అల్పసంతోషంలో 'కర్ణాటక' ప్రియులు!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

   ABK Prasad, ABK Prasad biography, ABK Prasad profile,ABK Prasad jounalist, ABK Prasad Political Articles, ABK Prasad Exclusive Notes

 

 

 

కర్కాటకం 'బింది'స్తే కాటికముండదంటారు! కాని అదే కర్కాటకం 'వర్షిస్తేన'ట కాడీ, మోకూతడవనే తడవదట! ఈ రెండు సామెతలూ ఎందుకుపుట్టాయోగాని కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి, మరో ప్రత్యామ్నాయ దీటైన రాజకీయపక్షం లేని పరిస్థితులలో నిలువెల్లా అవినీతితో దేశావ్యాప్తితంగా భారీ 'గాయాల'తో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ వూపిరి పోసుకున్నట్టు భావిస్తోంది! కాని 'కర్కాటకం వర్షిస్తే కాంగ్రెస్ పాలనలో కాడీ, మోకూతడవవట! అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించుకున్నానన్న 'సంబరం'లో సీట్లసంఖ్యకు (122) దీటుగా ప్రజాబాహుళ్యం నుంచి వోట్ల శాతం లేదన్న సత్యాన్ని మభ్యపరచాలని ఆ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. కాని కాంగ్రెస్ కు పోలైన వోట్లు కేవలం 37 శాతం కాగా, మిగతా పెద్దా, చిన్నా చితక పార్టీలన్నింటికీ పోలైన మొత్తం వోట్లు 63 శాతం! వీటిలో చిన్నా, చితకా పార్టీలు పోనూ కాంగ్రెస్ కు ప్రధాన పోటీదారు, నిన్నటిదాకా అధికార పక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ (బి.జె.పి.) గతంకన్నా 70సీట్లు కోల్పోగా, బిజెపితో సమానస్థాయిలో సీట్లు గెలుచుకున్న జనతాదళ్ (సెక్యూలర్)పార్టీకి ఈసారి అదనంగా 12 సీట్లు గుంజుకోగల్గింది.


అయితే అన్నింటికన్నా ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం, కర్ణాటక వరకు చాలా కాలంగా బరాబరి పోటీలో ఉంటూ వస్తున్నది [కొన్నాళ్ళపాటు దేవగౌడా పార్టీ తప్ప] సెక్యూలర్ వ్యతిరేకి అయిన "హిందూత్వ'' గ్రూపు బిజెపి మాత్రమే! అందువల్ల 'సెక్యూలరిజం' పేరిట మత రాజకీయం చేయడానికి సంకోచించని కాంగ్రెస్, బిజేపిల మధ్య మాత్రమే కర్ణాటక వరకూ ప్రధానమైన పోటీ గమ్మత్తేమంటే, ఈ రెండు పార్టీలను తోసిరాజనగల బలమైన మూడవ రాజకీయశక్తి ఏదీ ఎదిగి రాకపోవడంవల్ల కర్ణాటక మెజారిటీ ప్రజాబాహుళ్యానికి మరొక విశ్వసనీయమైన శక్తి కన్పించనందున ప్రధాన ఎన్నిక కాంగ్రెస్-బిజేపిల మధ్య పోటీకే పరిమితం కావలసివచ్చింది.

 

ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక అంశంపై కేంద్రీకరించింది - "బిజెపి అవినీతి పాలనను అంతం చేయండి'' అన్న నినాదంపైన!  అదే నినాదాన్ని కర్ణాటక కాంగ్రెస్ లంకించుకుంది. అక్కడ పోటీ వరకూ బిజెపి అవినీతిలో కాంగ్రెస్ అవినీతిని ప్రత్యామ్నాయంలేని దశలో వోటర్లు చూడగాలిగినా వోటర్లకు మరో దిక్కులేని పరిస్థితి. కాగా అసలు విషయం - కర్ణాటకలో తక్కువ శాతం వోట్లతో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ఫలితాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని కొందరు 'చంకలు గుద్దు'కుంటూ అల్పసంతోషం వ్యక్తం చేసి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్సే 'పాగా'వేయగలదని భావిస్తున్నారు. "కర్నాట్టకలో బిజెపి పాలన (సోనియా మాటల్లో)అవినీతిమయం'' కాబట్టి అక్కడ బిజెపి వోడిపోయిందని కాంగ్రెస్ వారు భావించటం "గురువింద గింజ తన నలుపెరగదన్న''ట్టుగా దేశవ్యాపితంగా సంఖ్యాతీతమైన కుంభకోణాలతో తీసుకుంటూ 2014లో ప్రజలనుంచి పరాభవం చవిచూడబోతున్నదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలూ, ఢిల్లీలోని అధిష్ఠానవర్గమూ గుర్తించలేకపోతున్నారు. ఇది "మేకపోతు గాంభీర్యమై''నా కావాలి, లేదా సుప్రీంకోర్టు కేంద్రంపైన, సిబీఐపైనా పదే పదే పెడుతున్న మొట్టికాయల పట్ల అంతరంగికంగా పెరిగిపోతున్న 'గుబులు' అయినా కావాలి!

 

కర్ణాటకలో "బిజెపి అవినీతికి నిరసనగా''నే అక్కడి ప్రజలు తీర్పు చెప్పిన పక్షంలో అంతకన్నా వందరెట్లు కాంగ్రెస్ పాలనావ్యవస్థలోని వేళ్ళమీద లెక్కించదగిన ఏ కొలదిమందో తప్ప మిగతా రాజకీయాలు, అధికార యంత్రాంగమూ పేకమోయ్యా (ప్రధానమంత్రిసహా) అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీ కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని లేదా ఘోర పరాజయాన్ని తప్పించుకోలేదు; తప్పించుకోగల అర్హతను రోజుకొక తీరులో ఎన్ని కొత్త చిట్కాలు పన్నినా కాంగ్రెస్ కోల్పోతుంది. కర్ణాటక "విజయం''పై కాంగ్రెస్ వర్గాల్లోని అల్పసంతోషం 'స్థాయి' ఎలాంటిదో ఫలితాలు వెలువడిన రోజున (8-05-2013) పి.చిదంబరం కాస్సేపు తన ఆర్థికమంత్రి పదవిని పక్కకు నెట్టుకుని "టీవీ రిపోర్టరు''గా అవతారమెత్తి తనకు ఎదురైనా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి జస్వంత్ సింగ్ నోటిముందు మైక్ పెట్టి కర్ణాటక ఫలితాలపై వ్యాఖ్యానించమని వ్యంగ్యం ప్రదర్శించాడు. అందుకు జస్వంత్ యిచ్చిన సమాధానం : "ప్రజలెప్పుడూ సరైన పాలనకే వోటేస్తారు. సరైన పాలన అందించకపోతే నిన్నూ ఓడించేస్తారు'' అన్నాడు! దాంతో పాలుపోని చిదంబరం "చూడండి, ఆయన (జస్వంత్) ఎంత పెద్దమనిషో'' అని మైక్ ను విలేఖరికిచ్చేశాడు!

 

కాని ఈ 'అల్ప'సంతోషం' లో చిదంబరం తిరిగి తనకే ఎదురుతిరిగే ప్రశ్నలేన్నింటినో మరిచిపోయాడు! "ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందే''నని జస్వంత్ నోటనే పునరుక్తి దోషంతో వల్లెవేసినా, ఇంతకూ దేశంలో అవినీతి రహితమైన "సుపరిపాలన''ను కాంగ్రెస్ అందిస్తున్నదో లేదో నీళ్ళునమలకుండా చెప్పగల స్థితిలో చిదంబరం లేడు, ఆయనే కాదు, యు.పి.ఎ. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న యావత్తు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకని? ప్రపంచబ్యాంకు "ప్రజావ్యతిరేక సంస్కరణల''ను ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడివ్యవస్థకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థల (మల్టీనేషనల్ కంపెనీల)ను, వారితో మిలాఖత్తయి భారత పేద, మధ్యతరగతి వర్గాలను దోచుకుతినే స్థానిక గుత్తేదారులకు ప్రయోజనం చేకూర్చగల ఆర్థికవ్యవస్థను నిర్మూలించడానికే పాలనావ్యవస్థ కంకణం కట్టుకుంది కాబట్టి - కాంగ్రెస్, బిజెపిలు సుపరిపాలన అందించలేవని రుజువైపోయింది. అందుకే అమెరికాలో మాదిరే ఇక్కడ కూడా ప్రజాప్రయోజనాలకు అనుకూలమైన బలమైన మూడవ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని పెట్టుబడివ్యవస్థ ఎదగానివ్వదు. ఉన్న వామపక్షాల బలహీనతలను కాంగ్రెస్-బిజెపిలు ఇప్పటికే బాగా కాచివడపోశాయి!
 

ఈ పరిణామక్రమంలో భాగంగా దేశ ఆర్థికవ్యవస్థను కనీసం రాజ్యాంగ చటానికి ప్రాణప్రదంగా ఎంచుకున్న "ప్రియాంబుల్'' (ఉద్దీపన) మౌలికలక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దేదిపోయి ప్రకటిత సోషలిస్టు తరహా సంక్షేమ రాజ్యనిర్మాణానికి కట్టుబడకపోగా, ప్రజాస్వామ్య భావాలకు సహితం ఎసరు తెచ్చిపెడుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పాలన దోహదం చేయటం 'సుపరిపాలన' ఎలా అవుతుందో చిదంబరం చెప్పాలి! దేశ పారిశ్రామిక, వ్యవసాయక, సంక్షేమ, వస్తూత్పత్తి, సహకార రంగాలన్నిటా ప్రపంచబ్యాంకు "సంస్కరణల''ద్వారా విషమ ఫలితాలకు తలుపులు తెరవడాన్ని 'సుపరిపాలన'గా ఎలా చెప్పగలం? చివరికి కార్మిక చట్టాలను, బహుళజాతి గుత్తసంస్థల ప్రయోజనాలకు, వాటిని దేశంలోకి యధేచ్చగా అనుమతించడానికి వీలుగా సవరించడానికి అనుమతిస్తూ న్యాయవ్యవస్థను కూడా అందుకు అనుగుణంగా మరల్చడానికి గజ్జెకట్టిన కాంగ్రెస్-బిజెపి పాలనావ్యవస్థలను 'సుపరిపాలన'గా ఎలా ప్రజాబాహుళ్యం గుర్తించగలదు? 'సంస్కరణల' పేరిట ప్రభుత్వరంగ విస్తరణను కుంచింపజేసి లాభాల వేటకు అర్రులు చాచిన ప్రయివేట్, కార్పోరేట్ రంగాలను అనేక రాయితీలు కల్పించేందుకు కాంగ్రెస్, బిజెపి పాలనావ్యవస్థలను ప్రపంచబ్యాంకు కేవలం 'బ్రోకర్ ల'పాత్ర ("ఫెసిలిటేటర్'')స్థాయికి ఆదేశాపూర్వకంగా దిగజార్చడాన్ని ఎలా 'సుపరిపాలన'గా భావించగలం?

 

రూ 5 1/2లక్షలకోట్ల ప్రజాధనం బడా వర్గాలనుంచి రుణాల రూపేణా రిజర్వుబ్యాంకికి మొండిబకాయిలుగా మారడాన్ని అవి ఎగవేతలుగా మారడాన్ని 'గుడ్లు అప్పగిస్తూ' కూచునే పాలనావ్యవస్థల్ని 'సుపరిపాలన'గా ఎలా పరిగణించగలం? ఆ మాటకొస్తే స్విస్ బ్యాంకుల్లో ఏళ్ళూ వూళ్ళుగా మూలుగుతున్న భారతీయ బడావర్గాల సామూహిక నల్లధనం (బ్లాక్ మనీ)రూ.24 లక్షల కోట్లను ముట్టుకోడానికి సాహసించలేకపోయిన పాలనా వ్యవతలు 'సుపరిపాలన' కింద ఎలా జమకట్టగలం? దేశ సహజసంపదైన రేడియో తరంగాలను తమ హక్కు భుక్తం చేసుకుని దేశీయ టెలికాం వ్యవస్థను ప్రజల వినియోగానికి అందుబాటులో లేని 'మూల్యం' వసూలు చేయడానికి వీలుగా 122 లైసెన్సులను విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలకు బదలాయించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ లైసెన్సులను రద్దుచేసే దాకా 'నాలిముచ్చుగా' మౌనముద్ర నటించే పాలనా వ్యవస్థను 'సుపరిపాలన'గా ఎలా నమోదవుతుందో జస్వంత్, చిదంబరంలే సమాధానం చెప్పగలరా?
 

పైన తెల్పిన బకాయిలు, గుప్తధనం సహా దేశంలో సుమారు మరో పదిలక్షల కోట్ల రూపాయల దాకా చెలామణిలో ఉన్న దొంగడబ్బును వెలికి తీయడానికి [పదేళ్ళనాదే రిజర్వుబ్యాంకు ముందు అఫిడవిట్ లో కేంద్రం, దేశంలో చెలామణిలో ఉన్న పోటీ ఆర్థిక వ్యవస్థ విలువ రూ.5 లక్షల కోట్లని వెల్లడించింది] ముందడుగు వేయడంలో విఫలమైన పాలనా వ్యవస్థ 'సుపరిపాలన', ఆదర్శ పరిపాలన ఎలా కాగల్గుతుంది?
 

దేశీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో భాగస్వాములు కావలసిన చిన్న చిన్న రిటైల్ వర్తక వ్యాపారసంస్థలను సహితం మింగివేసే వాల్ మార్ట్ లాంటి బడా మల్టీనేషనల్ కంపెనీలకు 'ఎర' చేయడానికి దారులు తెరిచిన పాలనావ్యవస్థను 'సుపరిపాలన' కింద జనం ఎలా పరిగణిస్తారు? చివరికి ఇప్పటికే దేశ పేద, మధ్యతరగతి అసంఖ్యాక ప్రజాబాహుళ్యం మూల్గుల్ని పీల్చడంలో అగ్రస్థాయి కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వం పన్నులు, సబ్సిడీల రూపంలో ఎన్ని రకాలుగానో రాయితీలు కల్పిస్తున్నా చాలవన్నట్టు, మరిన్ని రాయితీల కోసం వత్తిడి చేస్తూ "రాయితీలు అడిగిన మేరకు కల్పించకపొతే విదేశీ గుత్త పెట్టుబడులను రానిచ్చేది లేద''ని విదేశీ కార్పొరేట్లు అవే రాయితీలను 'మాకూ' కల్పించాలని దేశీయ కార్పోరేట్లూ అలిగి, భీష్మించుకుకొని కూర్చుంటే వాటి వైఖరిని దుమ్ముదులిపేది పోయి 'దువ్వి' దగ్గరకు తీస్తున్న పాలనావ్యవస్థ 'సుపరిపాలన' ఎలా అందివ్వగలదు? ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని 23 బ్యాంకులూ, భీమా కంపెనీలూ 'హవాలా' ధనంతో లావాదేవీలు మాదకద్రవ్య వ్యాపారాలు సాగించడానికి వీలు కల్పించిన సంస్కరణలను తలకెత్తుకున్న పాలనావ్యవస్థ ప్రజలకు ఎలాంటి 'సుపరిపాలన'ను అందించగలదో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు?!

 

ఇటీవలనే ఒక బడా "ఈక్విటీస్'' సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని 54 బడాసంస్థల వద్ద నగదు రూపంలోకి మార్చుకోగల రూ.4,30,000 కోట్ల కిమ్మతుగల క్యాషు, దానికి సమానమైన ద్రవ్య మాధ్యమ పత్రాలు [వీటిని "పేపర్ ఇన్ స్ట్రుమెంట్స్'' అంటారు. వీటిని తేలిగ్గా నగదుగా మార్చుకోవచ్చు] ఉన్నాయని వెల్లడయింది! అంటే, దేశప్రయోజనాలకు వినియోగపడగల ఉత్పత్తి రంగానికి చెందిన ఉత్పాదక కార్యకలాపాలలో పెట్టుబడులుగా పెట్టే బదులు అనుత్పాదక రంగాలకు మరలిపోతోంది. ఇలా మరలి తరలిపోయే పెట్టుబడి దేశ స్థూల జాతీయోత్పత్తుల [జి.డి.పి.] విలువలో 4.3 శాతం ఉందని సాధికార అంచనా! ఈ తరలింపును అడ్డుకోకుండా పేదసాదలపైన, మధ్యతరగతిపైన మోయలేని భారాన్ని మోపి, నియంత్రణ వ్యవస్థలోనూ, అక్కౌంటింగ్, న్యాయవాద వ్యవస్థల్లోనూ విదేశీసంస్థల జోక్యానికి బీజాలు నాటిన పాలనావ్యవస్థ నిర్వాహకుల్ని 'సుపరిపలకులు'గా ఎలా గుర్తించగలమో కర్ణాటక ఫలితంపై 'జబ్బలు' చరుచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గుండెలమీద చేయి వేసుకుని చెప్పగలగాలి! ఇది దేశవ్యాపిత దృశ్యం! కర్నాటకం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఫలించదనుకోవడం భ్రమ!