తనను ఓడించిన ప్లేయర్ కు ప్రోత్సాహం.. సాహో సింధు.. 

టోక్సో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది తెలుగు తేజం పీవీ సింధు. సెమీస్ లో హోరాహోరీ పోరాటంలో ఓడినా.. కాంస్యం పతకం పోరులో విజయం సాధించి భారత్ కు రెండో పతకం అందించింది. అంతేకాదు రెండు వరుస ఒలింపిక్సుల్లో సింగిల్ విభాగంలో పతకాలు సాధించి సరికొత్త రికార్డ్ స్పష్టించింది పీవీ సింధు. అద్భుత ఆటతీరును ప్రదర్శించిన సింధును భారతావని కొనియాడుతోంది. అయితే తన ఆటతీరుతోనే కాదు స్పోర్టివ్ స్పిరిట్ తో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది పీవీ సింధు. 

టోక్యో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ స్వర్ణాన్ని చెన్ యుఫెయ్ (చైనా) కైవసం చేసుకుంది. ఫైనల్లో ఓటమిపాలైన చైనీస్ తైపే అమ్మాయి తై జు యింగ్ రజతంతో సరిపెట్టుకుంది. ఈ పోటీల్లో పీవీ సింధుకు కాంస్యం లభించింది. సెమీస్ లో సింధు... తై జు యింగ్ చేతిలోనే ఓడింది. అయితే పతకాలు ప్రదానం చేసే సమయంలో.... ఫైనల్లో ఓడినందుకు ఎంతో బాధపడుతున్న తై జు యింగ్ ను సింధు ఓదార్చింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఊరడించింది.

ఫైనల్స్‌లో ఓడిన అనంతరం  తై జుయింగ్  పెట్టిన పోస్టు భారత అభిమానులను ఆకట్టుకుంది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు ఫైనల్స్ ముందు తనను ఎంతగానో ప్రోత్సహించిందంటూ ఇన్‌స్టాగ్రాంలో సింధుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు.. ఫైనల్స్ ముందు నిస్వార్థంగా తనను ప్రోత్సహించిన తీరు, ఫైనల్‌లో ఓటమి తరువాత ఓదార్చిన తీరుతో భావోద్వేగానికి గురయ్యానని కన్నీళ్లు ఉబికి వచ్చాయని పేర్కొంది.

‘‘ఫైనల్‌లో నా ఆట సంతృప్తిగానే అనిపించింది. మ్యాచ్ ముగిశాక సింధు నా వద్దకు వచ్చి కౌగిలించుకుని.. నువ్ బాగా ఆడావ్, కానీ ఈ రోజు నీది కాదు అని నన్ను హత్తుకుని ఓదార్చింది. ఆమె ఓదార్చిన తీరుకు నాకు కన్నీళ్లొచ్చాయి. సింధు మద్దతుకు, ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు’’ అని ఇన్‌స్టా ఖాతాలో తైజు పోస్ట్ చేసింది.సింధు మాటలతో తై జు యింగ్ కన్నీటి పర్యంతమైంది. సింధు ఓదార్చిన తీరుతో తాను తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యానని తై జు చెప్పింది. సింధూ... నువ్వందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అంటూ తైజుయింగ్ పోస్ట్ చేసింది.