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి? అని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి. లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ అన్నారు.