టీఆర్ఎస్‌తో దోస్తీ కటీఫ్!.. రేవంత్‌కే ఓవైసీ సపోర్ట్! అందుకేనా డిప్యూటీ సీఎం కిరికిరి?
posted on Jul 26, 2021 3:52PM
ఆల్ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్-AIMIM. పాతబస్తీకే పరిమితమైన పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉనికి చాటుకుంటోంది. బీజేపీని గెలిపించడానికే అన్నట్టు.. ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. తాను ఒకటో రెండే సీట్లు గెలుస్తూ.. బీజేపీకి మాత్రం గంపగుత్తగా ఆధిక్యం కట్టబెడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం నడుస్తోందనే అనుమానం. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్‌తో ఎమ్ఐఎమ్‌కి జిగ్రీ దోస్తానా ఉంది. బాయీ బాయీ అంటూ కేసీఆర్ ఓవైసీలు ఒక్కతాటిపైన నడుస్తుంటారు. కారు స్టీరింగు తమ చేతుల్లోనే ఉందంటూ మజ్లిస్ కవ్వించినా.. కొన్నిచోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినా.. ఆ రెండూ దొందు దొందేనని అందరికీ తెలుసు.
అధికార పార్టీతో అంటకాగకుండా మజ్లిస్ రాజకీయం చేయదు. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీకి మిత్రపక్షం. కాంగ్రెస్ పవర్‌లో ఉంటే కాంగ్రెస్‌కు స్నేహ హస్తం. టీఆర్ఎస్ గెలిస్తే.. కారులో షికారు. పాతబస్తీలో తమ సామాజ్యం పదిలంగా ఉంచుకోడానికి.. అటువైపు ప్రభుత్వం, అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా చేసుకోవడానికి దశాబ్దాలుగా ఎమ్ఐఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇది. ఇదే పాయింట్ మీద టీఆర్ఎస్‌తో మజ్లిస్ స్నేహం చేస్తోందని అంతా అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్ మీద.. అదే మజ్లిస్ పార్టీ.. టీఆర్ఎస్‌కు హ్యాండ్ ఇవ్వబోతోందని చెబుతున్నారు. అందుకు కారణం.. రేవంత్‌రెడ్డి.
అవును, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే వారిద్దరి దోస్తానాకు పరోక్షంగా కారణం అవుతున్నారు. గాలి వీచే వైపునకే పతంగి ఎగురుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ హవా మొదలైంది. రేవంత్‌రెడ్డి క్రేజ్ యమ జోరుగా సాగుతోంది. గట్టిగా ట్రై చేస్తే.. ఈసారి కాంగ్రెస్‌దే అధికారమనే ప్రచారం నడుస్తోంది. ఇదే ఓవైసీని పునరాలోచనలో పడేసిందని అంటున్నారు. ఎలాగూ కాంగ్రెస్‌తో పాత స్నేహం ఉండనే ఉంది. పాత దోస్తుతో కొత్తగా దోస్తీ చేయడానికి ఓవైసీ ఆసక్తిగా ఉన్నారట. ఆ మేరకు ఇప్పటికే రేవంత్‌రెడ్డికి మెసేజ్ పంపించడం.. అటునుంచి సైతం ఓకే అంటూ రిప్లై రావడం జరిగిపోయిందట. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చాక.. ఇక మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను మెలిపెట్టే పని మొదలుపెట్టిందని అంటున్నారు.
ఎన్నాళ్లైనా మీరు మాత్రమే పవర్‌లో ఉంటారా? మాకు ఏ మాత్రం షేర్ చేయరా? అనేది ఓవైసీ లేటెస్ట్ డిమాండ్. ఇన్నాళ్లూ మీకు సపోర్ట్ చేసింది చాలు.. ఇక మాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వండంటూ అడుగుతోందట మజ్లిస్ పార్టీ. ఏదో చిన్నా చితకా పదవి ఇస్తే ఊరుకోబోమని.. తమ వాడిని డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతోందని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి ప్రపోజల్‌నే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ముందు ఉంచిందని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇకపై ఎమ్ఐఎమ్ ఇలాంటి స్ట్రాటజీనే అప్లై చేయబోతోందని.. ముందుగా తెలంగాణ నుంచే ప్రారంభమని అంటున్నారు. రేపోమాపో కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఆ అధికార బదిలీ సవ్యంగా సాగాలంటే.. తమకు డిప్యూటీ సీఎం పోస్ట్ తప్పకుండా ఇవ్వాల్సిందేనంటూ కొర్రీ పెడుతున్నారట ఓవైసీ.
మజ్లిస్ అంత దూకుడుగా ఉండటానికి కారణం రేవంత్‌రెడ్డే అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కొత్త రెక్కలు తొడగడం.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేలా అడుగులు వేస్తుండటంతో.. అవసరమైతే రేవంత్‌రెడ్డికి జై కొట్టేందుకు ఓవైసీ రెడీ అవుతున్నారట. ఈలోగా కేసీఆర్‌తో కుదిరిన కాడికి బేరసారాలు ఆడైనా.. బ్లాక్‌మెయిల్ చేసైనా.. డిప్యూటీ సీఎం పదవి పట్టేయాలనేది మజ్లిస్ ఎత్తుగడ. కేసీఆర్ హర్ట్ అయి తమను కాదు పొమ్మంటే.. కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వొచ్చని.. లేదంటే, ఎన్నికల నాటికి హస్తం పార్టీ హవా పెరిగితే.. తమంతట తామే రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొచ్చనేది.. ఎమ్ఐఎమ్ మైండ్‌గేమ్‌గా తెలుస్తోంది. మరి, ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి...