మజ్లిస్ మళ్ళీ కాంగ్రెస్ పంచన జేరబోతోందా

 

కొంత కాలం క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటిసాకులు చూపి కాంగ్రెస్ పార్టీకి తలాకులు చెప్పుకొని బయటపడిన మజ్లిస్ పార్టీ అధినేతలు ఓవైసీ సోదరులు ఆ తరువాత జరిగిన పరిణామాలతో వాపు, బలుపు రెండు వేర్వేరని బాగా అర్ధం చేసుకోవడంతో పూర్తిగా చల్లబడిపోయారు. ‘కిరణ్ కంటే జగన్ బెటర్’ అని వారు జగన్ మోహన్ రెడ్డి కి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, వారి నోటి దురద ఏనాటికయినా తనకు ప్రమాదం తెచ్చిపెడుతుందని భయపడిన జగన్ కూడా వారిపట్ల సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు ఓవైసీ సోదరులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిగ్నల్స్ ప్రసారం చేసినప్పటికీ వాటిని అటువైపు నుండి ఎవరూ రిసీవ్ చేసుకోకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు. ఇక వారు గతంలో కబ్జా చేసిన ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్నరెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంను ఇప్పుడు స్వాదీనం చేసుకోవడానికి కిరణ్ ఆదేశించడంతో, ఇక లాభంలేదని భావించిన మజ్లిస్ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ నేరుగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహను నిన్న కలిసారు.

 

దాదాపు అర్ధగంట సేపు సాగిన వారి సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజనను మేము వ్యతిరేఖిస్తున్నాము. గానీ తప్పనిసరి అయితే కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా అయితే మేము మద్దతు ఇస్తామని తెలియజెప్పడానికే వచ్చాము” అని చెప్పారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఆమోదం తెలుపనంత మాత్రాన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజనపై నిర్ణయం తీసుకోకుండా ఆగిపోదు. ఆ విషయం తెలిసి ఉన్నపటికీ పనికట్టుకొని మరీ వెళ్ళింది తమ అమూల్యమయిన అభిప్రాయం తెలియజేయడానికి కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్ళీ కాంగ్రెస్ తో ముందుగానే పొత్తుల సంగతి మాట్లాడుకోకపోతే, ఆనక డిల్లీలో టికెట్స్ ఖరారు అయిపోతే అప్పుడు చేయగలిగేదేమీ ఉండదని గ్రహించడం వలనే ఓవైసీ సోదరులు ఓమెట్టు దిగివచ్చి దామోదరుడిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. పనిలోపనిగా తాము కబ్జా చేసిన రెండెకరాల భూమిని తమకే వదిలిపెట్టమని అడిగినా అడిగి ఉండవచ్చును.

 

కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖించే ఆయనను కలవడం ద్వారా తమ పని సానుకూలం అవుతుందని వారు మళ్ళీ దురాలోచన చేసినట్లు కనబడుతోంది. కానీ, దానివల్ల వెళ్ళిన పని సానుకూలం కాకపోగా మరింత క్లిష్టం అయ్యే అవకాశం ఉంది. అంతకంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడు బొత్సని కలిసినా వెళ్ళిన పని అయ్యేదేమో!