తమిళనాడులో చిరంజీవి కామెడీ షో

 

చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి కేంద్ర మంత్రి పదవి చేప్పట్టి ఐదు సం.లు దాటినా, నేటికీ ఆయన రాజకీయాలపై కానీ, తన ప్రసంగాలపై పట్టు సాధించలేక నోరు విప్పిన ప్రతీసారి కూడా అభాసుపాలవుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వేరే గత్యంతరం లేకపోవడంతో, ఆయనకీ మాట్లాడటం తప్పడంలేదు. ఇంట గెలవలేకపోయినా రచ్చ గెలవచ్చనే సామెత ఎలాగు ఉంది గనుక దానిని నిజం చేసేందుకన్నట్లు ఆయన నేతృత్వంలో సీమాంధ్రలో బస్సు యాత్ర తుస్సుమనిపించుకొన్న తరువాత, పక్కనున్న కర్ణాటకలో విజయవంతంగా ప్రచారం చేసి వచ్చారు.

 

మళ్ళీ రేపటి నుండి సీమాంధ్రలో ప్రచారం మొదలుపెట్టే ముందు, ఓసారి అలా పక్కనున్న తమిళనాడులో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే వేపనపల్లిలో కూడా ఓ రౌండేసి రమ్మని డిల్లీ నుండి ఆదేశాలు రావడంతో ఆయన నిన్న అక్కడ వాలిపోయి, మంచి పంచ్ డైలాగ్స్ తో అక్కడి వారిని ఆకట్టుకొన్నారు. తమ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తాము అధికారంలోకి రాగానే వెంటనే కూడకుళంకు త్రాగునీరుతో బాటు సాగునీరు కూడా అందిస్తామని ఆయన గంభీరంగా హామీ ఇచ్చినపుడు, ప్రజలందరూ పకపకా నవ్వుతుంటే, పాపం ఆ చిరంజీవి కూడా వారిని ఒకే ఒక్క ముక్కతో మెప్పించగలిగినందుకు చాలా సంతోషపడిపోయారు. కానీ పక్కనున్న స్థానిక కాంగ్రెస్ నేతలు కూడకుళం అంటే అదేదో ఊరు పేరు కాదని, అదొక అణువిద్యుత్ సంస్థ అని దానిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారని చెవులో చెప్పడంతో చిరంజీవి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరయినా తేలికగానే ఊహించుకోవచ్చును.

 

ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆయన చెప్పే ఇటువంటి గొప్ప గొప్ప విజ్ఞానదాయకమయిన విషయాలను వినేందుకు తరలివచ్చి, తమ జనరల్ నాలెడ్జిని పెంచుకోగలుగుతున్నారు. కానీ మన రాష్ట్రంలో తెలుగు ప్రజలు మాత్రం పంతాలకు పట్టింపులకు పోయి, ఆయన వస్తే మొహాలు చాటేసి అజ్ఞానాంధకారంలోనే ఉండిపోతున్నారు పాపం. కనీసం మళ్ళీ రేపటి నుండి ఆయన యాత్ర మొదలు పెట్టినప్పుడయినా ప్రజలు ఆయన చెప్పబోయే నాలుగు మంచి ముక్కలు చేవినేసుకోకపోతే ఇక వారి కర్మ! అని వదిలేయక తప్పదు.