జగన్ ప్లేస్ కోసమేనా పవన్ ప్లాన్...!

  రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అన్న దానికి పవన్ కళ్యాణ్ స్పీచే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్నటి వరకూ టీడీపీ పై ఎలాంటి విమర్సలు గుప్పించని పవన్.. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ పార్టీ పై లేదా బీజేపీ పై సెటైర్లు, విమర్శలు చేసే పవన్ ఈసారి మాత్రం టీడీపీ పైనే విమర్శలు గుప్పించారు. కేంద్రంపై, వైసీపీపై ఏదో రెండు మూడు విమర్శలు చేసినా.. టార్గెట్ మొత్తం టీడీపీపైనే చేశారు. ముఖ్యంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.   అయితే ఇక్కడే ఓ ఆసక్తిర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. అయితే ఆ విషయం జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే... వైసీపీ ప్రతిపక్షపార్టీ అన్న పేరే కానీ ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాడింది లేదు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. పోనీ తాను రాకపోయినా.. పార్టీ నేతలను అయినా పంపిస్తారంటే అదీ లేదు... తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు అని కండీషన్స్ పెడుతుంటాడు. సరే ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా.. దానిని పరిష్కరించకుండా.. నేను సీఎం అయిన తరువాత చేస్తా.. అప్పుడు చూస్తా అని కబుర్లు చెబుతుంటాడు. దీంతో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది. ఇక సీబీఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో.. విలీనమో.. ఖరారు చేసుకోవడానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష స్థానానికి పూర్తి స్థాయి ఖాళీ ఏర్పడింది.   ఇక దీన్నే పవన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీకి అనేక విషయాన్ని మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తే అంశాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ… పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ… విమర్శలు ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా.. పవన్ కల్యాణ్ .. టీడీపీకి పూర్తి స్థాయిలో తన విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలా వెళితేనే రాజకీయంగా ముందుంటామని నిర్ణయించుకున్నట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక నిజమైతే.. జగన్ సీఎం అవ్వడం ఏమో కానీ.... ప్రతిపక్ష నేతగా ఉండటం కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ఇలా రివర్స్ పంచ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటో పవన్ కే తెలియాలి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది ఘోరం!

  తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది నిజంగా ఘోరం, నేరం! తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేసేసి, అవసరమైతే డిస్మిస్ కూడా చేసేయాల్సినంత దారుణం. లేకపోతే ఏమిటండీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అసెంబ్లీలో కళ్ళకి, చెవులకి పని చెప్పి సైలెంట్‌గా కూర్చోవాలి. అధికార పార్టీ ఎలా పరిపాలించినా కిక్కురుమనకుండా పడి వుండాలి. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడమేంటసలు? పైగా బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం శ్రమపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తెలియజేయడమేంటి? తప్పుకదా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి తగిన శాస్తి చేయడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట.   అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. వాళ్ళ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన భలే నచ్చేసి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మిగిలిన కొద్దిమంది కూడా టీఆర్ఎస్ జీవన స్రవంతిలో కలసిపోయి ధన్యులైపోవాలి. అలా కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వుంది ఆందోళనలు చేయడం ఏమైనా పద్ధతిగా వుందా? పైగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గోలగోల చేయడం ఎంతమాత్రం బాగాలేదని టీఆర్ఎస్ నాయకులు ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఏంటీ? తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు చేసిన గోలతో పోల్చుకుంటే ఈ గోల ఏపాటిదని అంటున్నారా? అప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ మీద టీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరారని, మైకు లాగారని, ఎమ్మెల్యే జె.పి. మీద డ్రైవర్ చేత దాడి చేయించారని గుర్తు చేసుకోండని అంటున్నారా? అసలు మీ వాదనలో అర్థం వుందా? అప్పుడంటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏది చేసినా కరెక్ట్... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది తప్పున్నర తప్పు. అలాంటి తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు తగిన శిక్ష పడాల్సిందే.   అది సరేగానీ, తెలంగాణ విధాన మండలిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. అది డైరెక్టుగా వెళ్ళి ఛైర్మన్ గారి కంటిమీద తగిలింది. ఆ దెబ్బ చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కాబట్టి ఆ బాధని చాలాసేపు భరించారు. గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆయన ఆ బాధని భరిస్తూనే వున్నారు. ఆయన ఓర్పుకి జోహార్. ఆ తర్వాత ఆయన సీఎం గారి సలహా మేరకు కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. కంటి డాక్టర్లు ఆయన కంటికి డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు. గౌరవనీయులైన స్వామి గౌడ్ గారి కంటికి వున్న ఆ కట్టును చూసి తెలంగాణలో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. స్వామి గౌడ్ గారి కంటికి ఏమీ కాదని డాక్టర్లు భరోసా ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలి ఒక కన్ను పోతే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో! ఒక కంటితో ఆయన సమావేశం హాలు మొత్తాన్నీ ఒకేసారి చూడలేక చాలా ఇబ్బంది పడేవారు. అలా జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ రయ్యిమని దూసుకుని వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తగిన విధంగా శిక్షించాల్సిందే.

జగన్ కు వకాల్తా పుచ్చుకున్న బీజేపీ....

  వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో ఏంటో అందరికీ తెలిసిందే. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ తీరు నచ్చక పార్టీ నుండి కీలక నేతల సైతం జంప్ అవ్వడం ఇవన్నీ పార్టీ స్థాయిని ఎప్పుడో పడేశాయి. ఇక జగన్ పాదయాత్ర గురించి తమ ఛానెల్ కు తప్ప మరో ఛానెల్ కు గుర్తుండదు. అలాంటిది జగన్ గురించి జాతీయా మీడియాలో రావడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కారణం.. బీజేపీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎలాంటి సంబంధం లేకపోయినా... బీజేపీ మౌత్ పీస్ గా పేరున్న రిపబ్లిక్ టీవి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. అప్పుడే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటాయేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే చెబుతూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది... దాని గురించి వార్తలు రాయడం మానేసి.. సమయం సందర్బం లేకుండా... జగన్ కు వకాల్తా పుచ్చుకొని కొన్నిజాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుస్తాడు అని వార్తలు రాయడం పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ రకంగా బీజేపీ-వైసీపీ పొత్తు ఖాయమని తెలుస్తుంది. లేకపోతే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే పట్టించుకోవడం లేదుకానీ.. దేశంలో వార్తలు ఏం లేనట్టు జాతీయ మీడియా జగన్ కు గురించి ఇలాంటి రాతలు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. బీజేపీ హ్యాండ్ లేకపోతే ఇలాంటి వార్తలు రావడం.. అందులో జాతీయ మీడియా సంస్థల్లో రావడం అంటే కష్టం. మరి ఇప్పటికే 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారు.. ఈ వార్తలు చూసి వైసీపీ-బీజేపీ పొత్తు పై క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే ఏముంటుంది.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న సామెత లాగ ఉంటుంది..

అంతంత మాటలు ఎందుకు హరీష్ రావు గారూ...

   తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన ఆవేదన చూసిన వాళ్ళకి చాలా బాధ కలగడం ఖాయం. ఇంతకూ అయన ఆవేదనకి కారణం ఏమిటంటే, హరీష్ రావు తెరాస పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారని, ఒక ప్రముఖ పార్టీలో అయన జాయిన్ అవడానికి రంగం సిద్ధం అయిందని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అలాగే సీఎం కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకి వెళ్తారని, అందువల్ల హరీష్ రావు హర్ట్ అయి తెరాస పార్టీని విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.   ఇలాంటి వార్తలు తనని ఎంతో బాధకి గురి చేస్తున్నాయని హరీష్ రావు వాపోయారు. తాను కెసిఆర్ ఆజ్ఞని పాటించే వ్యక్తిని అని అంటున్నారు. తనమీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరించలేక పోతున్నా అని అయన అన్నారు. తన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి మీద పోలీస్ ఉన్నతాధికారులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసానని అన్నారు. తాను తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు తెరాసలోనే ఉంటానని, ప్రాణం పోయినా పార్టీ  మారను అని చెప్పారు.   అయినా హరీష్ ఇంతలా ఎందుకు హర్ట్ అవుతున్నారో అర్థం కాని విషయం. ప్రాణం పోయినా పార్టీ మారను అని పెద్ద పెద్ద మాటలు ఎందుకో. రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది మామూలు విషయం. అదేదో నేరం, ఘోరం కాదు. ఇప్పుడు తెరాసలో వున్న వాళ్లు పార్టీలు మారిన వాళ్లే కదా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే తెరాస విజయవంతంగా నడుస్తోంది కదా. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి రావడం మంచి విషయం... మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాత్రం చెడ్డ విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నారు, దీని వెనుక వేరే కారణాలు ఏవైనా వున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తిరగబడ్డ తెలుగుబిడ్డలు

  చెయ్యెత్తి జై కొట్టిన తెలుగుబిడ్డలు ఇప్పుడు తిరగబడ్డారు. ఇద్దరూ కూడబలుక్కుని కాకపోయినా, ఒకేసారి ఢిల్లీ ఆధిపత్యం మీద తిరబడటం యాదృచ్ఛికం. మొన్నటి వరకూ ఢిల్లీ ఆధిపత్యానికి సాహో అన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు ఎవరి దారిలో వారు తెలుగు పౌరుషాన్ని చూపిస్తున్నారు. ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎవరి దారిలో వారు తిరుగుబాటలో నడుస్తున్నారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు ఇద్దరూ తమ తమ రాష్ట్రాల హక్కుల సాధన కోసం  నిరసన గళం వినిపిస్తున్నారు.   నాలుగేళ్ళుగా ఢిల్లీ ప్రభువు నరేంద్ర మోడీ ఆధిపత్యం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణిగి మణిగి వుండక తప్పలేదు. చేతికి చిప్ప ఇచ్చి తరిమేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టె్క్కించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇంతకాలం అనేక అంశాల మీద మౌనం వహించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల అవమానాలను భరించారు. లోకల్ బీజేపీ నాయకుల తోక ఊపుడును సహించారు. సహనం ఎక్కువైపోతే మిగిలేది దహనమే అన్నట్టుగా ఆయన సహనం పరిధులు దాటిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల రూపంలో నిరసన వ్యక్తమైంది. పూర్తిగా తెగేదాకా లాగడం ఎందుకన్నట్టుగా కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతోంది.   ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ప్రధాని మోడీ మీద బోలెడన్ని సెటైర్లు వేశారు. ఆ తర్వాత మోడీ హవాని అర్థం చేసుకున్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతగా పొగిడినా కేంద్రం దగ్గర తెలంగాణ పప్పులు ఉడకకపోవడంతో మళ్ళీ రివర్స్ గేరు వేశారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటంట అని ధిక్కరించారు. మోడీని ’గాడు‘ అనే సాహసం కూడా చేశారు. అయితే ఆ తర్వాత నేనలా అనలేదని చెప్పేశారు. రాష్ట్రాల గౌరవం నిలబడాలంటే మూడో ఫ్రంట్ మొదటెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం ఒప్పుకోకపోవడంతో పోరాటం తీవ్రంచేశారు. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంమీద ఇద్దరు తెలుగుబిడ్డలూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

మోడీ, అమిత్ షా.. షాక్!

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్కసారిగా షాకయ్యారు. మనం ఎన్ని వేషాలేసినా కుక్కిన పేనుల్లా పడి వుంటార్లే... ఎదురు తిరిగే సాహసం కూడా చేయర్లే అని వీళ్ళిద్దరూ ఇంతకాలం అనుకున్నారు. ఇప్పుడు దేశంలో మన హవా నడుస్తోంది... వాళ్ళా మనమీద ఆధారపడి వున్న వాళ్ళు... అంచేత మనల్ని ఎదిరించే సాహసం వాళ్ళు చేయబోరు అని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది.. శాంతానికీ కోపం వచ్చింది... బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అలా జరగదులే అని నిశ్చింతగా వున్న ఇద్దరు పెద్ద మనుషులూ ఇప్పుడు ఒక్కసారిగా షాకైనట్టు సమాచారం. మరో ఏడాదిపాటు ఇలాగే ఇష్యూని సాగదీసి, ఏపీకి నిధులు రాకపోవడానికి చంద్రబాబు అసమర్థతే కారణం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి, ఆ తర్వాత వైసీపీతో పొత్తు పెట్టుకుందామని కలలు కన్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో భారీగా సీట్లు సంపాదించేసి, కేసుల్లో కొట్టుమిట్టాడుతున్న వైసీపీని ఓ మూలన కూర్చోపెట్టి అధికారం చెలాయించాలని ఊహించారు. అయితే వాళ్ళ ఊహలన్నీ ఉప్ఫుమని ఎగిరిపోయాయి. కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం వాళ్ళిద్దరి నెత్తిన తాటికాయలా మారింది.   కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం అనేది కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు... అది కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ప్రభావం చూపించే అంశం. కేంద్రంలో బీజేపీని పూర్తి మెజార్టీ వున్నప్పటికీ,  చాలా మిత్రపక్షాలు ప్రభుత్వంలో భాగస్వాముల్లా వున్నాయి. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది కాబట్టి ఆ పార్టీలన్నీ అవమానాలు ఎదురవుతున్నా భరిస్తూ పడి వున్నాయి. మిస్టర్ క్లీన్‌గా పేరు వుండటంతోపాటు, జాతీయ స్థాయిలో గౌరవం వున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఇప్పుడు బీజేపీకి ఎదురు తిరగడం ఒక పెద్ద మలుపు. ఇది మిగతా పార్టీల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే శివసేన బీజేపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమవుతూ వుంటుంది. మరికొన్ని మిత్రపక్ష పార్టీలకు బీజేపీ అంటే కోపం వున్నా ఇప్పటి వరకూ బయట పడలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో నుంచి బయటకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరికొందరు భయాన్ని వదలి బయటపడే అవకాశాలున్నాయి. అది 2019 ఎన్నికల్లో బీజేపీ మీద తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం... ఇవన్నీ గ్రహించే నరేంద్ర మోడీ, అమిత్ షా కలవరపడుతున్నట్టు సమాచారం.

చంద్రబాబును అధిగమించాలనే...

  దేశంలో మూడో ఫ్రంట్ రావాలని, దానికోసం తాను కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే టీఆర్ఎస్ వర్గాలు ఆనందంతో ఉరకలు వేయడం ప్రారంభించాయి. మూడో ఫ్రంట్‌కి కేసీఆర్ నాయకత్వం వహించేసినట్టు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినట్టు, తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు, కేసీఆర్ ప్రధానమంత్రిగా దేశం, కేటీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వున్నట్టు కలలు కనడం ప్రారంభించేశారు. కేసీఆర్ ఇలా థర్డ్ ఫ్రంట్ గురించి ప్రకటించారో లేదో... అలా పలు ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్‌కి ఫోన్ చేసి మరీ మద్దతు తెలిపారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ ఉత్తుత్తి వార్తలేనని, కేసీఆర్‌కి ఎవరూ ఫోన్ చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో ఆ పైవాడికే తెలియాలి.   తెలంగాణ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందర్నీ ఒక్కతాటి మీదకు తీసుకురావడం... ఆ తర్వాత ఎవర్ని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచి, తాను ఎక్కడ వుండాలో అక్కడే వుండే నైపుణ్యం కేసీఆర్‌కి బాగా వుంది. థర్డ్ ఫ్రంట్ విషయంలో కూడా కేసీఆర్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్ళినా, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన రాజకీయ చతురతతో సోనియాగాంధీనే మాయచేసిన టాలెంట్ ఆయన సొంతం. తన టాలెంట్‌ని సరైన విధంగా ఉపయోగించుకుని దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కేసీఆర్ భావించడం సమంజసమేనని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అకస్మాత్తుగా కేసీఆర్‌కి ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచన రావడానికి కారణమేంటనే పాయింట్‌ మీద అందరి దృష్టీ నిలిచింది.   కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం మామూలైపోయిందని కేసీఆర్ చెబుతున్నది పైపైన కనిపించే కారణం. అయితే లోపల వున్న అసలు కారణం చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఇమేజేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల అమరావతిని సందర్శించిన సందర్భంలో చంద్రబాబు లాంటి వ్యక్తికి ‘‘ఇంకా  పెద్ద బాధ్యతలు అందాలి’’ వ్యాఖ్యానించారు. అంబానీ అలా అనడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. చంద్రబాబు ప్రధాని అవ్వాలని ముకేష్ కోరుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అయితే తనకు జాతీయ రాజకీయాలకు వెళ్ళే ఉద్దేశం లేదని క్లారిటీగా చెప్పేశారు. ఈ సందర్భంలో తాను జాతీయ రాజకీయాలకు ఎందుకు వెళ్ళకూడదన్న ఫ్లాష్ కేసీఆర్‌ మదిలో వెలగడం వల్లే థర్డ్ ఫ్రంట్ ఆలోచన పుట్టుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు వున్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ సాధించే ఉద్దేశంతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అస్త్రంతో ముందుకు వచ్చారని అంటున్నారు.

ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నాం..

  బీజేపీ రాజకీయాలు, నరేంద్ర మోడీ వ్యూహాలు, అమిత్ షా ఆలోచనలు దేశ రాజకీయాల్లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి, ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి వీరి ప్లానులన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇదే తరహా ప్లాన్స్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయోగించి విజయం సాధించాలని అనుకున్న కమల నాథుల పథకాలు బెడిసికొట్టినట్టే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో మిత్రపక్షంగా వుంటూనే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి అధికారంలోకి రావాలని బీజేపీ వేసిన ప్లాన్ అట్లర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రావడం సంగతి అటుంచితే, ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది... ఇప్పుడు ఏపీలో మారిపోయిన పరిస్థితులను చూస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నాం అని పశ్చాత్తాప పడుతున్నట్టు తెలుస్తోంది.   ప్రత్యేక హోదా విషయంలో ఐదేళ్ళు కాదు.. పదేళ్ళు అని పార్లమెంటులో చాలా నమ్మకంగా చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఐదేళ్ళ సంగతి దేవుడెరుగు... ప్రత్యేక హోదా అనే హామీనే గుర్తు లేనట్టు వ్యవహరించడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి అందాల్సిన నిధులను కూడా సక్రమంగా అందించకపోవడం కూడా ఏపీ ప్రజలకు రుచించడం లేదు. ఇవన్నీ ఇలా వుంటే, ఆంధ్రాకి సాయం చేయకపోగా స్థానిక బీజేపీ నాయకులచేత రాజకీయాలు చేయించడం కూడా ఏపీ ప్రజలకు నచ్చడం లేదు. టీడీపీ మీద రాజకీయంగా ఆధిపత్యం సాధించి, వచ్చే ఎన్నికలలో అధికారం పొందాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నాటకాలు ఆడుతోందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎంతగా సర్దుకుపోవాలని ప్రయత్నించినా బీజేపీ రెచ్చగొట్టేట్టు వ్యవహరిస్తోందనే విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇన్నిరకాలుగా ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడింది.   ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నామన్న విషయాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జగన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని బీజేపీ అర్థం చేసుకునే నాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బీజేపీ కేంద్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో స్నేహాన్ని పెంచుకోవడానికి, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం బాగా తగ్గించారు. ఏపీ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను తొలగించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎలా వుంటుంది... ఇప్పుడున్న పరిస్థితులో అందుకు చట్టపరంగా ఏ మార్గంలో వెళ్ళాలనేది కేంద్రం ఆలోచనలో వున్నట్టు సమాచారం. అందుకే అన్నారు... అడుసు తొక్కనేల... కాలు కడగనేల అని..!

ప్రధాని పదవిపై కన్నేసినట్టున్నాడుగా...

  కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరికైన అర్గమవుతుంది. సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడంలో ఆయన దిట్ట. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న సెంటిమెంట్ ను ప్రజల్లో రగిల్చి... తెలంగాణ ఉద్యమం చేపట్టి.. ప్రజల మద్దతుతో ప్రత్యేక తెలంగాణను సాధించారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మరి ఇప్పుడు కేసీఆర్ కన్ను దేశ రాజకీయాలపై పడినట్టు ఉంది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.   ఇక ఇన్ని రోజులు మోడీపై ఎలాంటి విమర్శలు గుప్పించని కేసీఆర్ ఏమైందో ఏమో కానీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల నుండి మోడీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏం లేదని.. కాంగ్రెస్ కు బీజేపీకి పెద్ద తేడా లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  గ‌డ‌చిన 70 ఏళ్లుగా కాంగ్రెస్‌, లేదా భాజ‌పాలే ఎక్కువ కాలం దేశాన్ని పాలించాయ‌ని.. ఆ రెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు.. ఏదో పధకాలకు పేరు మార్చడం తప్ప చేసింది ఏం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ దొందూ దొందే... దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది..  దేశానికి ప్రత్యామ్నాయ అవ‌స‌రం క‌నిపిస్తోంద‌న్నారు. అంతేకాదు... దాన్ని థ‌ర్డ్ ఫ్రెంట్ అంటారో మ‌రేదైనా పేరు పెడ‌తారో అనేది త‌రువాత సంగతి.. అలాంటి ప్ర‌త్యామ్నాయ కూట‌మి కోసం తాను ప‌నిచేస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం విశేషం. దాని కోసం అవ‌స‌ర‌మైన వారితో మాట్లాడుతున్నాన‌నీ, దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేశారు కేసీఆర్‌. మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ, కొత్త‌గా రాబోయేది మూడో కూట‌మి కాద‌నీ.. అదే ప్ర‌థ‌మ ప్ర‌త్యామ్నాయం అన్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఆలోచన బాగుందని... తన మద్దతు కేసీఆర్ కు ఉంటుందని జనసేన అధినేత పవన్ చెప్పేశారు. ఇంకా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనకు ఫోన్ చేసిందని కూడా చెబుతున్నారు కేసీఆర్. ఇంకా పలు రాష్ట్రాల నుండి పలువురు ముఖ్యనేతలు ఫోన్లు చేశారని.. తమతో నడవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారని కేసీఆర్ చెబుతున్నారు. మరి చూడబోతే కేసీఆర్ కన్నుదేశ రాజకీయాలపై పడినట్టే తెలస్తోంది.జాతీయ రాజ‌కీయాలపై కేసీఆర్ లో ఆశ‌ పెరుగుతున్న‌ట్టుంది. ముఖ్యంగా ప్రధాని పదవికే కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అది మంచిదే కానీ... మూడో ప్ర‌త్యామ్నాయానికి నాయ‌క‌త్వం వ‌హించేస్తాన‌ని చెప్పడమే కాస్త అత్యాశగా ఉందని అంటున్నారు. నేరుగా చెప్ప‌క‌పోయినా ప్ర‌ధాని కావాల‌నే ఆశ‌ని కేసీఆర్ బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్ట‌యింది. మరి చూద్దాం కేసీఆర్ కలలు నెరవేరుతాయో.. లేదో..?

కలహాల కాపురం ఇంకెంతకాలం?

  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీల మధ్య వున్నది స్నేహమా, శత్రుత్వమా అనే ప్రశ్న బేతాళ ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. సాక్షాత్తూ విక్రమార్కుడే దిగివచ్చినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక గుడ్లు తేలేస్తాడు. విక్రమార్కుడి దాకా ఎందుకు... ఏపీ బీజేపీ, టీడీపీ నాయకులను అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరేమో... ఎందుకంటే వారు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నారో వారికే స్పష్టంగా తెలియదు మరి!   ఒకపక్క ఏపీ బీజేపీ నాయకులు టీడీపీతో అర్జెంటుగా తెగదెంపులు చేసుకోవాలని, వైసీపీతో స్నేహం చేసి వచ్చే ఎన్నికలలో అద్భుతమైన విజయాలు సాధించాలని తహతహలాడుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావలసిన నిధులకు బ్రేక్ వేసేపనిని విజయవంతంగా పూర్తి చేశారు. మరోవైపు రాయలసీమలో ఏపీ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ నిప్పుల కుంపటిని రగిల్చారు. ఇంకోవైపు ప్రభుత్వంలోనే వుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు... ఒకపక్క ఇవన్నీ చేస్తూనే మరోపక్క అధికారంలో భాగస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మిత్రుడు శత్రువుకు కూడా వుండకూడదని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. అన్నీ చేస్తున్నారుగానీ, టీడీపీ ప్రభుత్వం నుంచి బయటకి వచ్చే సాహసం మాత్రం చేయడం లేదు.   వీళ్ళ వ్యవహార శైలి ఇలా వుంటే టీడీపీ నాయకుల వ్యవహార శైలి మరోలా వుంది. కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. రాష్ట్రంలో వున్న బీజేపీ నాయకుల నుంచి తిట్లు, శాపనార్థాలు తింటూనే వున్నారు. వైసీపీ, బీజేపీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న స్నేహబంధాన్ని గమనిస్తూనే వున్నారు. అయినప్పటికీ కేంద్రంలో వున్న రెండు మంత్రిపదవులను వదలడానికి మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఏపీ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీల ధోరణిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.

తెలంగాణలో పొత్తు.. ఏపీలో చిత్తు...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంత చాతుర్యం కలవాడైనప్పటికీ అప్పుడప్పుడు పప్పులో కాలు వేస్తూ వుంటారు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం నిరూపణ అయింది. అప్పట్లో కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం తాను చేసిన ఒక పెద్ద తప్పు అని ఈమధ్య చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో తాను చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు భావించి వుండొచ్చు. కాలం పాఠాలు నేర్పిన తర్వాత తానెంత తప్పు నిర్ణయం తీసుకున్నానో అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భాలు చంద్రబాబుకే కాదు.. జీవితంలో దాదాపు అందరికీ వస్తాయి. చంద్రబాబు విషయానికి వస్తే, కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఎంత తప్పు నిర్ణయమో ఇప్పుడు అర్థమైంది. అలాగే గతంలో టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం కూడా ఎంత పెద్ద తప్పు నిర్ణయమో ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత తెలిసొచ్చింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశాలు వున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న తెలంగాణ టీడీపీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని చంద్రబాబు ఖండించలేదు. తెలంగాణతో మరో పార్టీతో పొత్తు వుంటుంది. అయితే ఏ పార్టీ అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని ఆయన అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు.. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే వుండదు.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ఉపయోగం వుండదు... అలాంటప్పుడు తెలంగాణలో మరో పార్టీతో పొత్తు అంటే టీఆర్ఎస్‌తోనే అని తెలంగాణ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిజంగానే వచ్చే ఎన్నికలలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది టీడీపీ భవిష్యత్తులో మరోసారి బాధపడే అంశం అవుతుందా?   తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... తెలంగాణలో టీడీపీ మళ్ళీ తలెత్తుకుంటుందా... ఈ రెండు పార్టీల పొత్తు సక్సెస్ అవుతుందా... తెలంగాణలో టీడీపీ అధికారంలో భాగం పంచుకుంటుందా అనే విషయాలను కాసేపు పక్కన వుంచుదాం. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందంటే మాత్రం అది ఏపీలో టీడీపీ మీద ప్రభావం చూపించే ప్రమాదం వుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు ఏపీలో టీడీపీని చిత్తు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కావడానికి టీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వుంది. అలాగే టీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర ప్రజల్ని తిట్టిన తిట్లు ఎప్పటికీ మరచిపోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ - టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో పొత్తు కుదిరిందంటే అది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనసుల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ, బీజేపీ పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఓటర్లు ఆ కూటమి వైపు మళ్ళే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల టీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో టీడీపీకి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితి వుంది.

మోడీని ‘గాడు‘ అనడం కరెక్టేనా?

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ వుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో... ఇప్పుడు బంగారు తెలంగాణని సాధించడానికి అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఆయన శ్రమ ఫలించి త్వరలోనే బంగారు తెలంగాణ సిద్ధించాలని, కష్టాలు, కన్నీళ్ళు, పేదరికం లేని బంగారు తెలంగాణ దేశం మొత్తానికీ ఆదర్శం కావాలని, దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కుళ్ళుకోవాలని కోరుకుందాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. రాష్ట్రానికి చెందిన అవసరాలను నెరవేర్చుకోవడానికి, హక్కులను సాధించుకోవడానికి కేంద్రంతో పోరాటం చేయాలి. ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న పని కూడా ఇదే. ఈ విషయంలో ఆయన్ని అభినందించి తీరాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రస్తుతం ముఖం చూసి బొట్టు పెట్టే తరహాలో వ్యవహరిస్తోందన్న విమర్శలు వివిధ రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తున్నారన్న ఆక్రోశం వినిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో మోడీ మరింత మొండిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్రం మీద పోరాటం ప్రారంభించేశారు. నిన్న మొన్నటి వరకూ మోడీని అభిమానిస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు మోడీ మీద వ్యతిరేకతని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న భాష మాత్రం అభ్యంతరకరంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మోడీని విమర్శించిన కేసీఆర్ ఒక్కసారిగా ‘‘మోడీ గాడు’’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ మాట విన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని సంబోధించాల్సిన తీరు ఎంతమాత్రం కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాక కూడా ఉద్యమ వేడి చల్లారని స్థితిలో కేసీఆర్ అనేకసార్లు మోడీని ‘‘సన్నాసి’’ లాంటి మాటలతో విమర్శించారు. అయితే నిన్న మొన్నటి వరకు మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ఆయన్ని ‘‘మోడీ గాడు’’ అనడం రాజకీయ వర్గాలలో ప్రకపనలు రేపింది.   కేసీఆర్ ఒకవేళ ‘‘మోడీ గారు’’ అనబోయి పొరపాటున ‘‘మోడీ గాడు’’ అన్నారా అనే సందేహం కొంతమందిలో ఏర్పడింది. అయితే ఈ విషయంలో హర్టయిన బీజేపీ వర్గాలు కేసీఆర్ మీద కారాలూ మిరియాలు నూరుతున్నాయి. అప్పుడయినా ‘నేను పొరపాటుగా అన్నాను’ అనే మాట కేసీఆర్ వైపు నుంచి రాలేదు. అంటే కేసీఆర్ ఆ మాటను ఉద్దేశపూర్వకంగానే అన్నారని భావించాల్సి వస్తోంది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తినే ‘సన్నాసి’ అని సంబోధించిన వ్యక్తి ఇప్పుడు ‘గాడు’ అని అనడానికి పెద్దగా జంకాల్సిన అవసరం లేదు. అయితే ఈ తరహా కామెంట్లు భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తుందనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం కేంద్రంలో మోడీ హవా నడుస్తోంది. ఏపీలో అణిగి మణిగి వున్న మిత్రపక్షం వినతులే ఆయన పట్టించుకోవడం లేదు.. అలాంటిది కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తూ వుంటే దాని పర్యవసానం ఎలా వుంటుందోనన్న ఆందోళనలు సగటు తెలంగాణ పౌరులలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ప్రధానిని అలాంటి ఘాటు మాటలతో విమర్శించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జరుగుతున్న డ్యామేజ్‌ని కేసీఆర్ గ్రహించాలని పలువురు కోరుకుంటున్నారు.

జగన్ వందరోజుల్లో సాధించినదేంటీ..?

టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి.. గతేడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్. నేటితో ఈ యాత్ర 100వ రోజుకు చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండు టెండలను.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ధృఢ సంకల్పంతో జగన్ తన యాత్రను సాగిస్తున్నారు. యాత్ర ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే అనారోగ్య సమస్యలు తలెత్తడం.. ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలతో జగన్ తన యాత్రను కొనసాగిస్తారా లేక.. మధ్యలోనే వదిలేస్తారా అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.   మొదట్లో కాస్త తడబడినా.. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి రాటుదేలారు. ప్రభుత్వంపైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదా విమర్శలు చేస్తూ యాత్ర సాగించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న నవరత్నాలను జగన్ జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాను అధికారంలోకి రాగానే.. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్.. అనాథలుగా మిగిలిన వృద్ధుల కోసం మండలానికో వృద్ధాశ్రమం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తో పాటు విద్యార్థులకు హాస్టల్ ఫీజు కోసం మరో రూ.20 వేలు, వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేలు వీలైతే మూడు వేలు పెంచుతానంటూ.. ప్రతిపక్షనేత చేస్తోన్న హామీలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ హామీలు నెరవేర్చాలంటే ఆయన ఆస్తులు అమ్మడంతో పాటు రూ. 5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమంటూ కామెంట్లు పడుతున్నాయి.   ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తానని జగన్ ప్రకటించడం.. ఏపీ ప్రయోజనాలకు దెబ్బ తీస్తోన్న కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాననడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఇక ఇదే సమయంలో తన అక్రమాస్తుల మకిలిని ప్రధాని మోడీకి సైతం ప్రతిపక్షనేత అంటించారు. ఇందూటెక్ వ్యవహారంలో తమకు న్యాయం చేయాల్సిందిగా మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థాన్ని ఆశ్రయించడం.. కోర్టు ఏకంగా ప్రధాని మోడీ కార్యాలయానికి నోటీసులు పంపడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి వందరోజుల పాదయాత్ర జగన్‌కు మిశ్రమ ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు.

అపర చాణుక్యుడికి 40 ఏళ్లు

నారాచంద్రబాబు నాయుడు.. టీడీపీ అధినేతగా.. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్‌గా.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన అతికొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇంత ఘనకీర్తికి బీజం పడి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. 66 ఏళ్ల జీవితంలో ఓ వ్యక్తి నాలుగు దశాబ్ధాలను రాజకీయాలకే కేటాయించడం ఒక్క చంద్రబాబు విషయంలోనే సాధ్యమైంది.   1977లో ఎమర్జెన్సీతో నాటి ప్రధాని ఇందిరాగాంధీని గద్దె దించి.. జనతాపార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు దేశప్రజలు. అప్పటికి చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించారు.. ఆ మరుసటి ఏడాది 1978 ఫిబ్రవరి 25లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. పార్టీలో చీలికలు, అసమ్మతి సెగలతోనే ఇందిర ఎన్నికలకు వెళ్లారు. అయితే ఇందిరా కాంగ్రెస్‌కు ఏపీలో అభ్యర్ధులు కరువయ్యారు. అప్పుడే ఇందిర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో యువతకి పెద్దపీట వేశారు. అలా తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా ఉన్న చంద్రబాబుకు చంద్రగిరి టికెట్ దొరికింది. అయితే బాబు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఆషామాషీ నేత కాదు.. పట్టాభి చౌదరి.. చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు.   ఎన్నికల్లో ఆయనదే విజయమని జనం మాట్లాడుకుంటున్న టైంలో.. బాబు వెంట ప్రచారం చేసే వారే లేరు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న చంద్రబాబు నాయుడు. తన మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. "అమ్మా మీ ఓటు నాకే" అంటూ ఓటర్లను కోరారు. అప్పటి రోజుల్లో ప్రచారం ఉండేది కాదు.. ఊళ్లో పెద్ద మనుషులకే ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించేవి ఆయా పార్టీలు.. అయితే చంద్రబాబు ప్రజల వద్దకే వచ్చి ఓట్లు అడగటంతో.. జనం కొత్తగా ఫీలయ్యారు. దీని ఫలితంగా ఫిబ్రవరి 27న వెలువడిన ఫలితాల్లో పట్టాభి చౌదరిపై 2494 ఓట్ల మెజారిటీతో బాబు ఘన విజయం సాధించారు.   అలా ఇందిరా గాంధీ పుణ్యాన జాతి గర్వించదగ్గ ఓ రాజకీయ వేత్త దేశానికి పరిచయమయ్యాడు. అక్కడి నుంచి చంద్రబాబు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అడుగ‌డుగునా ఎన్నో ఒడిదొడుకులు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నో స‌వాళ్లూ సంక్షోభాలు. అలాంటి స‌మ‌యాల్లో కూడా ధైర్యంగా నిల‌బ‌డి, అవ‌కాశాల‌ను వెతుక్కుంటూ స‌వాళ్ల‌ను అధిగ‌మించుకుంటూ సాగుతున్నారు. 40 ఏళ్ల అనుభవంలో పోరాటాలు.. నిర్మాణాలు.. నిర్ణయాలు.. మలుపుతిప్పిన అడుగులు.. అన్నీ కలబోసి ఏకం చేస్తే రూపుదిద్దుకున్న రూపమే నారా చంద్రబాబు నాయుడు. మోడ్రన్ తెలుగుజాతి నిర్మాతల్లో అగ్రస్థానాన నిలవగలిగిన వ్యక్తుల్లో బాబు ఖచ్చితంగా ఉంటారు. నిజంగా ఆయ‌న లేకుంటే.. రాజ‌కీయాల్లోకి రాక‌పోయి ఉంటే ఏమై ఉండేది అని ఒక్క‌సారి ఆలోచించుకుంటే ఎక్కువ‌మందికి క్వ‌శ్చ‌న్ మార్కే క‌నిపిస్తుంది.

బాబు చుట్టూ అష్టదిగ్భంధనం..?

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మాట విననివారిని.. తనకు అడ్డుగా ఉంటారని భావించిన వారిని బీజేపీ పెద్దలు ఎలా దారికి తెచ్చుకున్నారో దేశం మొత్తం చూసింది. తమిళనాడులోని కొందరిపై సీబీఐ, ఈడీలు ఇంకా ఫోకస్ చేస్తూనే ఉన్నాయి.. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏకంగా పోలీసులు సోదాలు చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో.. దీని వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభజన హామీలతో తనపై కయ్యానికి కాలుదువ్వడంతో పాటు బీజేపీయేతర శక్తులన్నింటిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాస్తంత గుర్రుగానే ఉన్నారు.   రాయబారాలతో టీడీపీ అధినేత మాట వింటే సరే. లేకపోతే బాబును ఎలా దారికి తెచ్చుకోవాలనే దానిపై కమలనాథులు.. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే మరుగున పడిపోయిన రెండు విషయాలను బీజేపీ తవ్వి తీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల మధ్యలో పుట్టిన ప్రత్యేక రాయలసీమ వాదం, తర్వాత జరిగిన పరిణామాలతో చల్లబడిపోయింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు హాడావిడి చేసినా జనం నుంచి స్పందన రాకపోవడంతో.. ఆయన కూడా ఆ ఆలోచనను విరమించుకున్నారు.   అయితే నిన్న జరిగిన సమావేశంలో ఏపీ బీజేపీ నేతలు రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించారు. కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలని.. హైకోర్టును సీమలో పెట్టాలని.. నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా విభజించాలని.. ఇంకా చాలా చాలా డిమాండ్లు తెరమీదకు తీసుకువచ్చి విభజన రాజకీయాలకు తెరలేపారు. ఇది జరిగిన కాసేపటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ కదిలింది.   ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న మత్తయ్య తాను అప్రూవర్‌గా.. మారుతున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనం కలిగించింది. ఇప్పటిదాకా చడీ చప్పుడు లేకుండా ఉన్న ఈ కేసులో ఉన్నపళంగా చలనం రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెపరేటిజంతో పాటు పాత కేసులు బయటకు తీసి చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేసి.. రాజీకి వచ్చేలా చేయాలని.. తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.  

మోడీ ఇక జగన్‌ను పక్కనపెట్టేస్తాడా...?

వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి జనంలో ఆదరణ తగ్గి.. వైసీపీ పుంజుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించి.. అందుకు తగినట్లుగా వ్యూహారచన చేశారు కమలనాథులు. జగన్‌ను బలపరిచేందుకు అస్త్రశస్త్రాలను కూడా రెడీ చేసి పెట్టింది. వీరి బంధంపై ముందు నుంచి వార్తలు వచ్చినప్పటికీ.. రాష్టపతి ఎన్నికలకు మద్దతు.. సంఘ్ పరివార్ నేతలతో వైసీపీ నేతల మంతనాలతో.. వైసీపీ-బీజేపీ ఫ్రెండ్‌షిప్ రాజకీయ సమాజానికి తెలిసింది.   సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని జగన్ ఓపెన్‌గా చెప్పడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ఇలోగా బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల్లో అన్యాయం జరగడం.. టీడీపీ-బీజేపీ మధ్య అగ్గిని రాజేసింది. మాటల యుద్దం శృతిమించిపోయి.. తెగదెంపులు చేసుకుంటేనే మంచిదనే స్థాయికి వ్యవహారం వెళ్లింది. ఇక ఏ క్షణమైనా కమల దళం నుంచి సైకిల్ పక్కకు తప్పుకోకతప్పదని.. జగన్‌తో చనువు పెంచుకోవచ్చు అనుకుంటున్న టైంలో.. మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీకి షాకిచ్చింది. ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో తాము పెట్టిన పెట్టుబడులు నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కోర్టు భారతప్రభుత్వానికి నోటీసులు పంపింది.   ఈ వ్యవహారంలో మోడీకి నోటీసులు పంపడంతో పాటు.. ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రధానమంత్రికే నోటీసులు వచ్చేలా.. ప్రధాని కార్యాలయానికే మచ్చ తెచ్చేలా పరిణమించిన.. జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రధాని మోడీ ఆగ్రహాంతో ఉన్నట్లు పోలిటికల్ టాక్. ఉన్నపళంగా పార్టీ నేతలతోనూ.. కేంద్రమంత్రులతోనూ సమావేశమై నోటీసుల గురించి చర్చించారట. ఇప్పటి వరకు మచ్చలేని పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. రాజకీయలబ్ధి కోసం అవినీతిపరులతో చేతులు కలిపితే... పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని.. ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఘటనలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. జగన్‌తో ప్రయాణంపై మోడీ- అమిత్‌షాలు ఆలోచనలో పడ్డట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కమల్.. చంద్రబాబును దువ్వుతున్నాడా..?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభిమానులు పెరుగుతున్నారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. సీఎంగా ప్రజారంజక పాలన, సమస్యలను సైతం సవాళ్లుగా తీసుకుని.. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఆయన పనితీరే అందుకు కారణం. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సంస్కరణలు, అడ్మినిస్ట్రేషన్, ఐటీ హంగులతో హైటెక్ సీఎంగా.. సీఈవో ఆఫ్ ది స్టేట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు. ఈ విధానాలతో ఆనాడు దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులకు మార్గదర్శిగా నిలిచారు. ఇక వ్యూహ, ప్రతివ్యూహాలు, రాజకీయ చతురతలో చంద్రబాబును అపర చాణుక్యుడిగా పేర్కొంటారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి బాబు జీవితం ఒక పాఠం.   తాజాగా తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సినీనటుడు కమల్‌హాసన్ తనకు చంద్రబాబు హీరో అని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు గతంలో ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కమల్.. టీడీపీ అధినేతను ఆకాశానికెత్తేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే బలమైనవని.. కానీ దేశసమైక్యత కోసం రీజనల్ పార్టీలు.. నేషనల్ పార్టీలతో కలిసి పనిచేయాలని.. అవసరమైతే హక్కుల కోసం తిరగబడాలని చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ- ప్రాంతీయ పార్టీల మధ్య వుండాల్సిన సంబంధం ఇదీ అని చంద్రబాబు దేశానికి తెలియ చేసారని.. మిత్ర పక్షంగా ఉంటూనే హక్కుల కోసం పోరాడటం, బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని చాలా ఖచ్చితం గా ప్రశ్నించడాన్ని దేశంలోని ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు.   2014కు ముందు ఏదో చేస్తాడని.. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలుపుతాడని.. కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా, పాక్‌లకు ధీటైన జవాబిస్తాడని సోషల్ మీడియాలో "నమో.. నమో.. నమో" అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది అంతా సవ్యంగానే జరుగుతోందన్న భ్రమలు కల్పించినా.. ఆ తర్వాతి ఏడాదికి సగటు భారతీయుడికి వాస్తవం తెలిసొచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు ఇలా ప్రతి అంశమూ.. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడంతో మోడీ ప్రభ నానాటికీ తగ్గిపోతోంది. దానికి తోడు తన మాట వినని వారిని నరేంద్రుడు ఏం చేస్తున్నాడో రోజూ చూస్తూనే ఉన్నాం.   విభ‌జ‌న హామీల విష‌యంలో బీజేపీతో చంద్ర‌బాబు క‌య్యానికి కాలుదువ్వుతున్న స‌మ‌యంలో.. మోడీని ఢీకొనే స‌రైన నేత‌గా బాబుకు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇప్పుడు బాబు నా రోల్ మోడల్ అని చెప్పడం ద్వారా.. కమల్ హాసన్ జాతీయ స్థాయిలో కొత్త సమీకరణలకు తెరలేపాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు తృతీయ ఫ్రంట్‌కు పూనుకుంటే.. దానిలో తనకూ స్థానం కల్పించాలని యూనివర్శిల్ హీరో ముందుగానే.. ఏపీ ముఖ్యమంత్రిని దువ్వుతున్నాడా అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. 

అసహనమా..? అక్రోశమా..? కట్టు దాటుతున్న కమలనాథులు..!!

దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే.. క్రమశిక్షణకు, కఠిన నియమాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ. కానీ ఇటీవలికాలంలో ఆ పార్టీ నేతలు కట్టుతప్పుతూ జనంలో బీజేపీని చులకన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ వాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోక పోగా.. ఏపీ కోసం మాట్లాడుతూ.. తమను ప్రశ్నిస్తున్న వారిని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.   తాజాగా ప్రత్యేకహోదా అంశంపై ఓ టీవీ ఛానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న.. సినీనటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.. ప్రజలు ఇంకా సహనంతో బీజేపీ నేతలను మాట్లాడనిస్తున్నారని.. ఇంకా ఎక్కువ మాట్లడితే తరిమి, తరిమి కొడతారని శివాజీ అనడం .. అక్కడే ఉన్న కాషాయ దళానికి చిర్రెత్తుకొచ్చి ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా దాడికి దిగబోతే పక్కనున్న ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. అసలు బీజేపీకి ఏమైంది.. ఎందుకు ఇంతలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటే.. ఒకప్పటి బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలే.. నేతలుగా ఎదిగారు.   కఠినమైన నియమాలతో.. గట్టుదాటితే తీవ్రమైన చర్యలు తీసుకునే ఆర్ఎస్ఎస్‌ శిక్షణతో.. బీజేపీలోకి అడుగుపెట్టిన వారు ఇప్పటికీ అదే దారిలో వెళ్తున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వలసనేతలకు బీజేపీ నియమాలు తెలియవు కాబట్టి.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పాలో తెలియక.. అక్రోశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. దాని వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప.. పరిష్కారం కాదన్నది వారు గుర్తించాలి. శివాజీపై జరిగిన దాడి ఏ పవన్ కళ్యాణ్ మీదనో.. మరే ఛరిష్మా ఉన్న నేత మీదో జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికైనా అగ్రనాయకత్వం చర్యలకు దిగి.. కట్టుదాటుతున్న నేతలను క్రమశిక్షణలో పెట్టాలని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీ ఏపీలో తోక పార్టీగా మిగిలిపోతుందా..?

జాతీయ పార్టీల హవా ఉత్తరాదిలో నడిచినట్లు దక్షిణాదిలో నడవదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల ముందు వాటి ఆటలు సాగవు. ఎంతపెద్ద కొమ్ములు తిరిగిన నేషనల్ పార్టీలైనా సరే... రీజనల్ లీడర్ల సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరన్నది ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హైకమాండ్ చేసిన పొరపాట్లతో చేతులారా తన ఘోరీని అదే కట్టుకుంది. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప జనం గుర్తించలేని పరిస్థితికి కాంగ్రెస్ చేరుకుంది. సరే.. అదిప్పుడు గడిచిన కథ.. వర్తమానంలోకి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో స్ట్రాంగ్‌గా ఎదగాలని కంకణం కట్టుకుంది.   కర్ణాటకలో అల్రెడీ ఒకసారి పవర్ రుచి చూసింది కాబట్టి.. అక్కడ అంతో ఇంతో బెటర్‌గానే ఉంది.. ఇక జయ మరణంతో తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిన కమలం.. రజనీ సపోర్ట్‌తో కానీ.. అన్నాడీఎంకే అండతో కానీ నాలుగు సీట్లు వెనకెసుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ ఎత్తుల ముందు కాషాయం నిలబడలేదు. ఎటోచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే పరువు కాపాడుకోవాలి.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.   అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని వదిలించుకునేందుకే బీజేపీ పెద్దలు రాజకీయాన్ని.. నడిపారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మిత్రధర్మాన్ని పాటించకుండా... ఎక్కడ దొరికితే అక్కడ తెలుగుదేశాన్ని కార్నర్ చేసింది బీజేపీ. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నేతలైతే ఢిల్లీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఓపికగా భరించిన టీడీపీకి తాజా బడ్జెట్‌తో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిలో భాగంగా తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే.. లేదంటే ఎవరి దారులు వారు వెతుక్కోవడమే అన్న సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత.   తెలుగుదేశం పక్కకు తప్పుకున్నా.. జగన్ అండతో గట్టెక్కాలని కమలనాథులు భావిస్తున్నప్పటికీ.. అదంత తేలిక కాదు.. వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏ మాట మీద నిలబడతాడో ఆయనకే కాదు.. పార్టీ శ్రేణులకే అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీజేపీకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్న చందాన తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదులుకుంటే.. కాంగ్రెస్, వామపక్షాల లాగా ఎవరో ఒకరు రాకపోతారా..? అన్నట్లు ఎదురుచూసే తోక పార్టీల లాగా బీజేపీ మారిపోతుందని విశ్లేషకుల అంచనా.