ఎయిర్ఇండియా విమాన ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు.

గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక, విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. ఇందులో తొలుత 24 మంది మృతిచెందినట్లు సమాచారం రాగా.. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. స్థానిక బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను తెలుసుకోనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu