మోడీ టార్గెట్ గా ఢిల్లీకి దీదీ! ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేనా?

ఆమె ఎమ్మెల్యే కాదు .. కానీ,ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె ఎంపీ కూడా కాదు ... కానీ, ఆమే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు. ఇంతకీ ఆమె ఎవరు? ఇంకెవరు.. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ సభ్యురాలు కాకుండానే, ముఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ, తాజాగా ఎంపీ కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ గానూ ఎన్నికయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని మమతా బెనర్జీని పార్లమెంటరీ పార్టీ  ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు గతంలోనూ ఉన్నారు. కానీ ఇలా ఎంపీ కుండానే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఎన్నికైంది మాత్రం ఇద్దరే ఇద్దరు. ఒకరు సోనియా గాంధీ (1998) రెండు మమతా బెనర్జీ. చివరకు ఇందిరా గాంధీ కూడా  ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో (1977) యశ్వంత రావు చౌహాన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుని చేశారు. ఆయనే ప్రతిపక్ష నాయకునిగానూ బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి, ఆమె రాత్రికి రాత్రి దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి  విధించి.. ఆరేళ్ళు నియంత పాలన సాగించారు అనుకోండి. అయితే అప్పట్లో, నియంతగా,  హిట్లరమ్మగా ప్రసిద్ధి చెందిన ఇందిరకు కూడారాని అద్భుత ఆలోచన మమతా బెనర్జీకి వచ్చింది. ఎంపీ కాకుండానే పార్లమెంటరీ పార్టీ నాయకురాలయ్యారు.ఒకటనేముంది, పార్టీలోని అన్ని కీలక పదవులు ఆమె గుప్పిట్లోనే ఉంచుకున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆమె ఒక్కరే మగాడు మిగిలిన వాళ్ళంతా అంతే అనే జోక్ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు ఆ జోక్ మమతా దీదీకి సరిపోతుంది. 

మమతా బెనర్జీ అడుగులు మెల్ల మెల్లగా జాతీయ రాజకీయాల వైపు పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే మమతా బెనర్జీ ఈ నెల (జులై) 28 న ఢిల్లీ చేరుతున్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర  మోడీతో అధికార సమావేశంలో పాల్గొంటారు. ఇక అక్కడినుంచి నుంచి మోడీతో, ‘ఢీ’ కొనే ఆట మొదలవుతుందని, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న దీదీ, ఆ ఎన్నికల తర్వాత తోలి సారిగా ఢిల్లీ వస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేయడమే దీదీ ఢిల్లీ దండయాత్ర  ప్రధాన అజెండాగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె   వివిధ పార్టీల అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఇలా అన్ని పార్టీల నాయకులను సమన్మయ పరిచే బాధ్యతను, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంకు అప్పగించారు. ఆమె ఢిల్లీ వచ్చేసరికి, పవార్, చిదంబరం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని, ఆపై వ్యవహారం అంతా మమతా బెనర్జీ చుకుకుంటారని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకురాలిగా, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా తనను తాను ప్రకటించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే పని మీద తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త, ఈ మొత్తం వ్యవహారం సూత్రధారీ ప్రశాంత్ కిశోర్, నాలుగు రోజుల ముందుగా, జులై 22 నే ఢిల్లీ చేరుకున్నారు. మరోవంక మమతా బెనర్జీ కొందరు ముఖ్య నాయకులతో ఆన్లైన్ మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కొనసాగింపుగా, 28 సమావేశం ఉంటుంది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా హాజరవుతారా లేదా అనేది తేల లేదు. అయితే సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అవతారని అంటున్నారు. బీజేపీ మాజీ మిత్రపక్షం  శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా, బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

మొత్తానికి, మోడీని ఓడించేందుకు మూడేళ్ళ ముందుగానే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకలు  తీరిన రాజాకీయ ఉద్దండులు అంతా, ప్రశాంత్ కిశోర్ కు జీ హుజూర్ అనడం కొంచెం విద్దురంగా ఉందని, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తపరిస్తున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ ఎవరి తరపున ఈ రాజకార్యం చేస్తున్నారు, అనేది కూడా అనుమానాలకు తావిస్తోందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.