పుత్తూరులో ఉగ్రవాదులు పోలీసులు మధ్య ఫైట్

 

రెండు రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకొన్నారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా వారు ఈ రోజు తెల్లవారు జామున ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాలో సరిహద్దు వద్దగల చిత్తూరు జిల్లాకు చెందిన పుత్తూరులో ఉగ్రవాదులు ఉంటున్న ఒక ఇంటిని చుట్టుముట్టారు. వెంటనే స్పందించిన రాష్ట్ర పోలీసు బలగాలు, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏర్పరచిన ఆక్టోపస్ కమెండోలు కూడా అక్కడికి చేరుకొని ఈ ‘ఆపరేషన్ స్టార్’ లో పాల్గొంటున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు, కమెండోలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. లోపల ఇస్మాయిల్, ఫక్రుదీన్, ఒక మహిళా, మరియు ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.

 

పోలీసులు ముందు ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ లోపలకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేసారు. కానీ లోనకి ప్రవేశిస్తే గ్యాస్ సిలిండర్ పేల్చివేస్తామని వారు బెదిరించడంతో, ఆ ప్రయత్నం విరమించి వారిని ఆ ఇంటికి రంద్రం చేసి టియర్ గ్యాస్ షెల్స్ లను లోపలకి విసిరారు. ఉగ్రవాదులు లొంగిపోవడమో లేక పోలీసుల చేతిలో హతమవడమో తప్పదు. ప్రస్తుతం ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

 

ఈ రోజు తెల్లవారు జామున ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులలో తమిళనాడుకు చెందిన లక్షణ్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరణించగా, మరొక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు కొద్ది నెలల క్రితం తమిళనాడు మదురై జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీని హతమార్చేందుకు ఆయన వెళ్ళే దారిలో పైప్ బాంబ్ అమర్చిన కేసులో నిందితులు.