త్రిష పొలిటికల్ ఎంట్రీ: మరో జయలలిత లోడింగ్.?
Published on: Tue Nov 24, 2026 1:28PM

తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష మరో సారి చర్చనీయాంశంగా మారారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఆమె అభిమానులు త్రిష పేరుమీద కొత్త వేదికను ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా ఆమెను దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు ఉన్న పురట్చి తలైవి బిరుదును గుర్తుచేసేలా, ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చకు తెర లేచింది.
ఈ వేదిక నిర్వాహకులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. త్రిష వ్యక్తిత్వం, దృఢత్వంలో జయలలిత లక్షణాలు కనిపిస్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే.. భవిష్యత్తులో విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ ప్రయాణం చేస్తే.. రాష్ట్రంలో జయలలిత తరహా పాలన వస్తుందన్నది ఆ వేదిక నిర్వాహకుల అభిప్రాయం. ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ, త్రిష రాజకీయ ప్రవేశానికి అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై నిర్వాహకులు పేర్కొన్నారు.
అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా, ఆమెకు ఈ వేదికతో ప్రత్యక్ష సంబంధం ఉందా అనే అంశాలపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు. ఇప్పటివరకు నటి త్రిష స్వయంగా రాజకీయ ప్రవేశంపై గానీ, టీవీకే పార్టీలో చేరడంపై గానీ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. కేవలం అభిమానుల ఆకాంక్షలు, కొత్త వేదిక ప్రారంభోత్సవ ప్రకటనల ఆధారంగానే ఈ రాజకీయ చర్చలు సాగుతున్నాయి.

ఈ పరిణామాలతో పాటు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన చర్చలూ తెరపైకి వచ్చాయి. గతంలో జయలలిత పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించినప్పటికీ.. ఆ ప్రాజెక్ట్ లేదా నటీనటుల ఎంపికపై ఎటువంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ.. జయలలితతో పోలికలు, బయోపిక్ ప్రస్తావనలు కలగలిసి త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే!
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
.webp)
, సినిమా షూటింగ్‌లు, వృత్తిపరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉండే త్రిష ఈ ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా రానున్న రోజులలో ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై తరఫున చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా జయలలిత వారసత్వం, సీఎం విజయ్‌తో రాజకీయ ప్రయాణ అంచనాల నేపథ్యంలో త్రిష పేరు చుట్టూ మొదలైన చర్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ ను పెంచింది.
మీకు నచ్చవచ్చు: విజయ్ ఇంటికి త్రిష.. సిఎం అవ్వబోతున్నాడా!
విజయ్ ఈవెంట్‌లో త్రిష సడన్ ఎంట్రీ.. ఊహించని ట్విస్ట్‌తో షాక్ తిన్న ఫ్యాన్స్!
[Actress Trisha, olitical Entry, Jayalalitha, Successor, Ilaiya Puratchi Thalaivi, Trisha Peravai, TeluguOne]


