యంగ్ టీంతో రాహుల్ దూకుడు.. కాంగ్రెస్ లో పీకే ఎఫెక్ట్? 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోవచ్చును. ఆ బాధ్యతలను తీసుకునేందుకు ఆయన ప్రస్తుతానికి సిద్దంగా లేరన్నది కూడా నిజమే కావచ్చును. కానీ, అవసాన దశకు చేరుకున్న పార్టీని బతికించుకోవాలనుకునే ఆకాంక్షతో రగిలిపోతున్ననాయకులలో ఆయనే ముందుంటారు. పార్టీకి పూర్వ వైభవ స్థితి తీసుకొచ్చేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నివాదులు కునేందుకు  ఆయన సిద్ధంగా లేరు.అవును, గతంలో రాహుల్ గాంధీ రాజకీయ అవగాహనా కొంత భిన్నంగా ఉండేది, ఆయన వ్యవహారశైలి అంటీ ముట్టనట్లుగా ఉండేది. అందుకే, కొదరు రాజకీయ విశ్లేషకులు ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదని, కాలేడని తీర్పు నిచ్చేశారు. అంతే కాదు ఇంకా చాలా విధాలుగా ఆయన్ని చిన్నగా చూపించే ప్రయత్నం జరిగింది. 

కానీ ఇటీవల కాలంలో ఆయనలో మార్పు వచ్చింది. రాజకీయ అవగాహన, పోకడలలో  మార్పు కనిపిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గోవా ప్రభుత్వాన్ని చేజార్చుకున్న అనుభవంతో కావచ్చును,గతంలో కంటే చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధాని మోడీకి ప్రత్యర్ధి ఎవరు, అన్న ప్రశ్నకు సమాధానంగా తనను తాను మలుచుకుంటున్నారు. కావచ్చును. ఆయనలో వస్తున్న మార్పుకు, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కారణం అయితే కావచ్చును. ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ ఫాక్టర్ కర్ణం అయినా కావచ్చును. అయినా, తెర వెనక ఎవరున్నారు, తెర ముందు ఎవరున్నారు అన్నది కాదు. తెర మీద బొమ్మ పడిందా లేదా అన్నదే పాయింట్. రాజకీయాలలో రాణించడానికి అదే కీలకం. 

రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ మార్పు కారణంగానే నవ జ్యోతి సింగ్ సిద్దు  పంజాబ్ పీసీసీ కెప్టెన్ అయ్యారు. అటు సిద్దు, ఇటు రేవంత్ ఇద్దరి విషయంలో పార్టీ  సీనియర్ నాయకులు, పంజాబ్ ‘లో అయితే ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా సీనియర్ నాయకులు  చాలా చాలా చిక్కులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా, రాహుల్ పట్టించుకోలేదు. సీనియర్లకు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు.ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ కట్టి పడేస్తున్నారు.  ఈ నేపధ్యంలోనే బీజేపీకి, మోడీకి భయపడే నాయకులు, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎదుర్కునే సత్తాలేని పిరికి నేతలు తనకు అక్కర లేదని, అలాంటి వారు  బయటకు పోవచ్చిని ఎగ్జిట్ మార్గం చూపించారు. 

ఇప్పిడిక రాజస్థాన్ పై దృష్టి పెట్టారు. రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి  విజయ మాకన్. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గత వారాంతంలో మూడు రోజులు రాష్ట్రంలో మకాం చేసి, మొత్తం 115 మంది పార్టీ ఎమ్మెలలో వందమందికి పైగా ఎమ్మెల్యేలను కలిశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం డిమాండ్ చేస్తున్న మంతివర్గ పునః వ్యవస్థీకరణ, సంస్థాగత మార్పుల గురించి ఎమ్మెల్యేలతో విడివిడిగా ఉమ్మడిగా చర్చించారు. పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు. రానున్న కొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ పంజాబ్ తరహాలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసి మాజీ అధ్యక్షుడు  సచిన్ పైలట్ మధ్య ఇంచుమించుగా సంవత్సరానికి పైగానే ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఈ వివాదాన్ని మరింత కాలం మురగనీయడం మంచి కాదని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే అని మకాన్ స్పష్టం చేశారు. అయితే,పైలట్ బెదిరింపులకు భయపడేది లేదని, ముఖ్యమంత్రి వర్గం గత సంవత్సరకాలానికి పైగానే అధిష్టానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితిలో రాహుల్ గాంధీ  తెలంగాణ, పంజాబ్’లలో  తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ స్టాండ్ రాజస్థాన్’లోనూ తీసుకోగలరా, అనేది చూడవలసి వుంది.

అయితే ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన బూస్టర్ డోసే పనిచేసిందో ... నిండా మునిగిన తర్వాత  చలేమిటి అనే చొరవే ఆయన్ని నడిపిస్తోందో కానీ, రాహుల్  గాంధీలో కొత్త ఉత్సాహం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు కాంగ్రెస్ పార్టీని కూడా కొత్త బాటలో నడిపిస్తుందని పార్టీ నాయకులు అయితే విశ్వాసంతో ఉన్నారు.