టిడిపిలోకి మాగుంట శ్రీనివాసులు..!!

 

 

 

రాష్ట్రవిభజనతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం...కాంగ్రెస్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

 

అయితే ఈసారి మాగుంట నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నారు. ఇదేగాని జరిగితే నెల్లూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి. గత ఉపఎన్నికలలో వైకాపా తరపున నెల్లూరు నుంచి పోటిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 2.91లక్షల భారీ మెజారిటితో గెలుపొందారు. దీంతో కడప తరువాత మరో కంచుకోటగా వైకాపా నేతలు నెల్లూరును భావించడం మొదలు పెట్టారు.



సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిల మద్యనే పోటీ ఉండబోతున్న తరుణంలో మాగుంట టిడిపిలో చేరి పోటీచేస్తే అది మేకపాటికి సవాలు విసిరినట్లు అవుతుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో పెద్ద బలగం ఉంది. దీంతో ఈ సారి నెల్లూరు లో రెండు దిగ్గజాల మధ్య పోటీ ఖాయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.