మోడీ తీసుకున్ననిర్ణయానికి చంద్రబాబు హర్షం..


ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మోడీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని.. ప్రధాని నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వెయ్యి రూపాయల నోట్లను దాచినంత తేలిగ్గా రూ.100 నోట్లను దాచలేరని, అందుకే చాలా కాలంగా పెద్ద నోట్లను రద్దు చేయాలని పోరాడుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. నల్లధనం వల్ల ద్రవ్యోల్బణంతోపాటు రాజకీయ రంగం, పాలనా రంగాల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. డబ్బు పిచ్చికి ఇక బ్రేకులు పడతాయని.. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందని, దీని కోసమే ఇంతకాలం పోరాడామని వివరించారు.

 

కాగా నల్లధనాన్ని కట్టడి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నపేథ్యంలోనే తొలి అడుగుగా.. పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 30లోగా రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని.. డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేయనివారు..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. అయితే ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ 1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు.