ఆ అధికారి అక్రమ ఆస్తులు చూసి షాకైన  ఏసీబీ అధికారులు!!

 

అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపిస్తూ, అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీమ్ అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చ నీయాంశంగా మారాయి. ఈ పది రోజుల్లోనే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు. 

గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామచంద్రను లక్షా యాభై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న శివప్రసాదరావుని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్ల పై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతిపెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివ ప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని అలాగే బెంగుళూరులో సుమారు మూడు కోట్లు విలువ చేసే జి ప్లస్ సెవన్ అపార్ట్ మెంట్, హైదరాబాద్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్, బెంగళూరులోనే రెండు కోట్ల విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో ఒక కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు. ఇవికాక తన భార్య పేరుతో మరో రెండు యాక్సి ట్రీ హోటల్ ప్రైవేటి కంపెనీ, సీండ్రీస్ అనే రెండు సూట్ కంపెనీలను వాడుతున్నారు.మనీ ట్రాన్సక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ ఎకౌంట్ తెరిచాడు. 

ఇక రెండ్రోజుల క్రితం ఓ రైతు నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దారు గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎమ్మార్వోకు సంబంధించిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిర, చరాస్తులు, ఫిక్సెడ్ డిపాజిట్లు బయటపడటంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పని చేసిన ప్రతిచోటా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్ లో పదహారు లక్షల ముప్పై రెండు వేల నగదు, పదిహేను లక్షలు విలువ చేసే నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం, కోటి రూపాయల విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్లు. అతని భార్య బ్యాంక్ లాకర్ లో ఇరవై ఆరు లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓ వైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.