ఏపీకి అమ‌ర‌రాజా గుడ్‌బై? టార్చ‌ర్ తట్టుకోలేక త‌మిళ‌నాడుకు త‌ర‌లింపు?

అది కంపెనీ కాదు.. ఉద్యోగాల గ‌ని. అది సంస్థ కాదు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తి. అది త‌యారు చేసేది కేవ‌లం బ్యాట‌రీలు మాత్ర‌మే కాదు.. అది ఏపీకి బ్రాండ్ ఇమేజ్ కూడా. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌. ఇది మ‌న ఆంధ్రుల అంద‌రి కంపెనీ. బ్యాట‌రీ త‌యారీరంగంలో దేశంలోకే నెంబ‌ర్ 2. బిలియ‌న్ డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థ‌. ట్యాక్స్‌ రూపంలో దేశ ఖ‌జానాకు 2400 కోట్లు జ‌త చేస్తున్న ఘ‌న‌త‌. ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌. అలాంటి బంగారు బాతులాంటి సంస్థ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు క‌క్ష్య‌క‌ట్టిందంటున్నారు. కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ, 'క‌మ్మ‌' వార‌నే ఏకైక కార‌ణంతో అమ‌ర‌రాజాపై కుట్ర‌లు చేస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంస్థ స్థాపించి దాదాపు 4 ద‌శాబ్దాలు అవుతోంది. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం అమ‌ర‌రాజాకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. 

గ‌ల్లా అరుణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా కుట్ర‌లు ఆప‌లేదు. గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నార‌ని కాబోలు.. కుతంత్రాలు ఆప‌డం లేదు. ఇటీవ‌ల పొల్యూష‌న్ బోర్డు అధికారుల‌ను అమ‌ర‌రాజా క‌ర్మాగారంపైకి పాల‌కులు ఉసిగొల్పారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కంపెనీ వ‌ల్ల కాలుష్యం క‌లుగుతోంద‌ని.. వెంట‌నే మూసేయాలంటూ నోటీసులు ఇచ్చారు. 36 ఏళ్లుగా ఉన్న ఫ్యాక్ట‌రీ విష‌యంలో ఇప్పుడే పొల్యూష‌న్ గుర్తుకొచ్చిందా? అమ‌ర‌రాజా ఏ చిన్నాచిత‌కా బ‌డ్డీ కొట్టో కాదు. అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీ. నిబంధ‌న‌లు, త‌నిఖీలు ప‌క్కాగా ఫాలో కావాల్సిందే. అంత సిల్లిగా ఏమీ న‌డ‌వ‌దు క‌ర్మాగారం. కావాల‌నే, ఇబ్బందులు సృష్టించార‌ని, పొల్యూష‌న్ బోర్డుతో చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇదంతా రాజ‌కీయ ప్రోత్బ‌లంతో జ‌రిగింద‌ని పారిశ్రామిక వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా, స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. అన్నంత ప‌నీ చేసేవారే. కంపెనీని మూసేసేవారే. కానీ, న్యాయం, చ‌ట్టం అంటూ ఉంటాయిగా. స‌ర్కారే సుప్రీంకాదుగా. అందుకే, కోర్టుకెళ్లి మ‌రీ ఆ ఆదేశాల‌ను అడ్డుకుంది యాజ‌మాన్యం. ఇలా ఒక‌టి కాక‌పోతే ఇంకోటి.. ప్ర‌భుత్వం నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న ఇబ్బందుల‌తో విసిగిపోయిన యాజ‌మాన్యం.. ఇక ఏపీలో ఉండ‌టేమంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను ఉండ‌నిచ్చేలా లేరంటూ.. పొరుగు రాష్ట్రానికి వ‌ల‌స వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  

అంత పెద్ద కంపెనీ వ‌స్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా? అందుకే, రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ త‌మ రాష్ట్రానికి రమ్మంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. సీఎం స్టాలిన్‌తో అమ‌ర‌రాజా యాజ‌మాన్యం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని.. చెన్నై శివార్ల‌లో స్థ‌లం కూడా కేటాయించిన‌ట్టు.. అక్క‌డ ముమ్మ‌ర ప‌నులు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే అనుకున్న‌ట్టే సాగితే.. మ‌రో 3 నెల‌ల్లోనే దేశ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ అమ‌ర‌రాజా కంపెనీ చిత్తూరు నుంచి త‌మిళ‌నాడుకు త‌ర‌లిపోనుంది. ఇది ఆంధ్రులుగా మ‌నంద‌రికీ అవ‌మాన‌క‌ర విష‌య‌మే. 

ఏపీపై అమ‌ర‌రాజాకు ఉన్న అనుబంధం, అభిమానం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లోని  ప్ర‌ధాన కార్యాలయాన్ని తిరుపతికి త‌ర‌లించింది అమరరాజా. ఎందుకంటే, తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణం. 1985లో గల్లా రామచంద్ర నాయుడు స్థాపించిన అమ‌ర‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌.. వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ద‌శ‌బ్దాలుగా దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మై వెలుగుతోంది. వాహన బ్యాటరీలు , బ్యాటరీ ఛార్జర్స్, ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక బ్యాటరీలు , డిజిటల్ ఇన్వర్టర్స్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ , ఆహార ఉత్పత్తులు , ట్రిక్కేల్ ఛార్జర్స్, యూపిఎస్, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్.. ఇలా ప‌లు ప్రొడ‌క్ట్స్ త‌యారు చేస్తోంది. కంపెనీలో దాదాపు 16వేల మంది ప‌ని చేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంకలనం చేసిన ఆసియా లో "'బెస్ట్ అండర్ ఎ బిలియన్" 2010 జాబితాలో అమర రాజా బ్యాటరీస్ ఒక‌టి. సామాజిక సేవ‌లోనూ అమరరాజా గ్రూప్ త‌న‌వంతు పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ఉపాధి, అభ్యసన-విద్య, సామాజిక పునరావాసం, గ్రామీణ అభ్యున్నతి వంటి రంగాలలో కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. 

ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీపై కేవ‌లం టీడీపీ, 'క‌మ్మ' అనే కార‌ణాల‌తో కుట్ర‌లు చేస్తూ మ‌నుగ‌డ సాగ‌నివ్వ‌కుండా వేధిస్తూ.. పొల్యూష‌న్‌ను సాకుగా చూసి ఏకంగా ఫ్యాక్ట‌రీనే మూసేయాల‌నే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ ప్ర‌య‌త్నాల‌తో అస‌హ‌నానికి లోనైన అమ‌ర‌రాజా యాజ‌మాన్యం.. త‌న పుట్టింటిని వ‌దిలి వెళ్లేందుకు బాధ‌తో సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు స‌ర్కారు అక్కున చేర్చుకుంటుండ‌టంతో.. అక్క‌డికి త‌ర‌లివెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలుస్తోంది. ప‌న్నుల రూపంలో ఏటా వెయ్యి కోట్ల‌కు పైగా జ‌మ చేస్తూ.. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీని కాల‌ద‌న్నుకొని.. జ‌గ‌న్ స‌ర్కారు ఏం సాధించిన‌ట్టో? రాజ‌కీయ లాభం కోసం ఇలా రాష్ట్ర‌, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డికే చెల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీవాసులు.