సమీక్షలు..ఫిరాయింపులను అడ్డుకుంటాయా..?

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ ఫిరాయింపులు ఇలాగే కొనసాగితే మంచిది కాదని, వీటిని అడ్డుకునేందుకు త్వరలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తామని చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆయా పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపులు మరీ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తమకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఉభయ రాష్ట్రాల్లోని అధికార పక్షాలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ దెబ్బకి టీడీపీ, వైసీపీలకు కోలుకొలేని దెబ్బ తగిలింది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం కేవలం మూడుకు పడిపోయింది. అదే విధంగా నలుగురు ఎంఎల్‌ఏలు, ఒక ఎంపీని గెలుచుకున్న వైసీపీకి ఆ సంతోషం లేకుండా చేశారు కేసీఆర్. మొత్తం వైసీపీ తరపున గెలిచిన వారందరిని విడతల వారీగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తమ పట్ల వ్యవహరించిన విధంగానే ఏపీలో వైసీపీ పట్ల టీడీపీ వ్యవహరిస్తోంది. ఏపీలో తమకు ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ పావులు కదుపుతోంది.

 

 

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాల తీరుపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఇదివరకటి రోజుల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారాలనుకుంటే వారు ఆయా పార్టీలకు, తమ పదవులకు సైతం రాజీనామా సమర్పించిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం తాము ఏ పార్టీ గుర్తుపై గెలిచామో? ఆ పార్టీ సభ్యత్వానికి, తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోగా..టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేతను విమర్శిస్తూ..దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీ గుర్తుపై గెలవాలని సవాళ్లు విసురుతుండటంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. నాయకత్వ లోపముందనో...నియోజకవర్గ అభివృద్ధి పేరుతోనో పక్కా ప్రణాళికతో పార్టీ మారడం తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతు . అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఈ నేతల వ్యాఖ్యలతో ఏకీభవిస్తే..అసలు ప్రతిపక్షాల అవసరమే లేదు కదా..? స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా..ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎక్కడా కనిపించలేదు. మరి ఆనాటి నుంచి ప్రతిపక్షాలు లేకుండానే పాలన సాగిందా.? ఇక్కడ మోసం చేస్తోంది..చేసుకుంటోంది తమను కాదు..ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని.

 

ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలోకి మారడమంటే ప్రజా విశ్వాసాన్ని అవహేళన చేసినట్లే. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుతోన్న నేతలు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. పార్టీ ఫిరాయింపులు చేసిన వారికి శిక్షలు అంతంత మాత్రమే. చట్టంలోని లోసుగుల్ని అడ్డం పెట్టుకుని స్పీకర్ అండదండలతో అధికార పార్టీలు వీరిపై అనర్హత వేటు పడకుండా రక్షిస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిని నేరగాళ్లుగా నిర్థారించేదాకా వేచి చూడకుండా ఉండవలసిన అవసరం లేకుండానే, సభా వ్యవహారాలకు అనర్హుడిని చేసే ఒక కఠిన చట్టాన్ని రూపొందించాలని సుప్రీం తాజాగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన పార్టీలను ఆలోచనలో పడేసింది